‘తెల్ల’క్రౌర్యం లోతు చూపిన ‘నల్ల’బావి
చల్లారిన సంసారాలూ/మరణించిన జనసందోహం/అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి- అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడక్కడ ‘నల్లోళ్ల’ చరిత్రను తిరగతోడుతున్నారు. ఇంగ్లిష్‌వాడి దుర్మార్గాన్ని కళ్లారా చూపుతున్నారు.
అజ్నాలా- అమృత్‌సర్‌కు 32 కిలోమీటర్లలో ఉంది. పెద్ద ఊరేమీ కాదు. కానీ చరిత్రలో దానికో ప్రత్యేకత ఉంది. ఇప్పుడా ఊరికి జనం తాకిడి ఎక్కువైంది. వారిలో చరిత్రకారులు, జర్నలిస్టులు మొదలు పురావస్తు శాఖ అధికారుల వరకు అందరూ ఉన్నారు. అక్కడి అవశేషాలను చూస్తే .. 156 ఏళ్ల కిందట భారత సైనికుడు పెట్టిన పొలికేక ఇంకా మార్మోగుతున్నట్టే ఉంటుంది.
1857 మే 10.. మీరట్‌లో సిపాయీలు ఈస్టిండియా కంపెనీ సైనికాధికారులపై తిరగబడ్డారు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా ఖ్యాతి గాంచిన ఆ సిపాయీల తిరుగుబాటు ఎందరికో స్ఫూర్తి. 1857 జూలై 30.. లాహోర్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) మియాన్ మిర్ కంటోన్మెంట్‌లోని 26వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 502మంది భారత సైనికులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రెజిమెంట్ నుంచి తప్పించుకుని అజ్నాలా మీదుగా పంజాబ్ చేరుకుని మీరట్ చేరాలన్నది వ్యూహం. విషయం తెలిసిన బ్రిటిష్ అధికారులు పంజాబ్‌లోని తమ అధికారులకు వర్తమానం పంపారు. ఆ మర్నాటి రాత్రికి రావీ నది తీరాన ‘దాదియన్ సోఫియన్’ గ్రామం వద్ద భారత సైనికులను పట్టుకున్నారు.
ఆ నిశివేళ నెత్తురు ఏరులై పారింది. 220 మంది భారత సైనికుల్ని కాల్చి చంపి రావీలో పడేశారు. మిగిలిన 282 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆనాటి పోలీసు డిప్యూటీ కమిషనర్ ఫ్రెడ్రిక్ హెన్రీ కూపర్ ఆదేశం మేరకు అజ్నాలా తహశీల్దారు కార్యాలయానికి తరలించారు. అక్కడో చిన్న గదిలో (ఇప్పటికీ ఉంది)వీళ్లను కుక్కారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయి కొందరు కన్నుమూశారు. తరువాత పది మంది చొప్పున తీసుకువచ్చి 237 మందిని కాల్చేసి అక్కడకు దగ్గర్లోని బావిలో విసిరేశారు. (ఈ దుర్ఘటనకు ప్రత్యక్షసాక్షి, అజ్నాలా వాసి జగ్జీత్‌సింగ్ తన 95 ఏళ్ల వయస్సులో 1928లో జియానిహీరా సింగ్ దర్ద్ అనే జర్నలిస్టుకు ఇచ్చిన సమాచారం ఇది) మిగతా 45మందిని సజీవంగానే ఆ బావిలో పడేసి పూడ్చేశారు. ఆ బావి పేరే కాలియన్‌వాలా ఖూ (నల్లోళ్ల బావి). ఈ మారణకాండకు ఆదేశాలిచ్చిన హెన్రీ కూపర్ సైతం -ఆ చిన్న గదిలో అంతమందిని ఎలా బంధించారో తెలియక విస్తుపోయానని తన ‘క్రైసిస్ ఇన్ పంజాబ్’ అనే పుస్తకంలో రాసుకున్నారు.
కాలక్రమంలో అదే స్థలంలో గురుద్వారా వెలిసింది. ఆ తరువాత 42 ఏళ్లకు ఆ గురుద్వారా పక్కన ఓ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు పునాదులు తీస్తున్నప్పుడు ఎముకలు, కపాలాలు బయటపడ్డాయి. ఇది అపశకునంగా భావించిన ప్రబంధక్ కమిటీ ఈ విషయాన్ని అమృత్‌సర్‌లోని చరిత్రకారుడు సురేందర్ కొచ్చర్, గురునానక్ విశ్వవిద్యాలయంలోని పురావస్తు శాఖకు తెలిపింది. సురేందర్ కొచ్చరే 2012 డిసెంబర్‌లో శోధన మొదలుపెట్టి బ్రిటిష్ కాలపు మృత్యుకుహరం ఇదేనని తేల్చారు. ఇందుకోసం పాత గురుద్వారాను కూల్చి వేసి ఈ ఏడాది ఫిబ్రవరి 28న తవ్వకాలు ప్రారంభించి మార్చి 2న పూర్తి చేశారు. ఇక్కడ దొరికిన వాటిని అజ్నాలా గురుద్వారా షాహిబ్‌గంజ్‌లో ప్రదర్శనకు పెట్టారు. ఇప్పుడా బావి పేరును షహీదాన్‌వాలా ఖూ (అమరవీరుల బావి)గా మార్చారు.
ఈ తవ్వకాల్లో 90 కపాలాలు, కపాలాలున్న 26 ఆస్తిపంజరాలు, ఈస్టిండియా కంపెనీ రూపాయి నాణాలు 70, మూడు బంగారు పతకాలు, నాలుగు బంగారు కడియాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. బయటపడిన సైనికుల అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వీళ్ల పేర్ల జాబితాను ఆంగ్లేయ పాలకులు నాశనం చేయడంతో అసలు వీరే ప్రాంతం వారో తేల్చాలని చరిత్రకారులంటున్నారు. వీళ్లు పంజాబీలు కాదని, పర్బానీలని కొందరు వాదిస్తుంటే మరికొందరు పశ్చిమబెంగాల్ లేదా కేరళ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారంటున్నారు. వీళ్లు ఏ ప్రాంతానికి చెందిన వారైనా దేశం కోసం పోరాడిన యోధులయినందున అంత్యక్రియలు నిర్వహించి అస్తికలను గోవింద్‌వాలా షాహిద్ లేదా హరిద్వార్‌లో నిమజ్జనం చేయాలని గురుద్వారా ప్రబంధక్ కమిటీ కోరుతోంది. బావి ఉన్న ప్రాంతంలో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది.
1919 నాటి జలియన్‌వాలాబాగ్ దురంతానికి నేటి బ్రిటన్ క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు మరో చీకటి కోణం బయటపడింది. సాధ్యమైనంత మేర వీటిని నమోదు చేయడం చరిత్రకారుల పని. స్వేచ్ఛావాయువుల కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుని, దేశ హితానికి పాటుపడడమే వారికి మన తరం సమర్పించే నిజమైన నివాళి.
- అజ్నాలా నుంచి ఎ.అమరయ్య