minimum standards
-
కల్తీ భోజనంబు..!
నోరూరించే రుచికరమైన ఆహారం తిందామని హోటల్‌కి వెళుతున్న వారు అనారోగ్యం పాలవుతున్నారు. రోడ్డుపక్కన ఉన్న బండ్లే కాదు.. చిన్న చిన్న హోటళ్ల నుంచి రెస్టారెంట్లలో సైతం అంతా కల్తీనే. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, నాసిరకం, కల్తీ, రసాయన వస్తువులతో ఆహార పదార్థాలను కలర్ ఫుల్‌గా తయారు చేస్తూ నాణ్యతకు పాతరేస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు . శుభ్రతను గాలికొదిలేశారు. హోటళ్లలోని వంటశాలల్లో పారిశుద్ధ్యం సైతం అధ్వానంగా ఉంటోంది. నెల్లూరు నగరంలో నాలుగు రోజులుగా ఫుడ్ కంట్రోల్ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సాక్షి, నెల్లూరు(సెంట్రల్) : జిల్లావ్యాప్తంగా స్టార్ రెస్టారెంట్ల నుంచి చిన్న చిన్న హోటళ్లు సుమారు 1100 వరకూ ఉన్నాయి. నెల్లూరు నగరంలో 450 వరకు ఉన్నాయి. హైవేపై దాబాలు 70 వరకూ ఉన్నాయి. జిల్లాలో పెద్ద హోటళ్లు పదికి పైగా ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో హోటళ్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కేవలం 50 లోపు మాత్రమే లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న హోటళ్లపై ఫుడ్ కంట్రోల్ అధికారులు, హెల్త్ అధికారులు నాలుగు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల కనీస నాణ్యత కూడా పాటించడం లేదు. మాం సాహారాలు ఎక్కువగా ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన వాటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వాటితో బిర్యా నీ, కర్రీస్ తయారు చేస్తున్నారు. అలాగే తయారు చేసే చోట నాణ్యత లేకుండా అపరిశుభ్రంగా ఉన్నాయి. దాబా ల్లో కూడా ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా నాణ్యత లేకుండా మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నట్టు తెలు స్తోంది. అంతేకాకుండా నగరంలోని పలు ఐస్ క్రీం షాపుల్లో సైతం మోతాదుకు మిం చి రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీలతో వినియోగదారులను మోసం చేస్తున్న వారి పై అధికారులు వరుస దాడులు చేస్తున్నా రు. అధికారుల దాడుల వివరాలను ముం దుగానే తెలుసుకుని కొందరు జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా పండ్లపై సైతం రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్‌లలో కూడా అంతా కల్తీనే. స్వీట్ దుకాణాల్లో సైతం కల్తీ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. నాలుగు రోజులు గా దాడులు నిర్వహిస్తున్న అధికారులు 120 వరకు కేసులు నమోదు చేశారు. లైసెన్సులు పొందాలి ఇలా.. ఆహార పదార్థాల విక్రయాలు చేసే ప్రతి సంస్థ, దుకాణం, మాల్స్ తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాల చట్టానికి సంబంధించి లైసెన్సును పొందాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షల లోపు టర్నోవర్ చేస్తున్న చిన్న బడ్డీకొట్టులు, బండిపై విక్రయాలు చేసే వారు ఏడాదికి రూ.100, అలాగే రూ.12 లక్షలపైన, రూ.20 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వారు ఏడాదికి రూ.2 వేలు కట్టి లైసెన్సులు తీసుకోవాలి. ప్యాకెట్ చేసి బ్రాండ్ నేమ్ వేసుకునే వారు ఏడాదికి రూ.3 వేలు, వివిధ రకాల తయారీ యూనిట్లు రూ.5 వేలు చెల్లించి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. హోటళ్లలో అధికారుల తనిఖీలు నెల్లూరు(సెంట్రల్): నగరంలోని హోటళ్లలో ఫుడ్ కంట్రోల్ అధికారులు, మున్సిపల్ హెల్త్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నగరంలోని బాబు ఐస్‌క్రీమ్స్, మద్రాస్ బస్టాండు సెంటర్లోని బిరియాని హౌస్, సింహపురి రుచులు, హోటల్ ప్రిన్స్లో అధికారులు తనిఖీలు జరిపారు. బాబు ఐస్‌క్రీమ్స్‌లో తయారీ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించారు. బిరియాని హౌస్‌లో, సింహపురి రుచుల్లో నాణ్యత లేని రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఒక్కరోజు దాడుల్లో సుమారు రూ.1.50 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ మూర్తి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలకు హాని కలిగించే ఏ విధమైన ఆహారాన్ని విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిల్వ లేని ఆహారాన్ని విక్రయాలు చేయాలే తప్ప రోజుల తరబడి నిల్వ చేస్తే ఊరుకునేది లేదు. మా సంతకం లేకుండా ఎక్కడా లైసెన్సులు ఇవ్వడం జరగదు. – బి.శ్రీనివాస్, ఫుడ్ కంట్రోల్ జిల్లా అధికారి -
