వరంగల్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్!
హైదరాబాద్: టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వరంగల్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫిబ్రవరిలో కంపెనీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కంపెనీకి అతిపెద్ద క్యాంపస్ అయిన పోచారం కేంద్రాన్ని అదే నెలలో ప్రారంభిస్తోంది. మైసూరు సెంటర్ మాదిరిగా ఇంజనీరింగ్ పూర్తయిన తాజా గ్రాడ్యుయేట్లకు వరంగల్ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. క్యాంపస్ ఏర్పాటు విషయమై కంపెనీ సీఈవో విశాల్ సిక్కాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చర్చించినట్టు సమాచారం.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం టి-హబ్‌ను సందర్శించిన సందర్భంగా వీరిరువురు భేటీ అయ్యారు. ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం నూతన ఐటీ విధాన ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో మినీ ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ హబ్‌లలో కార్యాలయాలను నెలకొల్పే కంపెనీలకు ప్రోత్సాహకాలతో పాటు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఇటీవల తెలిపారు.