Metla Satyanarayana
-
చినరాజప్పపై తోట వాణి ఆగ్రహం
-
‘చనిపోయిన నా తండ్రినీ ఆయన వదల్లేదు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు చినరాజప్ప, యనుమల రామకృష్ణుడిపై కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘రాజకీయంగా నా తండ్రితో పాటుగా నా కుటుంబాన్ని తొక్కెయ్యడానికి హోం మంత్రి రాజప్ప ప్రయత్నాలు చేశారు. చనిపోయిన నా తండ్రిని కూడా రాజప్ప వదల్లేదు. టీవీలలో నా తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను వాడు వీడు అని రాజప్ప సంభోధించారు. నా తండ్రి.. నా భర్త నేర్పిన సంస్కారం వల్ల రాజప్పను తిరిగి నేను ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు. రాజప్ప మా కుటుంబాన్ని ఎంత దారుణంగా అణగదొక్కారో ప్రజలందరికి తెలుసు. ఎక్కడో కోనసీమ నుంచి తీసుకొచ్చి రాజప్పను పెద్దాపురంలో పెడతారా. ఇక్కడ నాయకులు లేరా. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నాను’ అని వాణి ధ్వజమెత్తారు. సంస్కారం లేని పెద్దాయన ‘నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని ఓ పెద్దాయన జిల్లాలో ఉన్నారు. ఆయనది బలుపో.. బద్దకమో తెలియదు’ అని పరోక్షంగా ఆర్థిక మంత్రి యనుమల రామకృష్ణుడికి వాణి చురకలు అంటించారు. అలాంటి వ్యక్తుల మధ్య మనుగడ సాధించలేమని భావించిన కారణంగా తాను, తన భర్త నరసింహం టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘రేపు వైఎస్సార్ సీపీలో చేరుతున్నాం. ఆ పార్టీ మాకు సముచిత స్ధానం ఇస్తుందని నమ్ముతున్నాం. వైఎస్ జగన్ మాకు భరోసా కూడా ఇచ్చారు’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు.. టీడీపీలో కలకలం
నాకు జిల్లాలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరంటే ఒకరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణరావు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి రాజప్ప వ్యాఖ్యపై టీడీపీలోనే ఆగ్రహావేశాలు ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారు. –కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ : హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై టీడీపీలో ఓ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దివంగత నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కోనసీమ, మెట్ట రాజకీయాల్లో చిచ్చు రేపాయి. ఎక్కడికి దారితీస్తుందో తెలియదు గాని రాజప్ప వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. తగిన బుద్ధి చెప్పాలన్న కసితో వ్యతిరేక వర్గీయులంతా కత్తులు నూరుతున్నారు. దిష్టిబొమ్మల దహనం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించినప్పటికీ అధిష్టానం వద్దే తేల్చుకోవాలని కొందరు పెద్దల సూచనతో వెనక్కి తగ్గారు. అసలేం జరిగిందంటే.. నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరనే ప్రశ్నకు రాజప్ప ఠక్కున సమాధానమిస్తూ ‘ఇంకెవరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి ‘మెట్ల సత్యనారాయణ రావు’ అని చెప్పారు. అందరూ పెద్ద మనిషిగా గౌరవించే డాక్టర్ మెట్ల సత్యనారాయణరావును రాజప్ప ఒకడు వెళ్లిపోయాడని ఏకవచనంలో మాట్లాడడంతో అమలాపురం నియోజకవర్గంలోనే కోనసీమ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కలకలం రేపింది. ఇప్పుడా వ్యాఖ్యలు దావనంలా వ్యాపించాయి. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణను అభిమానించే నాయకులంతా మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి...మంగళవారం ఉదయం పట్టణంలోని డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు తనయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు స్వగృహంలో టీడీపీ నాయకులంతా సమావేశమయ్యారు. రాజప్ప వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మనస్తాపానికి గురవడమే కాకుండా రాజప్పపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దివంగత డాక్టర్ మెట్ల అనుచరులు, టీడీపీ నాయకులైన మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, మున్సిపల్ కౌన్సిల్ విప్ నల్లా స్వామి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, దాదాపు 20 మంది టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఇందులో కొందరు మాట్లాడుతూ... పట్టణంలో టీడీపీ కార్యక్రమాల్లో మనమంతా దూరంగా ఉండాలని మాట్లాడగా...మరికొందరు రోడ్డెక్కి దిష్టిబొమ్మల దహనం తదితర రూపంలో ఆందోళన చేద్దామని...మరికొందరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. ఇంకొందరు అమలాపురంలో రాజప్ప పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరికొందరు రాజప్పనే నేరుగా నిలదీయాలని స్పష్టం చేశారు. మొత్తం మీద రాజప్ప వ్యాఖ్యలు నియోజకవర్గ టీడీపీలో ఆజ్యం పోశాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మెట్టప్రాంత రాజకీయ కుటుంబీకులతో సంబంధాలున్న మెట్లపై ఏకవచనంతో, చనిపోయిన వ్యక్తి కోసం మాట్లాడటాన్ని ఇక్కడి నేతలు కూడా ఆగ్రహానికి గురైనట్టు తెలిసింది. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణతో బంధుత్వం ఉన్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుర్రుగా బొడ్డు వర్గీయులు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావునుద్దేశించి మాట్లాడటంతో ఇక్కడ టీడీపీలో ఉన్న బొడ్డు వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బొడ్డు, రాజప్ప మధ్య విభేదాలున్నప్పటికీ ఇలా బాహాటంగా రోడ్డెక్కడం టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాపుల్లో కూడా దుమారం దివంగత మెట్లనే కాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై విమర్శలు గుప్పించారు. ఆ ఇద్దరి వ్యక్తులపై రాజప్ప చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చర్చనీయాంశమవుతూ ‘రాజప్ప అలా మాట్లాడకూడ’దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద రాజప్ప చేసిన వ్యాఖ్యలు అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోనే మెట్ల, పద్మనాభం ప్రభావం ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ దుమారం రేపుతున్నాయి. ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారన్న వ్యాఖ్యలు కూడా ఆ కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. -
మాజీ మంత్రి మెట్ల కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మెట్ల సత్యనారాయణ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన రెండు కిడ్నీలు పాడై అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం నుండి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఉదయం పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని కేంద్రమంత్రి సుజనాచౌదరి, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ తోట నర్సింహులు, ఎమ్మెల్సీ వి.వి.ఎస్.చౌదరి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విశ్వరూప్‌లు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి మెట్ల సత్యనారాయణ అని కొనియాడారు. సత్యనారాయణ మృతితో ఆంధ్రప్రదేశ్ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. -
మెట్ల సత్యనారాయణ కన్నుమూత
-
మాజీమంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూత
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మెట్ల సత్యనారాయణ మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు కేబినెట్లో సత్యనారాయణ ఆరోగ్య మంత్రిగా పని చేశారు. మెట్ల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సంతాపం తెలిపారు. కాగా మెట్ల సత్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటు అని చినరాజప్ప అన్నారు. -
‘బాబుగారి’ మాటలకు అర్థాలే వేరులే..!
