Minister Etala Rajendar
-
ప్రజలపై భారంలేని పాలన అందిస్తున్నాం: మంత్రి ఈటెల
సాక్షి, బిచ్కుంద(నిజామాబాద్) : ఐదేళ్ల వయసున్న రాష్ట్రం అయినప్పటికీ ఉద్యమనేత సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ప్రజలపై పన్ను ఇతర భారం వేయకుండా సురక్ష, సుభిక్ష పాలన అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం బిచ్కుందలో రూ. 5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని మంత్రులు ఈటల రాజేందర్, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్ ప్రారంభించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తాగునీటితో ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని భావించి సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ అడవి బిడ్డల నుంచి బంజారాహీల్స్‌లో నివసిస్తున్న ప్రతి ఇంటికి మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీటిని అందించారని అన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాలలో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పడంతో పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చిన్న రాష్ట్రం ఉన్నప్పటికి మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి ఇతరులకు సీఎం ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 170 కిలోమీటర్లు గోదావరి నీటితో కళకళలాడుతుందన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికి 24 గంటలు కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే హన్మంత్ సింధే మంత్రిని కోరారు. మంత్రి స్పందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సభలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్ జిల్లాలో రూ.610 కోట్లతో రోడ్లు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి కామారెడ్డి జిల్లాకు రూ.610 కోట్ల నిధులు వెచ్చించి గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల వసతి కల్పించామని రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ఎమ్మెల్యే హన్మంత్ సింధే పట్టుబట్టి ఒక్క జుక్కల్ నియోజక వర్గానికే రోడ్ల కోసం రూ.220 కోట్లు నిధులు మంజూరు చేయించుకున్నారని అన్నారు. జుక్కల్ నియోజక వర్గంలో కొన్ని రోడ్లు పూర్తి కాలేదని, బిచ్కుంద, జుక్కల్‌లో సెంట్రల్ లైటింగ్ కోసం ఎమ్మెల్యే కోరారని మంజూరుకు హామీ ఇస్తున్నామన్నారు. మూడు రాష్ట్రాల ప్రజలకు వైద్యం: ఎమ్మెల్యే సింధే జుక్కల్ నియోజక వర్గంలో కొత్తగా ఆస్పత్రులు నిర్మించడంతో మూడు రాష్ట్రాల ప్రజలకు వైద్యం అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. మంగళవారం బిచ్కుందలో 30పడకల ఆస్పత్రిని మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిచ్కుందలో ప్రారంభించిన ఆస్పత్రికి, జుక్కల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది వైద్యులు, స్టాఫ్ మంజూరు చేయాలన్నారు. చిల్లర్గీ, పెద్ద ఎక్లార, కొమలంచ, మహ్మదాబాద్‌లో కొత్తగా పీహెచ్‌సీలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్‌లో రెగ్యూలర్ వైద్యులు, స్టాప్ నర్సులు, టెక్నీషియన్ లేక వైద్యం కోసం ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయాలని, అలాగే సోస్టుమార్డం గది, ప్రహరి, మద్నూర్‌లో 50 పడకలు, నిజాంసాగర్, పెద్దకొడప్గల్ 30 పడకలు ఆస్పత్రి కావాలని కోరారు. బిచ్కుంద, జుక్కల్‌లో సెంట్రల్ లైటింగ్, ఆయా గ్రామాల్లో రోడ్లు, నియోజక వర్గంలో 162 జీపీలు ఉన్నాయి ఒక్కో గ్రామ పంచాయతికి సీసీ రోడ్ల కోసం రూ.10లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్ కోరారు. ఇద్దరు మంత్రులు స్పందించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్లు దఫెదార్ శోభా రాజు, విఠల్‌రావు, జేసీ యాదిరెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఆర్డివో రాజేశ్వర్, ఆరు మండల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు అశోక్ పటేల్, నాల్చర్ భారతి, సర్పంచ్ శ్రీరేఖరాజు, నాయకులు వెంకట్రావు, నాల్చర్ రాజు, సాయిరాం, రాంరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ లేకపోయినా రేషన్: ఈటల
సాక్షి, హైదరాబాద్: బయోమెట్రిక్ పనిచేయకపోతే మ్యానువల్ లేదా ఐరిస్‌తో వినియోగదారులకు రేషన్ సరుకులు ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. మంగళవారం పౌరసరఫరాలు, తూనికల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 31 జిల్లాల తూనికలు కొలతల అధికారులకు ల్యాప్‌టాప్‌లు, వాహనాలను ఈటల, సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ అకున్ సభర్వాల్ అందజేశారు. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని, మల్టీప్లెక్స్ మోసాలను కూడా అరికడుతున్నామని ఈటల తెలిపారు. -
