అమలాపురంలో జరిగిన టీడీపీ మినీ మహానాడు సభలో ప్రసంగిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప
అమలాపురం: ‘సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా రాంగ్ పోస్టులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారిని సహించేది లేదు. మాజీ మంత్రి దివంగత డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుపై ఓ టీవీ చానల్‌లో నేను మాట్లాడిన మాటలు ఫ్లోలో వచ్చినవే తప్ప, మరేమీ కాదు’’ అంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో ఆదివారం జరిగిన నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సభలో చినరాజప్ప ప్రసంగించారు. ఇటీవల ఓ టీవీ చానల్‌లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి దివంగత డాక్టర్ మెట్లపై చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆ మినీ మహానాడు వేదికపై పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఇలా వివరణ ఇచ్చారు.
‘నాకు డాక్టర్ మెట్ల అంటే గౌరవం ఉంది. అలాగే ఆయన తనయుడు రమణబాబు అంటే అభిమానం’ అని రాజప్ప చెప్పుకొచ్చారు. తమ రెండు కుటుంబాల మధ్య సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కొందరు పుల్లలు పెట్టాలని చూశారని, వారెవరో తనకు తెలుసునని స్పష్టం చేశారు. సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిపై ఇక నుంచి చర్యలు తప్పవని హెచ్చరించారు. రమణబాబుకు పార్టీపరంగా ఎదిగేందుకు తనవంతు ప్రోత్సాహం, కృషి ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో నిజాయితీగా కష్ట పడేవారిని గుర్తించాలని ఎమ్మెల్యే ఆనందరావుకు సభలో రాజప్ప సూచించారు. పార్టీ పరిశీలకుడు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, అల్లవరం మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మకాయల సూరిబాబు, ఆత్మ చైర్మన్ లింగోలు పెదకాపు, జెడ్పీటీసీ సభ్యులు అధికారి జయ వెంకటలక్ష్మి, వేగిరాజు ప్రవీణ, ఎంపీపీలు యెరుబండి వెంకటేశ్వరరావు, చింతా లక్ష్మీ గౌరీ, తెలుగు రైతు నాయకుడు మట్ట మహాలక్ష్మీ ప్రభాకర్, టీడీపీ నాయకులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, జంగా బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ, అభివృద్ధి పనుల గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment