చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు.. టీడీపీలో కలకలం | Deputy Chief Minister China Rajappa Controversial Comments on Metla Satyanarayana | Sakshi
Sakshi News home page

చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు.. టీడీపీలో కలకలం

Published Wed, May 9 2018 9:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Deputy Chief Minister China Rajappa Controversial Comments on  Metla Satyanarayana - Sakshi

నాకు జిల్లాలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరంటే  ఒకరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణరావు. 
ఓ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి రాజప్ప వ్యాఖ్యపై టీడీపీలోనే ఆగ్రహావేశాలు

ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారు.  
–కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చ

సాక్షి ప్రతినిధి, కాకినాడ : హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై టీడీపీలో ఓ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో దివంగత నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కోనసీమ, మెట్ట రాజకీయాల్లో చిచ్చు రేపాయి. ఎక్కడికి దారితీస్తుందో తెలియదు గాని రాజప్ప వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. తగిన బుద్ధి చెప్పాలన్న కసితో వ్యతిరేక వర్గీయులంతా కత్తులు నూరుతున్నారు. దిష్టిబొమ్మల దహనం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించినప్పటికీ అధిష్టానం వద్దే తేల్చుకోవాలని కొందరు పెద్దల సూచనతో  వెనక్కి తగ్గారు.

అసలేం జరిగిందంటే..
నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరనే ప్రశ్నకు రాజప్ప ఠక్కున సమాధానమిస్తూ ‘ఇంకెవరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి ‘మెట్ల సత్యనారాయణ రావు’ అని చెప్పారు. అందరూ పెద్ద మనిషిగా గౌరవించే డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావును రాజప్ప ఒకడు వెళ్లిపోయాడని ఏకవచనంలో మాట్లాడడంతో అమలాపురం నియోజకవర్గంలోనే కోనసీమ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కలకలం రేపింది. ఇప్పుడా వ్యాఖ్యలు దావనంలా వ్యాపించాయి. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణను అభిమానించే నాయకులంతా మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి...మంగళవారం ఉదయం పట్టణంలోని డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు తనయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ మెట్ల రమణబాబు స్వగృహంలో టీడీపీ నాయకులంతా సమావేశమయ్యారు. రాజప్ప వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మనస్తాపానికి గురవడమే కాకుండా రాజప్పపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

 దివంగత డాక్టర్‌ మెట్ల అనుచరులు, టీడీపీ నాయకులైన మున్సిపల్‌ చైర్మన్‌ చిక్కాల గణేష్,  పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, మున్సిపల్‌ కౌన్సిల్‌ విప్‌ నల్లా స్వామి, మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, దాదాపు 20 మంది టీడీపీ మున్సిపల్‌ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఇందులో కొందరు మాట్లాడుతూ... పట్టణంలో టీడీపీ కార్యక్రమాల్లో మనమంతా దూరంగా ఉండాలని మాట్లాడగా...మరికొందరు రోడ్డెక్కి దిష్టిబొమ్మల దహనం తదితర రూపంలో ఆందోళన చేద్దామని...మరికొందరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. ఇంకొందరు అమలాపురంలో రాజప్ప పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. 

మరికొందరు రాజప్పనే నేరుగా నిలదీయాలని స్పష్టం చేశారు. మొత్తం మీద రాజప్ప వ్యాఖ్యలు నియోజకవర్గ టీడీపీలో ఆజ్యం పోశాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మెట్టప్రాంత రాజకీయ కుటుంబీకులతో సంబంధాలున్న మెట్లపై ఏకవచనంతో, చనిపోయిన వ్యక్తి కోసం మాట్లాడటాన్ని ఇక్కడి నేతలు కూడా ఆగ్రహానికి గురైనట్టు తెలిసింది. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణతో బంధుత్వం ఉన్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గుర్రుగా బొడ్డు వర్గీయులు
పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావునుద్దేశించి మాట్లాడటంతో ఇక్కడ టీడీపీలో ఉన్న బొడ్డు వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బొడ్డు, రాజప్ప మధ్య విభేదాలున్నప్పటికీ ఇలా బాహాటంగా రోడ్డెక్కడం టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కాపుల్లో కూడా దుమారం 
దివంగత మెట్లనే కాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై విమర్శలు గుప్పించారు. ఆ ఇద్దరి వ్యక్తులపై రాజప్ప చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చర్చనీయాంశమవుతూ ‘రాజప్ప అలా మాట్లాడకూడ’దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద రాజప్ప చేసిన వ్యాఖ్యలు అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోనే మెట్ల, పద్మనాభం ప్రభావం ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ  దుమారం రేపుతున్నాయి. ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారన్న వ్యాఖ్యలు కూడా ఆ కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement