సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు చినరాజప్ప, యనుమల రామకృష్ణుడిపై కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘రాజకీయంగా నా తండ్రితో పాటుగా నా కుటుంబాన్ని తొక్కెయ్యడానికి హోం మంత్రి రాజప్ప ప్రయత్నాలు చేశారు. చనిపోయిన నా తండ్రిని కూడా రాజప్ప వదల్లేదు. టీవీలలో నా తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను వాడు వీడు అని రాజప్ప సంభోధించారు. నా తండ్రి.. నా భర్త నేర్పిన సంస్కారం వల్ల రాజప్పను తిరిగి నేను ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు. రాజప్ప మా కుటుంబాన్ని ఎంత దారుణంగా అణగదొక్కారో ప్రజలందరికి తెలుసు. ఎక్కడో కోనసీమ నుంచి తీసుకొచ్చి రాజప్పను పెద్దాపురంలో పెడతారా. ఇక్కడ నాయకులు లేరా. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నాను’ అని వాణి ధ్వజమెత్తారు.
సంస్కారం లేని పెద్దాయన
‘నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని ఓ పెద్దాయన జిల్లాలో ఉన్నారు. ఆయనది బలుపో.. బద్దకమో తెలియదు’ అని పరోక్షంగా ఆర్థిక మంత్రి యనుమల రామకృష్ణుడికి వాణి చురకలు అంటించారు. అలాంటి వ్యక్తుల మధ్య మనుగడ సాధించలేమని భావించిన కారణంగా తాను, తన భర్త నరసింహం టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘రేపు వైఎస్సార్ సీపీలో చేరుతున్నాం. ఆ పార్టీ మాకు సముచిత స్ధానం ఇస్తుందని నమ్ముతున్నాం. వైఎస్ జగన్ మాకు భరోసా కూడా ఇచ్చారు’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment