ఆ వయసు కోసం వెయిట్ చేస్తున్నా!
లండన్: వయసు పెరుగుతుంటే... ఎవరికైనా కొంచెం ఉత్సాహం..కొంచెం ఉద్వేగం ఉంటాయి. అదే యాభైలలో పడుతుంటే మాత్రం కొంచెం ఆందోళన ఉంటుంది. అందులోనూ గ్లామర్ ప్రపంచంలో ఉన్న మహిళలకు మరింత ఎక్కువే ఉంటుంది. అయితే హాలీవుడ్ నటి, దర్శకురాలు, బోల్డ్ బ్యూటీ ఏంజిలీనా జోలీ మాత్రం తన వయసు పెరుగుతోంటే ఎగ్జయిటింగ్ గా ఫీలవుతోందట. తన జీవితంలో మరోమైలు రాయిని అధిగమించడానికి ఆమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది.
'నాకు ఇపుడు 40సంవత్సరాలు. ఇంకో పదేళ్లలో యాభై ఏళ్లు నిండుతాయి. యస్ ....అప్పటివరకూ వెయిట్ చేయలేకపోతున్నానని' చెప్పుకొచ్చింది ఈ హాలీవుడ్ బ్యూటీ.
ఇంతకీ ఏంజిలీనా జోలీ 50 ఏళ్ల వయసు కోసం ఎందుకింత ఆత్రుతగా ఉందో తెలుసా.. ఇప్పటికే ఆమె కుటుంబీకుల్లో ఇద్దరు మహిళలు ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడుతూ నలభైయేళ్ల లోపే చనిపోయారు. అయితే జోలీకి 40 ఏళ్లు అయినా ఆ మహమ్మారి తన దరికి చేరలేదనే ఆనందంతో ఇలా ఉత్సాహంగా ఉన్నట్లు ఉంది కాబోలు.
కాగా ఏంజిలీనా అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కాన్సర్ బాధితులే. ఈ నేపథ్యంలోనే ఏంజిలీనా క్యాన్సర్ రాకుండా ముందుగానే శస్త్ర చికిత్స చేయించుకుంది. గర్భసంచి, రెండు ఫాలోపియన్ ట్యూబులను తొలగించుకొంది. హై రిస్క్ గ్రూప్ లో ఉండడం వల్లనే ఇలా ఆపరేషన్ చేయించుకున్నానని జోలీ బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.