నిరుపేదలకు ఇచ్చేందుకు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో లెవెలింగ్ పనులు చేస్తున్న ఉపాధి సిబ్బంది
‘‘పట్టణం నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇవ్వడమేమిటి? అసలు ఈ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని సూచించడమే సరికాదు. వాళ్లకు రామేశంమెట్ట వద్ద జీ+3 ఇళ్లు నిర్మించండి చాలు’’ అంటూ టీడీపీకి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారులపై చిందులు తొక్కడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. తమపై కత్తి కట్టినట్టుగా ఆయన వ్యవహరించిన తీరుపై ఆ నియోజకవర్గానికి చెందిన పేదలు మండిపడుతున్నారు. ప్రజానురంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది నాటికి పేదలందరికీ ఇంటి స్థలాలు లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ముందుకు సాగుతూంటే.. దానికి మోకాలు అడ్డడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండే పట్టణాల్లో తమకు గూడు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూంటే.. తమను ఎక్కడో ఉన్న రామేశంమెట్టకు తరిమేయాలని ఎమ్మెల్యే అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడం.. లేదా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యాన జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఎంపిక చేసే ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గ కేంద్రమైన పెద్దాపురం మండలం, పట్టణంలో ఉన్న సుమారు 5,401 మంది పేదలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వడివడిగా జరుగుతున్న పనులు అక్కడి ఎమ్మెల్యే చినరాజప్పకు కంటగింపుగా మారాయి. పోనీ ఆ పేదలేమైనా పక్క నియోజకవర్గంలో వారైతే అడ్డు చెప్పారన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లబ్ధి పొందే వారందరూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో వారే. అయినప్పటికీ ఆయనఅడ్డం పడుతున్నారంటే.. పేదల పట్ల ఆయనకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
పేదలపై దుగ్ధతోనే..
పెద్దాపురం పట్టణం పరిధిలోకి వచ్చే జి.రాగంపేట పంచాయతీ సర్వే నంబర్ 340/1ఎ1లో సుమారు 17 ఎకరాల ఇరిగేషన్ స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాల్లో పులిమేరు, తాటిపర్తి, గుడివాడ, సిరివాడ, జి.రాగంపేట గ్రామాల పేదలకు జీ+3 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అక్కడ గజం రూ.25 వేల వరకూ పలుకుతోంది. పెద్దాపురం నడిబొడ్డున అంత ఖరీదైన భూముల్లో పేదలకు ఇళ్లు ఇవ్వడమెందుకని అక్కడి టీడీపీ నేతలు భావించారు. ఈ విషయాన్ని వారు చెవిలో వేయడంతో ఎమ్మెల్యే చినరాజప్ప పేదలకు లబ్ధి కలిగించే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ ‘గూడు’పుఠానీ పన్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువుగా ఉన్న ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఎందుకని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. పేదల కోసం కేటాయించిన ఐదెకరాలు కాకుండా మరో 12 ఎకరాల వరకూ కూడా అక్కడ ఖాళీగానే ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే చెప్పినట్టు అక్కడ నిజంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాల్సి వస్తే మిగిలిన స్థలంలో చేపట్టవచ్చు. కానీ పేదల గూడుకే ఎసరుపెట్టే విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములను పేదలకు ఇవ్వడమేమిటన్న దుగ్ధతోనే టీడీపీ నేతలు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే వ్యతిరేకత ఎందుకంటే..
పెద్దాపురం పట్టణంలో పేదల కోసం జీ+3 నిర్మాణాల కోసం కేటాయించిన స్థలానికి ఎదురుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంది. అక్కడ పేదల ఇళ్లు వస్తే తనకు ఇబ్బంది అవుతుందని బహుశా చినరాజప్ప భావించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పెద్దాపురం మండలంలోని సుమారు 12 ఏటిపట్టు గ్రామాల్లో మెజార్టీవి గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచాయి. ఈ రెండు కారణాలతోనే ఎమ్మెల్యే తమపై కక్ష సాధిస్తున్నట్టున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏటిపట్టు గ్రామాల్లోని పేదలకు పట్టణం నడిబొడ్డున ఇళ్లు నిర్మించి ఇస్తే.. వారందరూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు నిలుస్తారన్న భయంతోనే టీడీపీ నేతలు ఈ కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. అలా కాకపోతే తన నియోజకవర్గ పేదలకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ముందుకు వస్తే ఎమ్మెల్యే వ్యతిరేకించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే.. ప్రజలకు దూరాభారం
కట్టమూరు, జె.తిమ్మాపురం గ్రామాలతో పాటు పెద్దాపురం పట్టణ లబ్ధిదారులు 2,826 మందికి రామేశంమెట్ట వద్ద జీ+3 మోడల్ ఇళ్లు నిర్మించనున్నారు. అక్కడే ఏటిపట్టు గ్రామాల వారికి కూడా నిర్మించాలని ఎమ్మెల్యే అంటున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్టే రామేశ్వరం మెట్టలో ఇళ్లు నిర్మిస్తే అది ఏటిపట్టు గ్రామాల ప్రజలకు దూరాభారమే అవుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉంటుంది. నిబంధనల ప్రకారం పేదలకు 10 కిలోమీటర్ల లోపులోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ విషయం ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఎమ్మెల్యే చినరాజప్పకు తెలియకుండా ఉంటుందా అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పేరు వస్తుందనే వ్యతిరేకిస్తున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పేద ప్రజలకు ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను సేకరించారు. దీనిలో భాగంగా సామర్లకోటకు చెందిన విస్తరణ, శిక్షణ కేంద్రంలోని భూములను ఇళ్ల స్థలాల కోసం అధికారులు సేకరించారు. పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయానికి చెందిన భూములు నిరుపయోగంగా ఉండి ఆక్రమణలకు గురవుతున్నాయి. ఆ భూములను ఇళ్లస్థలాలకు ఇవ్వాలని నిర్ణయించాం. అయితే ఎమ్మెల్యే రాజప్ప ఆ భూములను పేదలకు ఇళ్లస్థలాలుగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ భూములు పేదలకు ఇస్తే మా పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఆయన వ్యతిరేకిస్తున్నారు.– దవులూరి దొరబాబు,వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం
Comments
Please login to add a commentAdd a comment