థాట్ రీడింగ్ మెషీన్ గురించి విన్నారా? ఇది నిజమేనా?
డాక్టర్ గారూ... మా ఊర్లో ఇటీవల థాట్ రీడింగ్ మెషీన్స్ వచ్చాయి. కొందరు వాటిని నా మీద ప్రయోగించి, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనివల్ల బతికుండగానే నరకం అనుభవిస్తున్నాను. ఒకసారి ఆత్యహత్యా ప్రయత్నం కూడా చేశాను. నేను ఈ బాధలు తట్టుకోలేక డైరెక్టుగా వారిని కలిసి అడిగితే, మాకేం తెలియదని బుకాయిస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో మీరైనా సలహా ఇవ్వగలరు – రఘురామ్, గుంతకల్లుమీ మానసిక వేదన అర్థమైంది. ప్రపంచంలో ఇంతవరకు మీరు చెప్పిన లాంటి థాట్ రీడింగ్ మెషీన్ ఎక్కడా రాలేదు. అది జరగని విషయమే. కేవలం ఒక మెషిన్ ద్వారా ఒకరి ఆలోచనలను ఇంకొకరు తెలుసుకోగలిగితే, ప్రపంచంలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవి. అదేవిధంగా మరికొన్ని కొత్త సమస్యలు కూడా పుట్టుకొచ్చి ఉండేవి. నిజంగా మీరు చెప్పిన మెషీన్లు గనక వస్తే, మనుషుల మధ్య స్పర్ధలు, అ΄ోహలు, గొడవలే కాకుండా సమాజంలో కూడా అశాంతి, అలజడి చెలరేగే ప్రమాదం ఉంది. అలాంటి మెషీన్స్ కేవలం రచయితల కల్పనలే. అవి సినిమాలకు, నవలలకు మాత్రమే పరిమితం. కానీ వాస్తవం కానే కాదు. పారనాయిడ్ సైకోసిస్ అనే మానసిక వ్యాధికి గురైన వ్యక్తులు, ఒక్కోసారి ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనయ్యే అవకాశముంది. లేనివి ఉన్నట్లుగా భావించి, నిజమని నమ్మి, తాము మనోవేదనకు గురి కావడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. (‘అమ్మ’కు సుస్తీ చేస్తే? అమ్మ పనులు చేయడం వచ్చా? )ఎంత తార్కికంగా వీరికి నచ్చజెప్పచూసినా, వీరు ఆ మూఢ నమ్మకాలనుంచి బయట పడలేరు. ఇలాంటి భావనలను హెల్యూజన్స్ ఆఫ్ పర్‌సెక్యూషన్ అని అంటారు. ఎవరో వైర్లెస్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా తమ మైండ్‌ను కంట్రోల్ చేస్తున్నారనే కొందరి భావనలు కూడా ఈ కోవకు చెందినవే! మెదడులోని డోపమైన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థంలోని సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి భ్రమలు– భ్రాంతులు కలుగుతాయి. మీకు నేనిలా సలహా చెబుతున్నానని అన్యధా భావించక వెంటనే మీకు దగ్గరలోని సైకియాట్రిస్టును సంప్రదించి, మీకున్న ఈ ఇబ్బందికి తగిన చికిత్స తీసుకుంటే మీకొచ్చిన ఇలాంటి భ్రమలు, ఆలోచనలు పటాపంచలై మీరు వీటిలోనుంచి పూర్తిగా బయట పడి, మనశ్శాంతిగా ఉండగలరు. ఆల్ ది బెస్ట్!