మేల్కోకుంటే..కన్నీటి గోదారే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా జిల్లా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నది పవిత్ర సంగమం ప్రాంతంలో సుమారు 19 నిండుప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతోనైనా మన అధికారులకు కనువిప్పు కలగాలని జిల్లా ప్రజలు కోరుకొంటున్నారు. లేకుంటే అటువంటి విషాద ఘటనలే మన జిల్లాలో చోటుచేసుకునే ప్రమాదముంటుందని ఆందోళన చెందుతున్నారు. మన జిల్లాకు సుదీర్ఘ నదీ తీరం ఉంది. అటు తెలంగాణలోని భద్రాచలం నుంచి.. ఇటు అంతర్వేది, యానాం వరకూ గోదావరి నదిపై ఎన్నో బోట్లు తిరుగుతుంటాయి. పాపికొండల పర్యాటకులను తీసుకువెళ్లేవి కొన్నయితే, ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రయాణికులను తరలించేవి మరికొన్ని. వీటిల్లో చాలా బోట్లు కనీస ప్రమాణాలు కూడా పాటించడంలేదు. వాస్తవంగా చెప్పాలంటే జిల్లాలో తిరుగుతున్న బోట్లపై అధికారులకు కనీస అజమాయిషీ కూడా ఉండడం లేదు. సరైన పర్యవేక్షణ, తనిఖీలు, నిఘా లేకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పలు ప్రమాదాలు ⇒ పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి పాయలో 2012 నవంబర్ 18వ తేదీ సాయంత్రం మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 మందితో వెళ్తున్న ఇంజిన్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంకకు చెందిన కుటుంబాల వారు అదే జిల్లాకు చెందిన మాచేనమ్మ అమ్మవారి గుడికి నదీ మార్గంలో ఉదయం వెళ్లారు. సాయంత్రం తిరిగి బోటుపై ఇళ్లకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ⇒ గత ఏడాది జూన్, జూలై నెలల్లో బొబ్బర్లంక వద్ద కాటన్ బ్యారేజి నుంచి ఒకేసారి నీరు వదిలేయడంతో లంక పొలాలకు వెళ్లే రైతుల్లో నలుగురు చనిపోయారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల రైతులు బోటు మీద వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ⇒ పలుమార్లు గోదావరి నదిలో పర్యాటక బోట్లు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంఘటనలున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే హడావుడి జిల్లాలో పర్యాటక శాఖకు సంబంధించిన బోట్లు సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయి. కానీ, ప్రైవేటు ఆపరేటర్లకు చెందిన బోట్లు 75 వరకూ ఉన్నాయి. వీటిలో నిర్దిష్ట ప్రమాణాలతో ఉన్నవెన్ని అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వరకూ, దిండి, కోరంగి, యానాం, ఎదుర్లలంక, కోటిపల్లి రేవుల్లో పడవలు తిరుగుతున్నాయి. పురుషోత్తపట్నం – పోలవరం మధ్య, దేవీపట్నం – సింగన్నపల్లె మధ్య, కొండమొదలు – శివగిరి మధ్య, కొండమొదలు – దేవీపట్నం మధ్య, మరికొన్ని గ్రామాలకు పడవలు తిరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి తీరాన ఉన్న ప్రజలు రాకపోకలకు ఎక్కువగా బోట్ల పైనే ఆధారపడుతున్నారు. ఇవి కాకుండా వేటకు వెళ్లే మత్స్యకారులు మరో 200 బోట్లు వినియోగిస్తున్నారు. వీటి పరిస్థితిపై తరచుగా తనిఖీ చేసే నాథుడే లేడు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. తరువాత పట్టించుకోకపోవడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలోని బోట్లను పర్యాటక శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఒక కమిటీ వేశారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. జాగ్రత్తలు తీసుకోని నిర్వాహకులు జిల్లాలో అనుమతి ఉన్నవాటికంటే అనుమతి లేని బోట్లే ఎక్కువగా నడుస్తున్నాయి. అత్యధిక బోట్లలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. ప్రధానంగా ఉండాల్సిన లైఫ్ జాకెట్లే ఉండటం లేదు. కొన్నింటిలో ఉన్నా వాటిని ఓ మూలన పడేస్తున్నారు. కొన్ని బోట్లలో లైఫ్ జాకెట్లు ఇచ్చినా అసౌకర్యంగా ఉంటున్నాయని పర్యాటకులు సహితం వేసుకోవడం లేదు. దీనిపై వారికి అవగాహన కూడా