కాకినాడ: చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవహార శైలి చెప్పకనే చెబుతోంది. ప్రజల సమక్షంలో, వారి అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తానని పాలమూరు ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రకటించారు. కానీ, దీనికి భిన్నంగా వలస వచ్చిన నేతలు తమకు తామే అభ్యర్థులమంటూ ప్రకటించుకుంటున్నారు. విభజన నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ గొప్పలకు పోయిన మాజీమంత్రి తోట నరసింహం.. మాట మార్చి తన మామ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు దౌత్యం తో ఇటీవల చంద్రబాబు పంచన చేరారు. టీడీపీలో చేరిన అనంతరం మంగళవారం తొలిసారిగా జగ్గంపేట చేరిన ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కాకినాడ నుంచి పార్లమెంటుకు తాను, జగ్గంపేట నుంచి అసెంబ్లీకి జ్యోతుల చంటిబాబు పోటీ చేస్తారని ప్రకటించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మెట్ల సత్యనారాయణరావు సమక్షంలోనే ఆయన చేసిన ఈ ప్రకటన తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చురేపింది. కాంగ్రెస్ నుంచి వచ్చీరాగానే తనకు తానుగా అభ్యర్థినని ప్రకటించుకునే అధికారం తోటకు చంద్రబాబు ఇచ్చారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని జగ్గంపేట, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పార్టీ జెండాను భుజాన మోస్తోన్న పాతకాపులను పక్కన పెట్టి అడ్రస్ లేక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు కట్టబెడుతున్న బాబు తీరును పార్టీ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుకు జెల్లకొట్టి.. అక్కడి నుంచి బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డ తోట నరసింహానికి టికెట్టు ఖాయం చేద్దామని చంద్రబాబు అనుకున్నారు. దీనిని పసిగట్టిన తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హైదరాబాద్‌లో నరసింహం ఇటీవల సైకిల్ ఎక్కిన సమయానికి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై భగ్గుమన్నారు. గత రెండుసార్లు అంతంతమాత్రం మెజార్టీతో గెలుపొంది ప్రజల ఆశలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయలేక వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి వ్యక్తికి చంటిబాబును పక్కన పెట్టి జగ్గంపేట టికెట్టు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నారో 24 గంటల్లోగా చెప్పాలని పార్టీ నాయకులు అల్టిమేటమ్ ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో పార్టీ కోసం లక్షలు తగలేసుకుని తిరుగుతున్న చంటిబాబుకంటే నరసింహం ఎందులో ఎక్కువనేది చెప్పాలంటూ బాబు తీరును తూర్పారబట్టారు. దీంతో దిగొచ్చిన చంద్రబాబు జగ్గంపేట టికెట్టును చంటిబాబుకు ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం. మరోపక్క ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ టికెట్టుపై ఆశతో ఏడాది కాలంగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం లక్షలు ఖర్చు చేస్తున్నారు. తోటకు ఈ టికెట్టు ఇచ్చేస్తే విశ్వం పరిస్థితి ఏమిటని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ప్రజల సమక్షంలోనే చేస్తానంటున్న చంద్రబాబు మాటలు కేవలం ప్రచారార్భాటానికే పరిమితమా? అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు జగ్గంపేట బీసీలకు కేటాయిస్తారనుకుని టీడీపీలో చేరామని, ఇప్పుడు ఇలా చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు ఏమని సంకేతాలు ఇస్తున్నారో చెప్పాలని జగ్గంపేట అసెంబ్లీ టికెట్టు ఆశించిన పల్లా సత్యనారాయణ, కాకినాడ పార్లమెంటు సీటు ఆశించిన పోతుల విశ్వం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు పార్టీలో సముచిత స్థానం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తానని బాబు చెప్పారు. కానీ.. జిల్లాలో ఆ వర్గానికి ఇవ్వాల్సిన రామచంద్రపురం, కొత్తపేట నియోజకవరా్గాలను వలస వచ్చిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బండారు సత్యానందరావులకు ప్రకటించారు. దీనిపై కూడా పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. కొత్తపేట సీటు ఆశించిన బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి మొండిచేయి చూపడంపై బీసీ సామాజికవర్గం మండిపడుతోంది. మరోపక్క రామచంద్రపురం టికెట్టు ఆశించి, భంగపడిన కట్టా సూర్యనారాయణ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో ఇటీవల చేరారు.