mini gurukulam
-
నీటి కొరత ఉందని ఓ ప్రిన్సిపాల్ దారుణం..!
సాక్షి, మెదక్ జోన్: గురుకులంలో నీటి ఎద్దడి ఉందనే సాకుతో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినుల జుట్టు కత్తిరింపజేసిన ఉదంతం మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణంలోని మినీ గురుకులంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యారి్థనులు ఉన్నారు. వారి వసతి గృహానికి నీటిని సరఫరా చేసే బోరుబావి ఏప్రిల్‌లో ఎండిపోయింది. దీంతో నీటి సమస్య తీవ్రంగా మారింది. మూడ్రోజులకోసారి రూ.600 వెచి్చంచి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులతల వెంట్రుకలు పెద్దగా ఉండడంతో నీటిఖర్చు అధికమవుతుందని భావించిన ప్రిన్సిపాల్ అరుణారెడ్డి తల్లిదండ్రులకుగానీ, పాఠశాల కమిటీకి గానీ సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 9న విద్యారి్థనుల జుట్టు కత్తిరింపజేసి వాటిని విక్రయించారు. విషయం బయటికి పొక్కడంతో మరుసటి రోజు కొంతమంది తల్లిదండ్రులు గురుకులం వద్ద ఆందోళన చేశారు. దీంతో ప్రిన్సిపాల్ తమ సిబ్బందిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మరి కొంతమంది సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్ గది నుంచి బయటికి రాలేదు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా నీటిసమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
మినీ గురుకుల సిబ్బందికి వేతన కష్టాలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మినీ గురుకులాల్లో సిబ్బందికి వేతన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అత్తెసరు జీతాలే ఇస్తోంది. ఒక్కో ఉద్యోగికి నెలవారీ వేతనం రూ.5వేలకు మించడం లేదు. మెజార్టీ ఉద్యోగులకు నెలకు కేవలం రూ.2,500 చొప్పున ఇవ్వడం గమనార్హం. వీటిని పెంచాలని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని మినీ గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచే అడ్మిషన్లు తీసుకుని వసతితో కూడిన బోధన అందిస్తుంది. ఇలా గిరిజన సంక్షేమ శాఖ 29 మినీ గురుకులాలను తెరిచింది. వీటిలో వార్డెన్, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎం, అకౌంటెంట్, కుక్, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్మెన్ కేటగిరీల్లో 418 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. ఏళ్లుగా అరకొర జీతాలే మినీ గురుకులాల్లో సిబ్బందికి ఏళ్లుగా అరకొర వేతనాలే ఇస్తున్నారు. వార్డెన్‌కు రూ.5 వేలు, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎంలకు రూ.4 వేలు, అకౌంటెంట్‌కు రూ.3,500, కుక్, ఆయా, స్వీపర్, వాచ్మెన్లకు రూ.2,500 చొప్పున వేతనాలిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ గురుకులాల్లో సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. వేతన పెంపును కోరుతూ పలుమార్లు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు. గిరిజన సంక్షేమ శాఖ వేతన పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించి ఏడాది కావస్తున్నా ఫైలుకు మోక్షం కలగలేదు. మరో పక్షం రోజుల్లో 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు వేతనాలు పెంచాలని మినీ గురుకులాల సిబ్బంది అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గడువులోగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే విధులు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
ఆరేళ్లుగా అదే వేతనం
మినీ గురుకులాల్లో సీఆర్టీలకు పెరగని జీతం ఇబ్బందుల్లో ఒప్పంద ఉపాధ్యాయులు బేల : జిల్లాలోని నాలుగు మండలాల్లో కొనసాగుతున్న మినీ గురుకులం బాలికల ప్రాథమిక పాఠశాలల సీఆర్టీల వేతనాలు పెరగడం లేదు. ఆరేళ్లుగా వారు చాలీచాలని వేతనంతో పనిచేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మిగతా విద్యాసంస్థల్లో పెంచినట్లు తమ వేతనాలూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని బేల మండలం సదల్పూర్ గ్రామం, నార్నూర్ మండలం లోకారి, నేరడిగొండ మండలం గుప్తాల, మామడ మండల కేంద్రంలో ఒక్కోటి చొప్పున 2000 సంవత్సరంలో మినీ గురుకులం బాలికల ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఇందులో విద్యాబోధన కోసం ఐదుగురు సీఆర్టీలు, ఒక సీఈటీ, ఒక ఏఎన్ఎంను నియమించారు. సీఆర్టీకి ప్రతీ నెల రూ.4వేలు, అకౌటెంట్కు రూ.3,500 వేతనం ఉంది. ఇవి కూడా రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని కస్తూర్బాగాంధీ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు రూ.15000 వరకు, వీవీలకు 8వేల వరకు వేతనాలు పెరిగాయి. కానీ మినీ గురుకులాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం ఆరేళ్లుగా నిరాశే మిగిలింది. ప్రభుత్వం తమ వేతనాలు పెంచాలని సీఆర్టీలు కోరుతున్నారు. చాలీచాలని వేతనం ఈ గురుకులం ప్రారంభం నుంచి పనిచేస్తున్న. ఇప్పుడు ప్రతీ నెల వేతనం రూ.4వేలు ఉంది. ఈ వేతనం రెండు, మూడు నెలలకోసారి వస్తుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. – రేవతి, సీఆర్టీ, మినీ గురుకులం సదల్పూర్ (బేల) వేతనాలు పెంచాలి అన్ని ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో సీఆర్టీలకు వేతనాలు పెంచారు. కానీ మినీ గురుకులంలో పనిచేస్తున్న మాకు ఇప్పటి వరకూ వేతనాలు పెంచలేదు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. – కవిత, సీఆర్టీ, మినీ గురుకులం లోకారి (నార్నూర్)