TV Channel Interview
-
ఎన్నికలు ముగిశాక.. అప్పుడిక మనం మొదలుపెడదాం
సాక్షి, అమరావతి :‘‘ఆహా.. మన ఎలక్షన్లు మొదటివిడతే అయిపోవడం ఎంత లాభం తెలుసా?’’ అన్నాను నేను. ‘‘ఏం లాభం.. ఎవరికి లాభం?’’ కాస్త ఘాటుగానే అడిగాడు మా రాంబాబు గాడు. ‘‘అందరికీ’’ అన్నాను. ‘‘ఎలా?’’ మళ్లీ రెట్టించాడు. ‘‘ఎన్నికలు నెల రోజుల్లోనే అయిపోయాయనుకో.. ఇప్పటికి దాదాపు నాలుగు వారాలే టైమ్ ఉంది కాబట్టి.. సరిగ్గా ఏ 28 రోజులో బయట తిరిగితే చాలు. చూశావా ఎండలు ఎలా ఉన్నాయో? అదే మన షెడ్యూలు ఏ మే నెలలోనో ఉందనుకో.. అప్పుడు రెండు నెలల పాటు ఇటు నాయకులూ, అటు కార్యకర్తలూ అందరూ ఎండల్లో పొద్దస్తమానం తిరగలేక చచ్చేవారు. ఇక పార్టీల అధినేతలైతే అంతంత కాలం పాటు గొంతులు చించుకుంటూ ఉపన్యాసాలివ్వలేక బాధపడేవారు. వాళ్లకు.. నెల రోజుల్లో పెట్టాల్సిన ఖర్చులు రెణ్ణెల్ల పాటు పెట్టాల్సి వస్తే.. అది ఏ డబులో త్రిబులో అవుతుంది కదా. డబ్బు కోట్లలో వేస్టవుతుంది.. ఆలోచించు’’ అన్నాను. ‘‘ఒరే పిచ్చి సన్నాసీ! ఎంతసేపూ నాయకుల కోణం నుంచి, వాళ్లకయ్యే ఖర్చుల కోణం నుంచి చూస్తావుగానీ.. కాసేపు అట్టడుగున ఉండే తాడిత పీడత జనాల వైపు నుంచి ఆలోచించవేమిట్రా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఎన్నికలు లేటుగా ఏ మే నెలలోనో జరిగితే వాళ్లకొచ్చే లాభం ఏమిటి?’’ అడిగాన్నేను. ‘‘అమాయకుడా.. నువ్వు చెబుతున్న అణగారిన వర్గాల వారినే నాయకులు తమ వెంటేసుకుని ప్రచారాలకు తిప్పుతుంటారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగు నిండుగా ఉండాలని.. చాలామందికి డబ్బులిచ్చి పిలిపించుకుంటుంటారు. ఇంత అర్లీగా ఎన్నికలు ముగిసిపోవడం అంటే అలాంటి వాళ్లందరి ఉపాధికీ గండి కొట్టినట్టేనని గ్రహించవేమిరా?’’ ‘‘నాకు అర్థం కాలేదు’’ అన్నాను. ‘‘పిచ్చివాడా.. ఇప్పుడు నేతాశ్రీల వెంట వచ్చే కార్యకర్తలందరికీ పొద్దున్నే టిఫినూ, మధ్యానం బిర్యానీ, సాయంత్రం స్నాక్స్.. రాత్రికి మళ్లీ కోడిపలావ్ విత్ మందూ.. ఇవన్నీ జస్ట్ 28 రోజులే. అదే రెండు నెలల గడువుందనుకో.. పాపం.. వాళ్లందరికీ రెండు నెలల పాటు విందే విందు.. మందే మందు’’ ‘‘పోన్లే.. పాపం. కనీసం రెండు నెలలు తాగే ఆ చీప్ లిక్కర్ ఒక నెలే తాగుతారంటే ఆ మేరకు వాళ్ల హెల్త్ బాగుపడ్డట్టేగా’’ అన్నాను నేను. ‘‘బాగుపడేది వాళ్లు కాదురా.. ఎన్నికలు మేలో జరిగితే కనీసం ఓటర్ల పంపకాలు రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరిగేవి. ఇప్పుడు కార్యకర్తలతో పాటు వాళ్లను బుజ్జగించాల్సిన సమయమూ కొద్దిగానే ఉంది.. ఓటరు దేవుళ్లంటూ వాళ్లను మునగచెట్లు ఎక్కించే వ్యవధీ తగ్గిపోయింది. కానీ బాగుపడేదెవరంటావా.. ఇక ఎలక్షన్ అయిన మర్నాటి నుంచి ఫలానా వారి సర్వే అనీ, ఫలానా వారి అంచనా అంటూ సెఫాలజిస్టులనే రాజకీయ జాతకాలు చెప్పేవాళ్లు టీవీల్లో కూర్చొని అదేపనిగా ఊదరగొట్టేస్తుంటారు. ఒక్కొక్కరి అంచనా ఒకలా ఉంటుంది. తమకు అనుకూలమైన అంచనాను పట్టుకొని ఒక పార్టీ వారు.. దాన్ని ఖండిస్తూ ఎదుటిపార్టీ వాళ్లూ టీవీ చర్చల్లో గొంతులూ.. బట్టలూ చించుకుంటుంటారు. వాళ్ల వాదనలు వింటూ బెట్టింగ్ రాయుళ్లు.. నెల రోజుల పాటు కాయాల్సినంత కాస్తూ నష్టపోతారు. ఏతావాతా బాగుపడేదెవరంటే.. ’’ నా మొహాన సుదీర్ఘంగా ఉపన్యాసమొకటి పడేస్తూ కాస్త గాలి పీల్చుకోడానికి ఆగాడు. ‘‘ఎవర్రా’’ సస్పెన్స్ పట్టలేక అడిగేశా. ‘‘ఇంకెవరూ.. చెత్త చర్చలతో తమ టీఆర్పీలు, జనాల బీపీలు పెంచే ఓ వర్గం టీవీ వాళ్లు’’ అంటూ అసలు విషయం కూల్‌గా చెప్పాడు మా రాంబాబుగాడు. -
చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు.. టీడీపీలో కలకలం
నాకు జిల్లాలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరంటే ఒకరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణరావు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి రాజప్ప వ్యాఖ్యపై టీడీపీలోనే ఆగ్రహావేశాలు ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారు. –కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ : హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై టీడీపీలో ఓ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దివంగత నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కోనసీమ, మెట్ట రాజకీయాల్లో చిచ్చు రేపాయి. ఎక్కడికి దారితీస్తుందో తెలియదు గాని రాజప్ప వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. తగిన బుద్ధి చెప్పాలన్న కసితో వ్యతిరేక వర్గీయులంతా కత్తులు నూరుతున్నారు. దిష్టిబొమ్మల దహనం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించినప్పటికీ అధిష్టానం వద్దే తేల్చుకోవాలని కొందరు పెద్దల సూచనతో వెనక్కి తగ్గారు. అసలేం జరిగిందంటే.. నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరనే ప్రశ్నకు రాజప్ప ఠక్కున సమాధానమిస్తూ ‘ఇంకెవరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి ‘మెట్ల సత్యనారాయణ రావు’ అని చెప్పారు. అందరూ పెద్ద మనిషిగా గౌరవించే డాక్టర్ మెట్ల సత్యనారాయణరావును రాజప్ప ఒకడు వెళ్లిపోయాడని ఏకవచనంలో మాట్లాడడంతో అమలాపురం నియోజకవర్గంలోనే కోనసీమ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కలకలం రేపింది. ఇప్పుడా వ్యాఖ్యలు దావనంలా వ్యాపించాయి. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణను అభిమానించే నాయకులంతా మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి...మంగళవారం ఉదయం పట్టణంలోని డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు తనయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు స్వగృహంలో టీడీపీ నాయకులంతా సమావేశమయ్యారు. రాజప్ప వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మనస్తాపానికి గురవడమే కాకుండా రాజప్పపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దివంగత డాక్టర్ మెట్ల అనుచరులు, టీడీపీ నాయకులైన మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, మున్సిపల్ కౌన్సిల్ విప్ నల్లా స్వామి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, దాదాపు 20 మంది టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఇందులో కొందరు మాట్లాడుతూ... పట్టణంలో టీడీపీ కార్యక్రమాల్లో మనమంతా దూరంగా ఉండాలని మాట్లాడగా...మరికొందరు రోడ్డెక్కి దిష్టిబొమ్మల దహనం తదితర రూపంలో ఆందోళన చేద్దామని...మరికొందరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. ఇంకొందరు అమలాపురంలో రాజప్ప పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరికొందరు రాజప్పనే నేరుగా నిలదీయాలని స్పష్టం చేశారు. మొత్తం మీద రాజప్ప వ్యాఖ్యలు నియోజకవర్గ టీడీపీలో ఆజ్యం పోశాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మెట్టప్రాంత రాజకీయ కుటుంబీకులతో సంబంధాలున్న మెట్లపై ఏకవచనంతో, చనిపోయిన వ్యక్తి కోసం మాట్లాడటాన్ని ఇక్కడి నేతలు కూడా ఆగ్రహానికి గురైనట్టు తెలిసింది. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణతో బంధుత్వం ఉన్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుర్రుగా బొడ్డు వర్గీయులు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావునుద్దేశించి మాట్లాడటంతో ఇక్కడ టీడీపీలో ఉన్న బొడ్డు వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బొడ్డు, రాజప్ప మధ్య విభేదాలున్నప్పటికీ ఇలా బాహాటంగా రోడ్డెక్కడం టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాపుల్లో కూడా దుమారం దివంగత మెట్లనే కాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై విమర్శలు గుప్పించారు. ఆ ఇద్దరి వ్యక్తులపై రాజప్ప చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చర్చనీయాంశమవుతూ ‘రాజప్ప అలా మాట్లాడకూడ’దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద రాజప్ప చేసిన వ్యాఖ్యలు అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోనే మెట్ల, పద్మనాభం ప్రభావం ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ దుమారం రేపుతున్నాయి. ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారన్న వ్యాఖ్యలు కూడా ఆ కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. -
రాహుల్‌లో పాలనా స్వభావ లోపం
కాంగ్రెస్ నేత దిగ్విజయ్ వ్యాఖ్య పణజీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై ఇప్పటికే పలువురు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలెదుర్కొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ నాయకత్వ లక్షణాలను పరోక్షంగా ప్రశ్నించారు. రాహుల్‌లో పాలనా స్వభావం లేదని శనివారం పణజీలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన కేవలం అన్యాయాలపై పోరాడేందుకే ఇష్టపడతారని...ఆయనలో పాలనా మనస్తత్వం లేదని చెప్పుకొచ్చారు. కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్ ఎందుకు వెనక అడుగు వేస్తుంటారన్న ప్రశ్నకు దిగ్విజయ్ పైవిధంగా బదులిచ్చారు. లోక్‌సభలో రాహుల్ కాంగ్రెస్‌పక్ష నాయకుడిగా ఎందుకు కాలేకపోయారన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్థానం అవసరం. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతను రాహుల్ గాంధీయే చేపట్టాలని నేను ముందుగానే సూచించా. రాహుల్ ఆ బాధ్యతను చేపట్టి ఉండాల్సింది’’ అని అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆ తర్వాత బెంగళూరులో దిగ్విజయ్ వివరణ ఇచ్చారు. రాహుల్ అన్యాయాలపై పోరాడుతుంటారని...అందుకే ఆయనలో అధికార దాహం లేదనే కోణంలో తాను మాట్లాడినట్లు చెప్పారు. అధికారం కోసం ఆయన వెంపర్లాడరన్నారు. పార్టీలో రాహుల్‌కు, ఇతర నేతలకు ఉన్న తేడా అదేనని వివరించారు.