‘రైతుబంధు’ తరహాలో మరో కొత్త పథకం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రైతుబంధు’తరహాలో ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసిందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రెండ్రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అన్ని నగరాలు, పట్టణాల్లో బ్యాంకర్లతో సంబంధం లేకుండా పేదలకు నేరుగా చెక్కుల రూపేణా రుణాలు అందిస్తామన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలో లబ్ధిచేకూరేలా ఈ పథకానికి రూపకల్పన చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఒకసారి లబ్ధిపొందిన వారు ఐదేళ్ల వరకు అనర్హులని, ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం ఉందని తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జేసీ, డీఆర్డీఏ, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఉండే కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేస్తారన్నారు.లబ్ధిదారుల వాటా ఉండే రుణం మంజూరు కూడా ఉందన్నారు. రూ.లక్ష రుణం మంజూరుకు రూ.25 వేలు లబ్ధిదారుల వాటా అయితే, 75 వేలు సబ్సిడీతో లక్ష రుణం మంజూరు చేస్తామన్నారు. ఈ పథకం కింద లక్ష మందికి రుణాలు అందజేస్తామన్నారు. మరో పథకం కింద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని, ఈ పథకంలో 50 శాతం, 60 శాతం సబ్సిడీ ఉంటుందని ఈటల వివరించారు. జూలై నుంచి డిసెంబర్ వరకు అర్హులను గుర్తించి రుణాలు అందిస్తామన్నారు. -
ఇబ్బందుల్లేకుండా జీఎస్టీ అమలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు వల్ల క్షేత్రస్థాయిలో వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపై ఏర్పాటైన వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఉప సంఘ సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ వల్ల ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశానికి దేశంలో ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్లను, ఫిక్కీ, సీఐఐ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలిపారు. వారిచ్చిన సలహాలను వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుంచి.. ఆమోదించి జీఎస్టీ అమలును సరళతరం చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు, ట్రేడర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పన్ను ఎగవేతదారులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు 15వ ఫైనాన్స్ కమిషన్ చేయూత ఇవ్వాలే తప్పా.. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్డీపీలో 25 శాతం ఎఫ్ఆర్బీఎం రుణం పొందే అవకాశాన్ని 20 శాతానికి తగ్గించే ప్రయత్నాలకు తాము వ్యతిరేకమని చెప్పారు. క్షేత్రస్థాయిలో నగదు కొరత.. రాష్ట్రంలో నగదు కొరతపై ఈటల స్పందిస్తూ.. తెలంగాణకు గతంలో కంటే ఎక్కువ డబ్బు సరఫరా చేసినట్టు కేంద్రం లెక్కలు చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో కొరత ఉందన్నారు. ‘దేశంలో ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా బ్యాంకు మోసాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం సరికాదన్న ఆలోచనా ధోరణిలో ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయానికి నిధుల కొరత ఉండదని ఆశిస్తున్నాం. ఈ పథకం అమలు చేస్తున్నాం కాబట్టి రూ.6 వేల కోట్ల నగదు సరఫరా చేయాలని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు’అని అన్నారు. -
బీసీలకు రాజ్యాధికారంలోనూ వాటా
హైదరాబాద్: బీసీలకు బర్రెలు, గొర్రెలే కాదు, రాజ్యాధికారంలోనూ వాటా ఇచ్చామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీ కులాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిత్యం పాటుపడుతోందని అన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీసీ నేతలు బండ ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్‌కు ఆదివారం ఇక్కడ జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఈటల మాట్లాడారు. కుల వృత్తులను, వాటిని నమ్ముకున్న వారికి బ్రతుకునిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాడిగేదెలు, గొర్రెలు, చేపలు ఇస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారని, కానీ రాజ్యాధికారంలోనూ వాటా కల్పించాలని మూడు రాజ్యసభ సీట్లలో రెండింటిని బీసీలకు ఇచ్చామని అన్నారు. బీసీల్లోని అన్ని కులాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బీసీలను పెద్దలసభకు పంపాం.. అన్ని పార్టీలు బీసీలతో జెండాలను మోయించుకుంటూ వాడుకుంటుండగా టీఆర్ఎస్ మాత్రం పెద్దలసభకు పంపిందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుతామని, కేసీఆర్ ఢిల్లీలో ఒకరోజు ధర్నా చేయనున్నారని చెప్పారు. బీసీలుగా ఉండటం వల్లే పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశం తమకు వచ్చిందని బండ ప్రకాశ్, లింగయ్య యాదవ్ అన్నారు. బీసీల హక్కుల కోసం పార్లమెంటులో గళం వినిపిస్తామని పేర్కొన్నారు. బీసీలకు మేలు చేసినవారిని గుండెల్లో పదిలపరుచుకుంటామని, అన్యాయం చేస్తే తిరగబడుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు. -