కల్పించడం లేదు. లైఫ్ జాకెట్లు వేసుకుంటేనే అనుమతిస్తామని బోటు నిర్వాహకులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. పలు బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను యథేచ్ఛగా ఎక్కిస్తున్నారు. నిబంధనలు పాటించేవెన్నో.. జిల్లాలోని బోట్లలో నిబంధనల మేరకు ఉన్నవెన్ని అన్నదానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. ఏటా ఏప్రిల్‌లో రెన్యువల్ చేయడం, ఫిట్నెస్ సర్టిపికెట్ ఇవ్వడమనేది షరా మమూలుగా మారిపోయింది. వాస్తవానికైతే, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పర్యాటక అధికారులు నిబంధనలు పాటించని బోట్లపై ఓ కన్ను వేయాలి. కానీ, అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. పర్యాటక బోట్లు సీజ్ దేవీపట్నం: కృష్ణా నదిలో బోటు ప్రమాదం నేపథ్యమో ఏమో కానీ.. పాపికొండల విహార యాత్రకు వెళుతున్న నాలుగు పర్యాటక బోట్లను అధికారులు సీజ్ చేశారు. ఆదివారం పాపికొండల పర్యటనకు విపరీతమైన రద్దీ ఏర్పడడంతో బోట్ సూపరింటెండెంట్ జి.ప్రసన్నకుమార్ బోట్లను సాయంత్రం తనిఖీ చేశారు. జెమిని, గోదావరి గ్రాండ్, సాయి శ్రీనివాస్, పున్నమి ఎక్స్‌ప్రెస్ బోట్లలో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని 15 రోజులపాటు రద్దు చేసినట్టు తెలిపారు. -
జోరుగా మినరల్ వాటర్ వ్యాపారం
పరిగి, న్యూస్‌లైన్: లాభాల వేటలో వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. వేసవిలో నీటికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో బరిలోకి దిగిన వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన మినరల్ నీరంటూ 20 లీటర్ల డ బ్బాకు రూ. 15 వసూలు చేస్తున్నారు. అయితే ఈ నీటి తయారీకి కనీస ప్రమాణాలు పాటించకున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిగి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండటం, కొత్తగా పలు విద్యా సంస్థలు కూడా వెలియడంతో జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో పట్టణంలో మినరల్ వాటర్ వినియోగం పెరిగిపోయి వ్యాపారులకు కాసుల పంటపండిస్తోంది. పరిగి పట్టణంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆరు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజుకు 3వేల లీటర్ల వరకు నీటిని విక్రయిస్తున్నారు. ఆటోలు, ఇతర వాహనాల ద్వార డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే నీటిని సరఫరా చేసే కంపెనీ తమ బాటిళ్లపై కంపెనీ స్టిక్కర్ అతికించాలి. కాని పరిగిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లకు చెందిన ఏ ఒక్కరూ బాటిళ్లకు స్టిక్కర్లు అతికించడం లేదు. ఇంటి దగ్గరకే నీరు వస్తుండటంతో ప్రజలు కూడా ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిలో క్రిమికీటకాలు రాకుండా ఓ రసాయన పదార్థాన్ని కలుపుతారు. నీటిని ఫిల్టర్ చేశాక తిరిగి వాటిలో సమపాల్లలో మినరల్స్ కలపాల్సి ఉంటుంది. వీటని సంబంధిత కంపెనీలు ఆచరించటం లేదు. అంతేకాకుండా కనీసం బాటిళ్లను కూడా శుభ్రపర్చకపోవడంతో అవి నాచు పట్టి కనిపిస్తున్నాయి. గతంలో ఈ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎవరూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తేల్చారు. అయితే ఆ తర్వాత మాత్రం సదరు కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేవు.... పరిగి పట్టణంలో ఏర్పాటు చేసిన ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లకు ఎలాంటి అనుమతులు లేవు. గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. తదుపరి పంచాయతీ నుంచి ప్లాంటును నిర్మించడానికి, నీటిని విక్రయించడానికి ఎలాంటి అనుమతులు పొందలేదు. రెండు ప్లాంట్లకు తప్పా మిగితావాటికి ఐఎస్ఐ సర్టిఫికెట్లు కూడా లేవు. ఐఎస్ఐ సర్టిఫికెట్ పొందాలంటే అన్ని రకాల పరీక్షలను ప్లాంటు ఎదుర్కొవాల్సి ఉంటు ంది. దీంతో ప్లాంట్ల నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. నామమాత్రపు అనుమతులు తీసుకున్నవారు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని, స్వచ్ఛమైన నీటిని పంపిణీ చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.