As mentioned above
-
‘తెల్ల’క్రౌర్యం లోతు చూపిన ‘నల్ల’బావి
చల్లారిన సంసారాలూ/మరణించిన జనసందోహం/అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి- అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడక్కడ ‘నల్లోళ్ల’ చరిత్రను తిరగతోడుతున్నారు. ఇంగ్లిష్‌వాడి దుర్మార్గాన్ని కళ్లారా చూపుతున్నారు. అజ్నాలా- అమృత్‌సర్‌కు 32 కిలోమీటర్లలో ఉంది. పెద్ద ఊరేమీ కాదు. కానీ చరిత్రలో దానికో ప్రత్యేకత ఉంది. ఇప్పుడా ఊరికి జనం తాకిడి ఎక్కువైంది. వారిలో చరిత్రకారులు, జర్నలిస్టులు మొదలు పురావస్తు శాఖ అధికారుల వరకు అందరూ ఉన్నారు. అక్కడి అవశేషాలను చూస్తే .. 156 ఏళ్ల కిందట భారత సైనికుడు పెట్టిన పొలికేక ఇంకా మార్మోగుతున్నట్టే ఉంటుంది. 1857 మే 10.. మీరట్‌లో సిపాయీలు ఈస్టిండియా కంపెనీ సైనికాధికారులపై తిరగబడ్డారు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా ఖ్యాతి గాంచిన ఆ సిపాయీల తిరుగుబాటు ఎందరికో స్ఫూర్తి. 1857 జూలై 30.. లాహోర్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) మియాన్ మిర్ కంటోన్మెంట్‌లోని 26వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 502మంది భారత సైనికులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రెజిమెంట్ నుంచి తప్పించుకుని అజ్నాలా మీదుగా పంజాబ్ చేరుకుని మీరట్ చేరాలన్నది వ్యూహం. విషయం తెలిసిన బ్రిటిష్ అధికారులు పంజాబ్‌లోని తమ అధికారులకు వర్తమానం పంపారు. ఆ మర్నాటి రాత్రికి రావీ నది తీరాన ‘దాదియన్ సోఫియన్’ గ్రామం వద్ద భారత సైనికులను పట్టుకున్నారు. ఆ నిశివేళ నెత్తురు ఏరులై పారింది. 220 మంది భారత సైనికుల్ని కాల్చి చంపి రావీలో పడేశారు. మిగిలిన 282 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆనాటి పోలీసు డిప్యూటీ కమిషనర్ ఫ్రెడ్రిక్ హెన్రీ కూపర్ ఆదేశం మేరకు అజ్నాలా తహశీల్దారు కార్యాలయానికి తరలించారు. అక్కడో చిన్న గదిలో (ఇప్పటికీ ఉంది)వీళ్లను కుక్కారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయి కొందరు కన్నుమూశారు. తరువాత పది మంది చొప్పున తీసుకువచ్చి 237 మందిని కాల్చేసి అక్కడకు దగ్గర్లోని బావిలో విసిరేశారు. (ఈ దుర్ఘటనకు ప్రత్యక్షసాక్షి, అజ్నాలా వాసి జగ్జీత్సింగ్ తన 95 ఏళ్ల వయస్సులో 1928లో జియానిహీరా సింగ్ దర్ద్ అనే జర్నలిస్టుకు ఇచ్చిన సమాచారం ఇది) మిగతా 45మందిని సజీవంగానే ఆ బావిలో పడేసి పూడ్చేశారు. ఆ బావి పేరే కాలియన్వాలా ఖూ (నల్లోళ్ల బావి). ఈ మారణకాండకు ఆదేశాలిచ్చిన హెన్రీ కూపర్ సైతం -ఆ చిన్న గదిలో అంతమందిని ఎలా బంధించారో తెలియక విస్తుపోయానని తన ‘క్రైసిస్ ఇన్ పంజాబ్’ అనే పుస్తకంలో రాసుకున్నారు. కాలక్రమంలో అదే స్థలంలో గురుద్వారా వెలిసింది. ఆ తరువాత 42 ఏళ్లకు ఆ గురుద్వారా పక్కన ఓ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు పునాదులు తీస్తున్నప్పుడు ఎముకలు, కపాలాలు బయటపడ్డాయి. ఇది అపశకునంగా భావించిన ప్రబంధక్ కమిటీ ఈ విషయాన్ని అమృత్‌సర్‌లోని చరిత్రకారుడు సురేందర్ కొచ్చర్, గురునానక్ విశ్వవిద్యాలయంలోని పురావస్తు శాఖకు తెలిపింది. సురేందర్ కొచ్చరే 2012 డిసెంబర్లో శోధన మొదలుపెట్టి బ్రిటిష్ కాలపు మృత్యుకుహరం ఇదేనని తేల్చారు. ఇందుకోసం పాత గురుద్వారాను కూల్చి వేసి ఈ ఏడాది ఫిబ్రవరి 28న తవ్వకాలు ప్రారంభించి మార్చి 2న పూర్తి చేశారు. ఇక్కడ దొరికిన వాటిని అజ్నాలా గురుద్వారా షాహిబ్గంజ్లో ప్రదర్శనకు పెట్టారు. ఇప్పుడా బావి పేరును షహీదాన్వాలా ఖూ (అమరవీరుల బావి)గా మార్చారు. ఈ తవ్వకాల్లో 90 కపాలాలు, కపాలాలున్న 26 ఆస్తిపంజరాలు, ఈస్టిండియా కంపెనీ రూపాయి నాణాలు 70, మూడు బంగారు పతకాలు, నాలుగు బంగారు కడియాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. బయటపడిన సైనికుల అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వీళ్ల పేర్ల జాబితాను ఆంగ్లేయ పాలకులు నాశనం చేయడంతో అసలు వీరే ప్రాంతం వారో తేల్చాలని చరిత్రకారులంటున్నారు. వీళ్లు పంజాబీలు కాదని, పర్బానీలని కొందరు వాదిస్తుంటే మరికొందరు పశ్చిమబెంగాల్ లేదా కేరళ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారంటున్నారు. వీళ్లు ఏ ప్రాంతానికి చెందిన వారైనా దేశం కోసం పోరాడిన యోధులయినందున అంత్యక్రియలు నిర్వహించి అస్తికలను గోవింద్వాలా షాహిద్ లేదా హరిద్వార్‌లో నిమజ్జనం చేయాలని గురుద్వారా ప్రబంధక్ కమిటీ కోరుతోంది. బావి ఉన్న ప్రాంతంలో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. 1919 నాటి జలియన్‌వాలాబాగ్ దురంతానికి నేటి బ్రిటన్ క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు మరో చీకటి కోణం బయటపడింది. సాధ్యమైనంత మేర వీటిని నమోదు చేయడం చరిత్రకారుల పని. స్వేచ్ఛావాయువుల కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుని, దేశ హితానికి పాటుపడడమే వారికి మన తరం సమర్పించే నిజమైన నివాళి. - అజ్నాలా నుంచి ఎ.అమరయ్య -
డీసీఎంఎస్ స్థలంపై టీడీపీ నేత కన్ను?
అనకాపల్లి, న్యూస్‌లైన్ : అనకాపల్లి నడిబొడ్డున ఉన్న కొట్లాది రూపాయల విలువైన డీసీఎంఎస్ స్థలంపై ఒక రాజకీయ నేత కన్నుపడింది. అప్పులలో కూరుకుపోయిన డీసీఎంఎస్ బకాయిలను చెల్లించేందుకు స్థలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి రావడంతో, దీనిపై దృష్టి పెట్టిన తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక నేత తనకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహం రచించి నట్లు వినికిడి. వాస్తవానికి డీసీఎంఎస్ గతంలో ప్రత్యేకమైన పరిస్థితులలో డీసీసీబీ నుంచి రుణం తీసుకుంది. అప్పు చాంతాడులా పెరగడంతో ప్రస్తుతం సింగిల్ సెటిల్మెంట్ కింద కోటీ 84 లక్షల రూపాయల వరకు చేరినట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే చోడవరం డీసీఎంఎస్ స్థలాన్ని విక్రయించాలని ప్రయత్నించినా కోర్టు వివాదాలు అడ్డుగా నిలిచాయి. దీంతో చుట్టూ తిరిగి విలువైన అనకాపల్లి డీసీఎంఎస్ స్థలంపై వ్యూహాత్మకంగా దృష్టి సారించిన తాజా తెలుగుదేశం నేత, తనకు దక్కేలా పాలకవర్గాన్ని పురమాయిస్తున్నట్టు సమాచారం. శనివారం డీసీఎంఎస్‌లో జరగనున్న సమావేశంలో అప్పును తీర్చేందుకు స్థలాన్ని సదరు నేతకు చెందేలా కొందరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం గుప్పుమంది. అయితే దీనిని సహకార అధికారులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏడాది పాటు డీసీఎంఎస్ పాలకవర్గం చేసిందేమిటి? గంటా మంత్రిగా ఉన్నప్పుడు ఒకవైపు డీసీసీబీని, మరొక వైపు డీసీఎంఎస్‌ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ డీసీఎంఎస్ పురోభివృద్ధికి చేసిదేమీ లేదనే చెప్పాలి. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి స్థానిక మంత్రి కొణతాల సిఫార సు మేరకు ఇక్కడి డీసీఎంఎస్ చైర్మన్‌కు మార్క్‌ఫెడ్ చైర్మన్ పదవిని ఇప్పించారు. దీంతో మార్క్‌ఫెడ్ చైర్మన్ గోపాలరాజు డీసీఎంఎస్‌లో అప్పులున్నప్పటికీ వ్యాపార లావాదేవీలను పెంచి సంస్థ పురోభివృద్ధికి ప్రయత్నించారు. కానీ ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ డీసీఎంఎస్‌ను కైవసం చేసుకున్నా స్థానికంగా వ్యాపార లావాదేవీలు పెరగడం గాని, అటు డీసీసీబీ ద్వారా సహకారం గాని లభించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ అప్పులు తీర్చే నెంపతో స్థలంపే టీడీపీ నేత కన్నేసినట్లు బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. -
గైరమ్మ సంబరం నేడు
ఉత్తరాంధ్రకే తలమానికం 59 స్టేజి కార్యక్రమాలతో సందడి భారీగా తరలిరానున్న భక్తులు అనకాపల్లి, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్రలో సుదీర్ఘ చరిత్ర కలిగిన అనకాపల్లి గవరపాలెం గైరమ్మ మహోత్సవం ఈ నెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ దీపాలంకరణ చేశారు. కొణతాల జగ్గారావు వ్యవస్థాపక అధ్యక్షునిగా రూపుదిద్దుకున్న ఈ మహోత్సవాన్ని ఆయ న తదనంతరం కొణతాల మనోహరనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ప్రస్తుతం మనోహర్‌నాయుడు కుమారుడు కొణతాల సంతోష అప్పారావునాయుడు ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంట పొలాలు కాపాడే గైరమ్మ... ప్రస్తుతం ఉన్న గైరమ్మ విగ్రహాల వద్ద ఒక దిబ్బ, మునగచెట్టు ఉండేవని పూర్వీకులు చెబుతుంటారు. ఈ ప్రాంతంలోని పంట పొలాలను కాపాడేందుకై గ్రామదేవతైన గైరమ్మను గేదెల పైడయ్య, చదరం నూకయ్య, కొణతాల నాగన్నలు ప్రతిష్టించారు. చిన్న పాకలో ఉండే అమ్మవారిని వారు భక్తిశ్రద్ధలతో పూజించేవారు. కాలక్రమేణా కొణతాల జగ్గారావు హయాంలో గుడిని అభివృద్ధిచేసి సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాన్ని నిర్వహించేవారు. నాడు పంటపొలాలను రక్షించే గైరమ్మ నేడు సతకంపట్టు గైరమ్మగా విరాజిల్లుతోంది. ఉత్సవంలో భాగంగా పట్టణంలోని పలు వీధుల్లో 59 స్టేజీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
వ్యాపారం స్వీటు.. సమస్యలు ఘాటు
=అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను వేధిస్తున్న ఇబ్బందులు =ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనకాపల్లి, న్యూస్‌లైన్: సాలీనా రూ.150 కోట్ల టర్నోవర్ కలిగిన జాతీయ స్థాయి బెల్లం మార్కెట్ అది. రోజు వారీ ఆర్థిక లావాదేవీలతో రెగ్యులేటరీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా అదే. లావాదేవీల నేపథ్యంలో సెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తున్నా ఆ మార్కెట్ యార్డుపై నిధులు ఖర్చు పెట్టేందుకు ప్రతిసారి ఏదో ఒక కొర్రియే. ఈ మార్కెట్లో నిత్యం పెద్దసంఖ్యలో రైతులు, వర్తకులు, కార్మికులు లావాదేవీల్లో పాల్గొంటారు. నల్లబెల్లం కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలో మూడు ఏర్పాటు చేయగా అందులో ఒకటి ఇక్కడే ఉంది. ఇలా అనేక ప్రాధాన్యతలు సంతరించుకున్న అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ సమస్యలతో సతమతమవుతోంది. అర్ధరాత్రి వరకు పనిచేసే ఇక్కడి కార్మికులకు క్యాంటీన్ సదుపాయం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుల విశ్రాంతి కోసం నిర్మించిన రైతు భవనం మొక్కుబడిగానే కొనసాగుతుంది. విశ్రాంతి భవనాలను ఈ విభాగంతో సంబంధం లేని సిబ్బందికి తాత్కాలికంగా కేటాయించడంతో బెల్లం లావాదేవీల కోసం వచ్చే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీటి కుళాయి దిమ్మల వద్ద అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. ఈ మార్కెట్‌యార్డులోకి ప్రైవేటు వ్యక్తుల సంచారం పెచ్చుమీరినా అరికట్టలేకపోతున్నారు. మార్కెట్‌యార్డుకు ఆనుకొని నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ బయట వ్యక్తుల హవా కోనసాగుతోంది. రోజూ చెత్త తొలగింపు అరకొరగానే ఉంటోంది. మార్కెట్‌యార్డులో చేపలు కొనుగోలు కేంద్రాలు, రైతు బజార్ ఏర్పాటు చేయాలని భావించినా అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. మార్కెట్ కమిటీ ఎప్పటికప్పుడు అద్దె వసూలు చేయాల్సి ఉన్నా తాత్సారం జరుగుతోంది. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. ఇలా ఎన్నో సమస్యలతో అనకాపల్లి మార్కెట్‌యార్డు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.