ప్రాధాన్యతలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాలను సమతుల్యం చేసుకుంటూనే ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట వేసేలా 2018–19 బడ్జెట్ అంచనాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడేలా బడ్జెట్ పూర్తి సమతుల్యంతో ఉందన్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు నడుమ సమన్వయాన్ని బడ్జెట్ కూర్పు సాధించిందన్నారు. వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం సంతోషకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతుకు పెట్టుబడి మద్దతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు అధిక నిధులు సమకూర్చడం ద్వారా తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి బడ్జెట్ అవకాశం కల్పించిందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలు మరింత విజయవంతంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలు పరిచేందుకు వార్షిక ఆర్థిక ప్రణాళికను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులను సీఎం అభినందించారు. -
అదే జట్టు.. ఐదో బడ్జెట్టు
సాక్షి, హైదరాబాద్: వరుసగా అయిదోసారి రాష్ట్ర బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు కీలక భూమిక నిర్వర్తించారు. తొలి రెండేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శి (ఐఎఫ్) హోదాలో బడ్జెట్ రూపకల్పన చేసిన రామకృష్ణారావు రెండేళ్లుగా అదే శాఖలో ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి పొందారు. బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖతోపాటు కీలక పాత్ర పోషించే ప్రణాళిక శాఖకు సైతం ఆయనే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్ తయారీలో రామకృష్ణారావు రేయింబవళ్లు శ్రమించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంతో వరుసగా అయిదు బడ్జెట్ల తయారీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించటం విశేషం. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నించటంతో పాటు ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలను సమపాళ్లలో పొందుపరిచేందుకు భారీగా కసరత్తు చేయాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సలహాదారులు జీఆర్ రెడ్డి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి బడ్జెట్‌తో పాటు సామాజిక ఆర్థిక సర్వేను తయారు చేయటంలో ప్రధాన భూమిక నిర్వహించారు. బడ్జెట్ తయారీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక సమయం వెచ్చించటంతో పాటు ప్రతి పద్దును స్వయంగా పరిశీలించారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్ని శాఖలతో బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించటంతో పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ నుంచి ఇదే జట్టు వరుసగా బడ్జెట్ రూపకల్పన కసరత్తును నిర్వహించటం విశేషం. ఉపాధి కల్పన, కార్మికశాఖకు తక్కువే.. కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు కేటాయింపులు భారీగా తగ్గాయి. గతేడాది ఈ శాఖకు రూ. 625.58 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 596.32 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 332.40 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 263.92 కోట్లు కేటాయించింది. ఈ శాఖ ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డుల పునరుద్ధరణతో పాటు ఐటీఐ ప్రవేశాలు తదితరాల్లో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా పలు ఐటీఐలను కార్పొరేట్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఉద్యోగావకాశాల కల్పనను వేగవంతం చేసింది. స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో కేటాయింపులు తగ్గడంతో ఆ శాఖ కార్యక్రమాలపై ప్రభావం పడనుంది. మహిళా, శిశు సంక్షేమానికి దక్కని ప్రాధాన్యత మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో ప్రాధాన్యత అంతంత మాత్రంగానే దక్కింది. గతేడాది రూ. 1,731.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ. 1,798.82 కోట్లు ఇచ్చింది. కొత్త పథకాలు లేనప్పటికీ ప్రగతి పద్దు భారీగా పెరిగినా ఈ శాఖకు ప్రాధాన్యత దక్కలేదు. తాజా బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ. 859.43 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 939.39 కోట్ల చొప్పున ఇచ్చింది. ఈసారి బడ్జెట్లో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థకు రూ. 70.14కోట్లు కేటాయించింది. గతేడాది రూ.6 కోట్లు మాత్రమే ఇవ్వగా ఈసారి భారీగా పెంచడంతో మహిళలకు ఆర్థిక చేయూత కార్యక్రమాలకు ఊతమిచ్చినట్లయింది. పౌష్టికాహార పథకాలకు రూ. 240.95 కోట్లు, సబల కార్యక్రమానికి రూ. 34.68 కోట్లు, ఆరోగ్యలక్ష్మికి రూ. 153.79 కోట్లు కేటాయించింది. -
ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీలలో బ్యాంకు గ్యారంటీలను మంత్రి హరీశ్‌రావు సడలించారు. టర్నోవర్‌ను బట్టి బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలన్న నిబంధనలపై ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల అభ్యంతరాలకు మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల యజమానుల సంఘాల ప్రతినిధులతో ఆయన చర్చించారు. రూ.కోటి టర్నోవర్ మేరకు లావాదేవీలు జరిపే ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు రూ.50 వేల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, రూ. కోటికి పైగా టర్నోవర్ ఉంటే రూ.లక్ష, రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.2 లక్షలు బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని మంత్రి మినహాయింపులు ఇచ్చారు. అయితే బ్యాంకు గ్యారంటీ జీవోకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని కోరగా.. అందుకు ట్రేడర్లు, ఏజెంట్లు అంగీకరించారు. అధిక కమీషన్లు వసూలు చేస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని వ్యవసాయ మార్కెట్లలో ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నిర్ధారించిన కమీషన్ కన్నా ఎక్కువ వసూలు చేస్తూ పీడిస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని చోట్ల గుమస్తా మామూలు పేరిట కూడా వసూళ్లు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ ధోరణికి స్వస్తి చెప్పాలని మంత్రి కోరారు. మంత్రి ఈటల రాజేందర్‌పై కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలు తనకు బాధ కలిగించాయని అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టలేకపోయారని రైస్ మిల్లర్లను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తమకు మంచి రోజులు వచ్చాయని రైస్ మిల్లర్ల సంఘం నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే త్వరలోనే దాదాపు లక్ష మందితో ఒక భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై తాను సీఎంతో మాట్లాడతానని, హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని హరీశ్‌రావు కోరారు. రూ.వెయ్యి కోట్లతో కందుల కొనుగోలు... కంది రైతుల బకాయిల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్ సంస్థలను హరీశ్‌రావు ఆదేశించారు. కందులు, మినుములు, శనగలు, ఎర్రజొన్నల కొనుగోళ్లు, చెల్లింపులపై మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు సమీక్షించారు. రాష్ట్రంలో 2.58 లక్షల మెట్రిక్ టన్నుల కందులను ప్రభుత్వం సేకరించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో కేంద్రం ఇచ్చిన పరిమితి 75,300 టన్నులన్నారు. 1.83 లక్షల టన్నుల కందులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.600 కోట్లు చెల్లించామని, మరో రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్, హాకా తదితర ఏజెన్సీల పనితీరుపై హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
రైతు కానుకగా భారీ పద్దు!
-
రైతు కానుకగా భారీ పద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఐదో భారీ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ అదే పంథాను అనుసరించనుంది. సుమారు రూ.1.81 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. నేడు ఉదయం 11 గంటలకు.. బడ్జెట్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రివర్గం.. 2018–19 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆయన వరుసగా ఐదో బడ్జెట్ పెట్టనుండడం గమనార్హం. ఇక శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెడతారు. గతేడాది ప్రభుత్వం రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ప్రగతి పద్దుకు రూ.88,038 కోట్లు, నిర్వహణ పద్దుకు రూ.61,607 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయానికి పెద్దపీట నాలుగేళ్లలో రైతుల రుణమాఫీకి రూ.17 వేల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతుల కోసం భారీ వ్యయంతో కూడిన పథకా న్ని ఆవిష్కరిస్తోంది. దేశంలోనే వినూత్నంగా రైతులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేయనుంది. ఏటా రెండు పంట సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రైతులక్ష్మి పేరిట అమలు చేయనున్న ఈ పథకానికి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించనుంది. దీంతోపాటు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించే పథకాన్ని అమలు చేయనుంది. దీనికి రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75 వేల నుంచి రూ.1,00,116కు పెంచనుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఈ ఏడాది రూ.5,400 కోట్ల సబ్సిడీ చెల్లించనుంది. నిరుటి అంచనాలకు ఇంకా దూరమే! ఆదాయ వృద్ధి గణనీయంగా పెరిగినా.. గత బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం ఇప్పటికీ అందుకోలేకపోయింది. జీఎస్టీ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడి రూ.1.20 లక్షల కోట్లకు మించే అవకాశం లేదు. ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన నివేదికల ప్రకారం జనవరి నెలాఖరు వరకు తొలి పది నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ.66,116 కోట్లు వచ్చింది. ఇక కేంద్రం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచడంతో అదనపు అప్పు సమకూరింది. బడ్జెట్‌తోపాటు రెండు బిల్లులు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రెండు బిల్లులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర డీజీపీ నియామక అధికారం రాష్ట్రం చేతుల్లోనే ఉండేలా రూపొందించిన ‘హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్సెస్ యాక్ట్–2018’బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇక వైద్యవిద్యలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధనను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లును కూడా ఆమోదించింది. వీటితోపాటు నీటి పారుదల శాఖలో భారీ కార్పొరేషన్ ఏర్పాటు, సాయి సింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల స్థలం కేటాయింపు, విదేశీ భవన్‌కు రెండు ఎకరాలు, రాచకొండ కమిషనరేట్‌కు 56 ఎకరాల స్థలం కేటాయింపులు, ఛనాకా–కొరట ప్రాజెక్టు పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను చేర్చే అంశాలపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త పంచాయతీరాజ్ బిల్లుపై కేబినెట్ చర్చించినా.. ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టాలా.. వేచి చూడాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ అనంతర పరిణామాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ‘సాగు నీటి’కి రుణాలే..! సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో రూ.20 వేల కోట్ల మేర కేటాయించే అవకాశాలున్నాయి. కాళేశ్వరం, పాలమూరు కార్పొరేషన్ల ద్వారా రుణాలను సమీక రించనున్నారు. వివిధ సందర్భాల్లో సీఎం ప్రకటించిన కొత్త వరాలన్నింటికీ తాజా బడ్జెట్లో చోటు కల్పించనున్నారు. వైద్యారోగ్య రంగానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించే అవకాశాలు న్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు రూ.12 వేల చొప్పున ప్రోత్సాహకం, కేసీఆర్ కిట్ పంపిణీ పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులను సమీకరించనున్నారు. వీటికి బడ్జెటేతర కోటా లో రుణాలు సమీకరించనున్నారు. ఇక సబ్సిడీపై గొర్రెలు, బర్రెలు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూతనిచ్చేందుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తారు. ప్రగతిపద్దులో 15 శాతం తగ్గకుండా ఎస్సీ అభివృద్ధి నిధి, 9 శాతం తగ్గకుండా ఎస్టీల అభివృద్ధికి ని«ధులు కేటాయించనున్నట్లు తెలిసింది. -
ప్రజల్లోకి వెళ్లాలి
► వచ్చే నెల మొదటివారంలో గ్రామగ్రామాన పర్యటన ► ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ► మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట(హుజూరాబాద్): వచ్చే నెల మొదటి వారంలో ప్రజాపథం మాదిరిగా నూతన పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు శ్రీకారం చుడుతున్నట్లు ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో నిర్వహించిన ప్రజాపథంతో తనకు జనంలో ఎంతగానో పేరొచ్చిందని గుర్తు చేశారు. పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో సోమవారం నిర్వహించిన హూజూరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ద్వారానే ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చిన్న పనులు చేసి గొప్పగా ప్రచారం చేసుకునేవని..టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప పనులు చేస్తున్నప్పటికీ కార్యకర్తలు తగురీతిలో ప్రచారం చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో కార్యకర్తలు, నాయకలు గ్రామగ్రామాన పర్యటనలతో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. జమ్మికుంట, హూజూరాబాద్, వీణవంక, కమాలాపూర్ మండలాలకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, నగర పంచాయతీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డుమెంబర్లు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్తా చాటుకోవాలి వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు జనాన్ని వేలాదిగా తరలించి నియోజకవర్గ సత్తా చాటుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ కార్యకర్తలు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు సూచించారు. వరంగల్ సభకు నియోజకవర్గం నుంచి 50 వేల మందిని తరలించాలన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపుల్లో, పురుషులు ట్రాక్టర్లు, డీసీఎం, లారీలు, ఆటోల్లో తరలిరావాలని కోరారు. ఎర్రగుట్ట వద్ద జనాన్ని కలుస్తానన్నారు. అనంతరం గ్రామాలవారీగా ఎవరెవరు ఎలా జనాన్ని తరలిస్తారు?ఎంతమందిని తీసుకొస్తారనేది తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ట్రాక్టర్లలో ర్యాలీగా తరలిరావాలన్నారు.