జమునానగర్‌లో ఉప ముఖ్యమంత్రి రాజప్పను అడ్డుకున్న గ్రామస్తులు
సాక్షి, కాకినాడ: ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అవినీతి, అక్రమమైనింగ్‌లతో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆయనకు ఎక్కడికి వెళ్లినా ఛీత్కారాలు తప్పడం లేదు. మూడు రోజుల క్రితం సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో అక్కడి ప్రజలు ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మరో భంగపాటు ఎదురైంది. మాధవపట్నం సమీపంలోని జమునా నగర్‌కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఐదేళ్లుగా తమ గ్రామ సమస్యలేవీ తీర్చారంటూ నిలదీశారు. స్మశానానికి దారిలేదంటూ ఎన్నో సార్లు సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరించలేదని మండిపడ్డారు. ఎవరైనా చనిపోతే రైలుపట్టాలు మీదుగా మృతదేహాన్ని స్మశానవాటికి తీసుకువెళ్లాల్సి వస్తోందని ఎన్నో సార్లు చెప్పినా నాడు మీరు ఎందుకు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాధవపట్నం, జమునానగర్‌లలో స్థానిక సమస్యలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాజప్ప డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో రాజప్పకు మింగుడుపడలేదు. ఎన్నికలైన తరువాత ఈ సమస్యకే తొలి ప్రాధాన్యం ఇస్తానని రాజప్ప హామీ ఇవ్వగా మూడేళ్ల కిందటి నుంచి ఇదే మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘చెప్పింది విను’ అని రాజప్ప చెప్పడంతో ‘ఎన్నిసార్లు వినాలి’ అంటూ కేకలు వేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచి పిల్లి కృష్ణ ప్రసాద్ ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినకపోవడంతో ‘వాహనం ముందుకు పోవాలి’ అని రాజప్ప చెప్పి జారుకున్నారు. వరుస వ్యతిరేక చర్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజప్ప ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి పెద్దాపురంలో నెలకొందంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment