అధిక మిలటరీ వ్యయం అమెరికాదే
న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌ల నుంచి అమెరికా సైనిక ఉపసంహరణ ప్రారంభం అయిన నాటి నుంచి మొట్టమొదటి సారిగా ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం కాస్త పెరిగింది. అంటే 2011 తర్వాత తొలిసారిగా గతేడాది ప్రపంచ సైనిక వ్యయం ఒక శాతం పెరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ మిలటరీ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నది ప్రపంచ దేశాల్లో అమెరికానే. గతేడాది వ్యయం గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ 600 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది అమెరికా. 215 డాలర్లు ఖర్చు పెట్టిన చైనా రెండో స్థానంలో ఉంది.
జాతీయ స్థూల ఉత్పత్తితో పోలిస్తే మాత్రం సైనిక వ్యయంలో అమెరికా వెనకబడే ఉంది. ఈ విషయంలో అన్ని దేశాలకన్నా సౌదీ అరేబియా ముందుంది. సౌదీ అరేబియా జాతీయ స్థూల ఉత్పత్తిలో 13.5 శాతాన్ని మిలటరీపై ఖర్చు పెడుతుండగా, అమెరికా తన జాతీయ స్థూల ఉత్పత్తిలో 3.3 శాతం ఖర్చు పెడుతున్నది. చైనా 1.9 శాతం ఖర్చు పెడుతున్నది. 5.4 శాతంతో రష్యా రెండో స్థానంలో, 3.3 శాతంతో అమెరికా మూడో స్థానంలో, 2.6 శాతంతో దక్షిణ కొరియా నాలుగో స్థానంలో, 2.3 శాతంతో భారత్ ఐదవ స్థానంలో, 2.1 శాతంతో ఫ్రాన్స్ ఆరవ స్థానంలో, రెండు శాతంతో బ్రిటన్ ఏడవ స్థానంలో, 1.9 శాతంతో చైనా ఎనిమిదవ స్థానంలో, 1.2 శాతంతో జర్మనీ తొమ్మిదవ స్థానంలో, 1.0 శాతంతో జపాన్ పదవ స్థానంలో ఉంది.
రష్యాతో కలుపుకొని తూర్పు యూరప్‌లోనే మిలటరీ వ్యయం ఎక్కువగా పెరగ్గా ప్రపంచంలోని మిగతా అన్ని రీజియన్లలో తగ్గింది. ఈ పెరుగుదల ఏకంగా 7.5 శాతం ఉంది. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోనే సైనిక వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఆసియా, ఓసినియాలో ఐదు శాతం పెరిగింది. సాధారణంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మిలటరీపై ఎక్కువ ఖర్చు పెట్టేవి. అయితే ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డ నాటి నుంచి ఈ దేశాలు సైనిక వ్యయాన్ని తగ్గిస్తూ వచ్చాయి. ఈసారి అన్ని దేశాలకన్నా ఆఫ్రికా తన సైనిక వ్యయాన్ని ఐదు శాతం తగ్గించుకున్నట్లు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.