metta land
-
మెట్టకు అండ వెలిగొండ
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగవంతగా జరుగుతున్నాయి. దుర్భిక్షమైన మెట్టప్రాంతాలను ఆదుకునేందుకు దాదాపు 15 ఏళ్ల క్రితం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన అకాల మరణం తర్వాత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. మూడు దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వైఎస్సార్ కలను నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్ట్ పనులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి ఈ పనులు పూర్తయితే, రెండో దశలో జిల్లాకు సంబంధించిన పనులు పుంజుకోనున్నాయి. ఉదయగిరి: డెల్టా ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లా పశ్చిమ దిశలోని ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతో పాటు వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లోని భూములకు సాగునీరు, తాగు నీరు అందించేందుకు 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయనమరణానంతరం అధికారం చేపట్టిన అప్పటి కాంగ్రెస్ పాలకులు, ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేసేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా ఇటీవల ప్రాజెక్ట్‌ను సందర్శించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జూన్‌కల్లా మొదటి దశ పనులు పూర్తి చేసి రెండో దశ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్సార్ సీఎంగా 2005 నుంచి 2009 వరకు ఈ ప్రాజెక్ట్ పనులను శరవేగంగా చేపట్టారు. ఆయన మరణంతో పనులు నత్తను తలపించాయి. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్‌పై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అంతకు ముందు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి తమ బినామీ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టినా పనుల్లో పురోగతి లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మూడు జిల్లాల మెట్ట రైతులు దిగాలు పడ్డారు. మళ్లీ చిగురించిన ఆశలు కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగాన కొళ్లాం ప్రాంతంలోని హెడ్ రెగ్యులేటర్ నుంచి రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసి అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 4,47,300 ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ ఏడాది జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి కొంత మేర ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఇందుకు అవసరమైన రూ.185 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించింది. రెండో దశ పనులకు అవసరమైన రూ.1,600 కోట్లు కూడా యుద్ధప్రాతిపదికన అందజేసేందుకు సీఎం సుముఖంగా ఉన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాలోని ఐదు మండలాల్లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో ఉదయగిరిలోని నాలుగు మండలాలకు 47 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. శరవేగంగా పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు ఈ ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్మించనున్న పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నల్లమల సాగర్ నుంచి 139 కి.మీ పొడవుతో తవ్విన కాలువ ద్వారా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీరు వస్తుంది. ఇక్కడ 2.02 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచి 39.8 కి.మీ మేర ఉదయగిరి ఉప కాలువను తవ్వారు. తద్వారా గండిపాళెం రిజర్వాయర్‌కు కూడా నీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు మండలాలకు సాగు, తాగునీరందుతుంది. సీతారామపురం వద్ద నిర్మించ తలపెట్టిన సీతారామసాగర్లో పది టీఎంసీల నీరు ఉంటుంది. దీంతో మెట్ట ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుంది. మెట్టప్రాంతం సస్యశ్యామలం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గంలోని 75 శాతం మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. పెద్దిరెడ్డిపల్లి సీతారామసాగర్ రిజర్వాయర్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రాజెక్ట్ పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన బీడు భూములను చేర్చేందుకు అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాను. ఈ ఐదేళ్లలోనే సాగునీరు, తాగునీరు అందుతుంది. నెల క్రితం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పెద్దిరెడ్డిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరును సందర్శించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు. – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే -
మాగాణికీ మెట్ట పంటలే శరణ్యం!
సాక్షి, హైదరాబాద్: నైరుతీ రుతుపవనాలు ముఖం చాటేయడం, రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటడంతో రాష్ట్రంలో వరి సాగును నియంత్రించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేలా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో గురువారం నుంచి ఊరూరా సదస్సులు నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఖరీఫ్ సాగు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుపై రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కె.మధుసూదనరావు బుధవారమిక్కడ సమీక్షించారు. మెట్ట పంటల పరిశోధన కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలవారీగా పంటల సాగుపై సమీక్షించారు. ఇప్పటికే అదును దాటినందున వరి సాగు చేయకుంటేనే మంచిదన్న విషయాన్ని రైతులకు తెలియజెప్పాలని నిర్ణయించారు. జూన్‌లో వేసిన పంటలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, జూలై, ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం గతేడాది కంటే తగ్గిందని అధికారులు వివరించారు. గతేడాది ఇదే సమయానికి, ఇప్పటికీ పంటల సాగులో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ గతేడాది ఆగస్టులో రిజర్వాయర్లలోకి నీరు వచ్చింది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న, శనగ, పెసర, పిల్లిపెసర, మినుము వంటి పంటల్ని వేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా అధికారులతో గురు, శుక్రవారాలలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సీమలో సగటు లోటు 41 శాతం.. రాష్ట్రంలో అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నా సగటు వర్షపాతం లోటు 11 శాతానికి చేరింది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలో అత్యధికంగా 41 శాతం, దక్షిణ కోస్తాలో 9 శాతం లోటు వర్షపాతం నమోదవగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పరిస్థితి ఓ మోస్తరుగా ఉంది. అల్పపీడనాలతో వచ్చేవారంలో వర్షాలు పడతాయన్న ఆశ తప్ప రుతుపవనాలపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సలహా ఇచ్చారు. వ్యవసాయశాఖ బుధవారం నాటి నివేదిక ప్రకారం.. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 347.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 310.3 మిల్లీమీటర్లు నమోదైంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణమైన 42.56 లక్షల హెక్టార్లలో ఇప్పటికి 29.74 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా.. 23.18 లక్షల హెక్టార్లలో వేశారు. వేసిన పంటల్లో కొన్ని ఇప్పటికే ఎండిపోగా రైతులు మరోసారి వేసేందుకు ఇష్టపడట్లేదు. వేరుశనగపై దాదాపు ఆశ లేనట్టే. పత్తి విస్తీర్ణమూ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతానికి గోదావరి డెల్టాలోనే పంటల పరిస్థితి మెరుగ్గా ఉంది. తగ్గిన ఉల్లి సాగు కోయకుండానే ప్రజల కంట నీరు పెట్టిస్తున్న ఉల్లి పంటను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెప్పినా ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గతేడాది 20,888 హెక్టార్లున్న ఉల్లి సాగు ఈసారి 18,917 హెక్టార్లకు పడిపోయింది. అత్యధికంగా సాగయ్యే కర్నూలు జిల్లాలో సైతం ఉల్లి సాగు తగ్గింది. జిల్లాలో గతేడాది 19,620 హెక్టార్లలో సాగవగా.. ఈ ఏడాది 16,400 హెక్టార్లకు తగ్గిపోయింది. విజయనగరంలో 62 హెక్టార్లు, విశాఖలో 17, తూర్పుగోదావరిలో 16, ప్రకాశంలో 21, నెల్లూరులో 115, వైఎస్సార్ కడపలో 2,216, చిత్తూరు జిల్లాలో 60 హెక్టార్లలో ఉల్లి పంట సాగవుతోంది.