మేల్కోకుంటే..కన్నీటి గోదారే.. | Monitoring and live jackets unavailable in godavari river boats | Sakshi
Sakshi News home page

మేల్కోకుంటే..కన్నీటి గోదారే..

Published Mon, Nov 13 2017 11:44 AM | Last Updated on Mon, Nov 13 2017 11:44 AM

Monitoring and live jackets unavailable in godavari river boats - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా జిల్లా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నది పవిత్ర సంగమం ప్రాంతంలో సుమారు 19 నిండుప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతోనైనా మన అధికారులకు కనువిప్పు కలగాలని జిల్లా ప్రజలు కోరుకొంటున్నారు. లేకుంటే అటువంటి విషాద ఘటనలే మన జిల్లాలో చోటుచేసుకునే ప్రమాదముంటుందని ఆందోళన చెందుతున్నారు.

మన జిల్లాకు సుదీర్ఘ నదీ తీరం ఉంది. అటు తెలంగాణలోని భద్రాచలం నుంచి.. ఇటు అంతర్వేది, యానాం వరకూ గోదావరి నదిపై  ఎన్నో బోట్లు తిరుగుతుంటాయి. పాపికొండల పర్యాటకులను తీసుకువెళ్లేవి కొన్నయితే, ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రయాణికులను తరలించేవి మరికొన్ని. వీటిల్లో చాలా బోట్లు కనీస ప్రమాణాలు కూడా పాటించడంలేదు. వాస్తవంగా చెప్పాలంటే జిల్లాలో తిరుగుతున్న బోట్లపై అధికారులకు కనీస అజమాయిషీ కూడా ఉండడం లేదు. సరైన పర్యవేక్షణ, తనిఖీలు, నిఘా లేకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

గతంలో పలు ప్రమాదాలు
పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి పాయలో 2012 నవంబర్‌ 18వ తేదీ సాయంత్రం మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 మందితో వెళ్తున్న ఇంజిన్‌ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంకకు చెందిన కుటుంబాల వారు అదే జిల్లాకు చెందిన మాచేనమ్మ అమ్మవారి గుడికి నదీ మార్గంలో ఉదయం వెళ్లారు. సాయంత్రం తిరిగి బోటుపై ఇళ్లకు వస్తుండగా ప్రమాదం జరిగింది.
గత ఏడాది జూన్, జూలై నెలల్లో బొబ్బర్లంక వద్ద కాటన్‌ బ్యారేజి నుంచి ఒకేసారి నీరు వదిలేయడంతో లంక పొలాలకు వెళ్లే రైతుల్లో నలుగురు చనిపోయారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల రైతులు బోటు మీద వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
పలుమార్లు గోదావరి నదిలో పర్యాటక బోట్లు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంఘటనలున్నాయి.

ప్రమాదం జరిగినప్పుడే హడావుడి
జిల్లాలో పర్యాటక శాఖకు సంబంధించిన బోట్లు సింగిల్‌ డిజిట్‌లోనే ఉన్నాయి. కానీ, ప్రైవేటు ఆపరేటర్లకు చెందిన బోట్లు 75 వరకూ ఉన్నాయి. వీటిలో నిర్దిష్ట ప్రమాణాలతో ఉన్నవెన్ని అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలో పురుషోత్తపట్నం నుంచి పాపికొండల వరకూ, దిండి, కోరంగి, యానాం, ఎదుర్లలంక, కోటిపల్లి రేవుల్లో పడవలు తిరుగుతున్నాయి. పురుషోత్తపట్నం – పోలవరం మధ్య, దేవీపట్నం – సింగన్నపల్లె మధ్య, కొండమొదలు – శివగిరి మధ్య, కొండమొదలు – దేవీపట్నం మధ్య, మరికొన్ని గ్రామాలకు పడవలు తిరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి తీరాన ఉన్న ప్రజలు రాకపోకలకు ఎక్కువగా బోట్ల పైనే ఆధారపడుతున్నారు. ఇవి కాకుండా వేటకు వెళ్లే మత్స్యకారులు మరో 200 బోట్లు వినియోగిస్తున్నారు. వీటి పరిస్థితిపై తరచుగా తనిఖీ చేసే నాథుడే లేడు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. తరువాత పట్టించుకోకపోవడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలోని బోట్లను పర్యాటక శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఒక కమిటీ వేశారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.

జాగ్రత్తలు తీసుకోని నిర్వాహకులు
జిల్లాలో అనుమతి ఉన్నవాటికంటే అనుమతి లేని బోట్లే ఎక్కువగా నడుస్తున్నాయి. అత్యధిక బోట్లలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. ప్రధానంగా ఉండాల్సిన లైఫ్‌ జాకెట్లే ఉండటం లేదు. కొన్నింటిలో ఉన్నా వాటిని ఓ మూలన పడేస్తున్నారు. కొన్ని బోట్లలో లైఫ్‌ జాకెట్లు ఇచ్చినా అసౌకర్యంగా ఉంటున్నాయని పర్యాటకులు సహితం వేసుకోవడం లేదు. దీనిపై వారికి అవగాహన కూడా కల్పించడం లేదు. లైఫ్‌ జాకెట్లు వేసుకుంటేనే అనుమతిస్తామని బోటు నిర్వాహకులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. పలు బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను యథేచ్ఛగా ఎక్కిస్తున్నారు.

నిబంధనలు పాటించేవెన్నో..
జిల్లాలోని బోట్లలో నిబంధనల మేరకు ఉన్నవెన్ని అన్నదానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. ఏటా ఏప్రిల్‌లో రెన్యువల్‌ చేయడం, ఫిట్‌నెస్‌ సర్టిపికెట్‌ ఇవ్వడమనేది షరా మమూలుగా మారిపోయింది. వాస్తవానికైతే, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పర్యాటక అధికారులు నిబంధనలు పాటించని బోట్లపై ఓ కన్ను వేయాలి. కానీ, అటువంటి దాఖలాలు కనిపించడం లేదు.

పర్యాటక బోట్లు సీజ్‌
దేవీపట్నం: కృష్ణా నదిలో బోటు ప్రమాదం నేపథ్యమో ఏమో కానీ.. పాపికొండల విహార యాత్రకు వెళుతున్న నాలుగు పర్యాటక బోట్లను అధికారులు సీజ్‌ చేశారు. ఆదివారం పాపికొండల పర్యటనకు విపరీతమైన రద్దీ ఏర్పడడంతో బోట్‌ సూపరింటెండెంట్‌ జి.ప్రసన్నకుమార్‌ బోట్లను సాయంత్రం తనిఖీ చేశారు. జెమిని, గోదావరి గ్రాండ్, సాయి శ్రీనివాస్, పున్నమి ఎక్స్‌ప్రెస్‌ బోట్లలో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని 15 రోజులపాటు రద్దు చేసినట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement