గోటితో కొండంత...
ఫొటో చూడగానే ఈ కుర్రవాడి ప్రతిభ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మైక్రో ఆర్ట్‌లో తన ప్రతిభను చాటుకుంటున్న ఇతడి పేరు చుండూరు పవన్. వయసు 21 ఏళ్లు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామంలో పుట్టాడు. ‘‘ఏదైనా విభిన్నంగా చేయాలనిపించింది. అందుకే వ్యర్థాలతో మైక్రో ఆర్ట్ చేయడం ప్రారంభించాను. వ్యర్థాలతో కళాకృతులు తయారుచేయడం ప్రారంభించిన కొత్తలో మా నాన్నగారు నన్ను కేకలేసేవారు. ఆ తరవాత ప్రోత్సహించడం మొదలుపెట్టారు’’ అంటాడు పవన్.
‘‘ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డిగ్రీ చదువుకున్నాను. అక్కడ బస్ స్టాండ్‌లో ఎందరో వికలాంగులను చూసేవాడిని. చాలా బాధ అనిపించేది. వారికి ఏమైనా చేయాలనుకునేవాడిని. అందుకే ఇలా డబ్బులు సేకరించి, ఎంత వస్తే అంత వారికి అందచేస్తుంటాను’’ అని వివరించాడు పవన్.
ఇతడు చేసిన కళాకృతులు...
వ్యర్థాలతో... టేబుల్ ఫ్యాను అర అంగుళం చెప్పులు పిఎస్‌ఎల్‌వి సి 23 నమూనా ఈగ సినిమా ప్రేరణతో ఈగ బొమ్మ... ఇవి మచ్చుకి మాత్రమే
కేవలం మైక్రో ఆర్ట్ మాత్రమే కాకుండా, ఒకేసారి ఇద్దరు వినేలా రెండు ఇయర్ ఫోన్‌లు ఉంచడానికి అనువుగా సాకెట్‌ను కూడా తయారుచేశాడు.
‘‘ఇప్పుడు రేడియేషన్ ప్రొటెక్టర్ ఆప్ చేస్తున్నాను. దీని వల్ల మనం ఉన్న ప్రదేశంలో ఎంత రేడియేషన్ ఉన్నదీ తెలుసుకోవచ్చు. అలాగే కాలుష్యాన్ని నియంత్రించే హెల్మెట్ లాంటిది కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చోరీకి గురైన మోటారు వాహనాల ఆచూకీ కనుక్కోవడానికి వీలుగా, పాడైపోయిన సెల్‌ఫోన్లను అనుసంధానం చేసే ఉపకరణం తయారు చేయాలనేది నా ఆశ ’’ అంటున్న పవన్, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో తయారుచేసిన కళాకృతులను ఇంతవరకూ ప్రదర్శనకు ఉంచలేదని చెబుతున్నారు. అంతేకాదు, ఎప్పటికైనా యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డెరైక్టర్ కావాలనేది తన జీవితధ్యేయం అంటున్నారు.