మనుషులా..? గ్రహాంతరవాసులా!
నల్లటి సూటు-బూటు-టోపీలతో పొడవుగా ఉండే వ్యక్తులు. ఎవరో? ఎక్కడివారో? ఎప్పుడు వస్తారో? తెలియదు. అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఎగిరే పళ్లాల(యూఎఫ్ఓ)కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నీ చెప్పవద్దని గట్టిగా వార్నింగ్ మాత్రం ఇస్తారు. వారి వేషధారణ, మాట తీరు, ఆహార్యం అంతా సాధారణ మనుషుల్లా అనిపించదు. అసలు వారు మనుషులేనా? అన్న అనుమానాలూ ఉన్నాయి.. వారే ‘మెన్ ఇన్ బ్లాక్’ (ఎంఐబీ). వీరి గురించి అమెరికాలో కథలుగా చెప్పుకుంటారు. ఈ ఘటనల ఆధారంగా ఎంఐబీ పేరుతో కార్టూన్, టీవీ సీరియళ్లు, సినిమాలు కూడా వచ్చాయి.
అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తులు ఈ ‘మెన్ ఇన్ బ్లాక్’. అమెరికాలో వీరు పలు చోట్ల రహస్యంగా సంచరిస్తుంటారని జనం ఇప్పటికీ చెప్పుకుంటారు. వీరు ఎలా ఉంటారన్న విషయాన్ని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోవడం గమనార్హం. కాలి బూట్లు, దుస్తులు, కంటి అద్దాలు, టోపీ, ఓవర్ కోట్ ఇలా అన్నీ నలుపు రంగులోనే ఉండటం వీరి ప్రత్యేకత. వీరు మాట్లాడేది ఇంగ్లిషే అయినా యాస మాత్రం స్థానికంగా వాడేది కాదని, వారి చర్మం రంగు, కళ్లు కూడా విచిత్రంగా ఉన్నాయని, కనుబొమ్మలు లేవని, కనుపాపలు మొత్తం ఒకే రంగులో ఉన్నాయని చూసిన వారు వెల్లడించారు. మనుషుల సహజ లక్షణాలకు విభిన్నంగా కనిపించడంతో వారు తప్పకుండా గ్రహాంతరవాసులే అయి ఉంటారనే వాదన మొదలైంది. ఒంటారియాలో ఓ హోటల్లోకి వచ్చిన వీరి దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి.
ఎలా వెలుగులోకి వచ్చారు?
మెన్ ఇన్ బ్లాక్ గురించి అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన ఘటనల్లో ‘మౌరీ ఐలాండ్’ ఘటన మొదటిది. 1947, జూన్లో ఫ్రెడ్ క్రిస్మన్- హరాల్డ్ డాల్ అనే ఇద్దరు తీరంలో పడవలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న ఆరు ఎగిరేపళ్లాలు దీవికి సమీపంగా వచ్చాయని, వ్యర్థాలతోపాటు లావాలాంటి తెల్లటి ద్రవాన్ని తమపై చిమ్మాయని ఆరోపించారు. ఆ వ్యర్థాల కారణంగా తమ పడవలో ఓ వ్యక్తికి చేయి విరగ్గా, కుక్క మరణించిందని చెప్పారు. వెంటనే నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు తమను సమీపించి ఇక్కడ జరిగిందేది బయటికి చెప్పవద్దని బెదిరించారని వాపోయారు.
1953లో మరోసారి!
అల్బర్ట్ .కె. బెండర్ అనే వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వైమానిక దళంలో పనిచేశాడు. అతనికి యూఎఫ్ఓలపై ఉన్న ఆసక్తితో 33వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్ సాసర్ బ్యూరో’ని స్థాపించాడు. అదేక్రమంలో ‘స్పేస్ రివ్యూ’ అనే పత్రికను నడిపేవాడు. దాని నిండా ఎగిరే పళ్లాల గురించిన వార్తలే ఉండేవి. అనతికాలంలోనే ఇతని సంస్థ, పత్రిక అమెరికాలోని 48 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందాయి. 1953లో ఎగిరేపళ్లాలకు సంబంధించిన అతని పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. పలు కొత్త విషయాలు కనిపెట్టాడు. వాటిని అదే ఏడాది సెప్టెంబరు సంచికలో ప్రచురిద్దామనుకున్నాడు. అకస్మాత్తుగా ‘మెన్ ఇన్ బ్లాక్’ వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. తాను ఎంతో కష్టపడి రాసుకున్న పరిశోధన వివరాలను వారి నోట విన్న బెండర్ నివ్వెరపోయాడు. ఈ విషయాలను ప్రచురించవద్దని హెచ్చరించడంతో బెదిరిపోయి వెనక్కుతగ్గాడు.
వాస్తవానికి వీరు ఎవరు?
వీరు మొత్తం ముగ్గురు వ్యక్తులని ప్రచారం ఉంది. అమెరికాలో ఎవరైతే తాము ఎగిరే పళ్లాలను, వింత వస్తువులను చూశామని చెప్పుకుంటారో, వారి వద్ద వీరు మరునాడు ప్రత్యక్షమయ్యేవారు. మీకు తెలిసిన ఏ సమాచారాన్నైనా బయటికి వెల్లడించవద్దని బెదిరించేవారని సాక్షులు తెలిపారు. వాస్తవానికి వీరు అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే పేరు తెలియని సంస్థల రహస్య ఏజెంట్లన్న ప్రచారమూ ఉంది. గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని, వదంతులను ప్రచారం చేసే వారిని కట్టడి చేయడానికి ఇలా బెదిరించే వారనే వాదనలూ ఉన్నాయి. మొత్తానికి ‘ఎంఐబీ’లు ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.