Micro Art
-
సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసా
రాజాం సిటీ: సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసాను చెక్కి ప్రతిభ నిరూపించుకున్నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, స్వర్ణకారుడు ముగడ జగదీశ్వరరావు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా రజత పుస్తకం రూపొందించానని తెలిపారు. మొత్తం 22 పేజీలు గల 11 వెండి రేకులలో 40 హనుమాన్ చాలీసా శ్లోకాలను చేతితో చెక్కినట్లు పేర్కొన్నారు. 1.060 మిల్లీ గ్రాముల బరువుతో 3.2 సెంటీమీటర్ల పొడవు, 2.3 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ పుస్తకం తయారు చేశానని తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం పట్టిందన్నారు. పుస్తకం మొదటి పేజీలో ఆంజనేయుడు, ఆఖరి పేజీలో శ్రీరాముడు చిత్రపటాలను చెక్కినట్లు చెప్పారు. గతంలోనూ దేశనాయకులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఫొటోలను వెండి కాయిన్లపై చెక్కి అబ్బురపరిచారు. గిన్నిస్‌బుక్ లక్ష్యం.. గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించేందుకు ఈ మైక్రో ఆర్ట్‌ను ఎంచుకున్నాను. ప్రతి రోజు ఏదో ఒక చిత్రాన్ని వెండి కాయిన్‌పై రూపొందిస్తున్నా. భారతదేశ చిత్రపటాన్ని పెన్సిల్ ముల్లుపై 50 సెకన్లలో వేసినందుకు క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు లభించింది. మరింతగా సూక్ష్మమైన ఆర్ట్వేసి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదిస్తా. – ముగడ జగదీశ్వరరావు, మైక్రో ఆర్టిస్ట్, రాజాం -
గసగసాల గింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టం
రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుని రూపాలు యలమంచిలి రూరల్: విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక హస్త కళాకారుడు మరో అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. సూక్ష్మరూపంలో ఆకృతులను తయారు చేయడంలో ఏటికొప్పాక హస్తకళాకారులది అందెవేసిన చేయి. గతంలో అనేక పురాణ పురుషులు, దేశనాయకులు, చారిత్రక కట్టడాలను అతి సూక్ష్మరూపంలో తయారు చేసి ఎన్నో రికార్డులు సృష్టించారు. తాజాగా ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి గసగసాల గింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. తాటిముళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడిని వారి ఆయుధాలతో కూడిన చిత్రాలను లిఖించాడు. దీనిని తయారు చేయడానికి 18 రోజుల సమయం పట్టిందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సూక్ష్మ కళాఖండాలను తయారుచేస్తానని చిన్నయాచారి తెలిపారు. -
గోటితో కొండంత...
ఫొటో చూడగానే ఈ కుర్రవాడి ప్రతిభ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మైక్రో ఆర్ట్‌లో తన ప్రతిభను చాటుకుంటున్న ఇతడి పేరు చుండూరు పవన్. వయసు 21 ఏళ్లు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామంలో పుట్టాడు. ‘‘ఏదైనా విభిన్నంగా చేయాలనిపించింది. అందుకే వ్యర్థాలతో మైక్రో ఆర్ట్ చేయడం ప్రారంభించాను. వ్యర్థాలతో కళాకృతులు తయారుచేయడం ప్రారంభించిన కొత్తలో మా నాన్నగారు నన్ను కేకలేసేవారు. ఆ తరవాత ప్రోత్సహించడం మొదలుపెట్టారు’’ అంటాడు పవన్. ‘‘ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డిగ్రీ చదువుకున్నాను. అక్కడ బస్ స్టాండ్‌లో ఎందరో వికలాంగులను చూసేవాడిని. చాలా బాధ అనిపించేది. వారికి ఏమైనా చేయాలనుకునేవాడిని. అందుకే ఇలా డబ్బులు సేకరించి, ఎంత వస్తే అంత వారికి అందచేస్తుంటాను’’ అని వివరించాడు పవన్. ఇతడు చేసిన కళాకృతులు... వ్యర్థాలతో... టేబుల్ ఫ్యాను అర అంగుళం చెప్పులు పిఎస్ఎల్వి సి 23 నమూనా ఈగ సినిమా ప్రేరణతో ఈగ బొమ్మ... ఇవి మచ్చుకి మాత్రమే కేవలం మైక్రో ఆర్ట్ మాత్రమే కాకుండా, ఒకేసారి ఇద్దరు వినేలా రెండు ఇయర్ ఫోన్లు ఉంచడానికి అనువుగా సాకెట్‌ను కూడా తయారుచేశాడు. ‘‘ఇప్పుడు రేడియేషన్ ప్రొటెక్టర్ ఆప్ చేస్తున్నాను. దీని వల్ల మనం ఉన్న ప్రదేశంలో ఎంత రేడియేషన్ ఉన్నదీ తెలుసుకోవచ్చు. అలాగే కాలుష్యాన్ని నియంత్రించే హెల్మెట్ లాంటిది కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చోరీకి గురైన మోటారు వాహనాల ఆచూకీ కనుక్కోవడానికి వీలుగా, పాడైపోయిన సెల్ఫోన్లను అనుసంధానం చేసే ఉపకరణం తయారు చేయాలనేది నా ఆశ ’’ అంటున్న పవన్, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో తయారుచేసిన కళాకృతులను ఇంతవరకూ ప్రదర్శనకు ఉంచలేదని చెబుతున్నారు. అంతేకాదు, ఎప్పటికైనా యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డెరైక్టర్ కావాలనేది తన జీవితధ్యేయం అంటున్నారు.