రైతు కానుకగా భారీ పద్దు! | 2018-19 budget with an estimated Rs 1.81 lakh crore | Sakshi
Sakshi News home page

రైతు కానుకగా భారీ పద్దు!

Published Thu, Mar 15 2018 3:37 AM | Last Updated on Thu, Mar 15 2018 8:16 AM

2018-19 budget with an estimated Rs 1.81 lakh crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఐదో భారీ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ అదే పంథాను అనుసరించనుంది. సుమారు రూ.1.81 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. 

నేడు ఉదయం 11 గంటలకు.. 
బడ్జెట్‌ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రివర్గం.. 2018–19 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆయన వరుసగా ఐదో బడ్జెట్‌ పెట్టనుండడం గమనార్హం. ఇక శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. గతేడాది ప్రభుత్వం రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. అందులో ప్రగతి పద్దుకు రూ.88,038 కోట్లు, నిర్వహణ పద్దుకు రూ.61,607 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

పెట్టుబడి సాయానికి పెద్దపీట 
నాలుగేళ్లలో రైతుల రుణమాఫీకి రూ.17 వేల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతుల కోసం భారీ వ్యయంతో కూడిన పథకా న్ని ఆవిష్కరిస్తోంది. దేశంలోనే వినూత్నంగా రైతులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేయనుంది. ఏటా రెండు పంట సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రైతులక్ష్మి పేరిట అమలు చేయనున్న ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించనుంది. దీంతోపాటు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించే పథకాన్ని అమలు చేయనుంది. దీనికి రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75 వేల నుంచి రూ.1,00,116కు పెంచనుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం ఈ ఏడాది రూ.5,400 కోట్ల సబ్సిడీ చెల్లించనుంది. 

నిరుటి అంచనాలకు ఇంకా దూరమే! 
ఆదాయ వృద్ధి గణనీయంగా పెరిగినా.. గత బడ్జెట్‌ అంచనాలను ప్రభుత్వం ఇప్పటికీ అందుకోలేకపోయింది. జీఎస్టీ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడి రూ.1.20 లక్షల కోట్లకు మించే అవకాశం లేదు. ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన నివేదికల ప్రకారం జనవరి నెలాఖరు వరకు తొలి పది నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ.66,116 కోట్లు వచ్చింది. ఇక కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచడంతో అదనపు అప్పు సమకూరింది. 

బడ్జెట్‌తోపాటు రెండు బిల్లులు 
ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రెండు బిల్లులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర డీజీపీ నియామక అధికారం రాష్ట్రం చేతుల్లోనే ఉండేలా రూపొందించిన ‘హెడ్‌ ఆఫ్‌ ది పోలీస్‌ ఫోర్సెస్‌ యాక్ట్‌–2018’బిల్లుకు కేబినెట్‌ ఓకే చెప్పింది. ఇక వైద్యవిద్యలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధనను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లును కూడా ఆమోదించింది. వీటితోపాటు నీటి పారుదల శాఖలో భారీ కార్పొరేషన్‌ ఏర్పాటు, సాయి సింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల స్థలం కేటాయింపు, విదేశీ భవన్‌కు రెండు ఎకరాలు, రాచకొండ కమిషనరేట్‌కు 56 ఎకరాల స్థలం కేటాయింపులు, ఛనాకా–కొరట ప్రాజెక్టు పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్‌ స్కీమ్‌ను చేర్చే అంశాలపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త పంచాయతీరాజ్‌ బిల్లుపై కేబినెట్‌ చర్చించినా.. ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టాలా.. వేచి చూడాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బహిష్కరణ అనంతర పరిణామాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది.  

‘సాగు నీటి’కి రుణాలే..!
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల మేర కేటాయించే అవకాశాలున్నాయి. కాళేశ్వరం, పాలమూరు కార్పొరేషన్ల ద్వారా రుణాలను సమీక రించనున్నారు. వివిధ సందర్భాల్లో సీఎం ప్రకటించిన కొత్త వరాలన్నింటికీ తాజా బడ్జెట్‌లో చోటు కల్పించనున్నారు. వైద్యారోగ్య రంగానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించే అవకాశాలు న్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు రూ.12 వేల చొప్పున ప్రోత్సాహకం, కేసీఆర్‌ కిట్‌ పంపిణీ పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులను సమీకరించనున్నారు. వీటికి బడ్జెటేతర కోటా లో రుణాలు సమీకరించనున్నారు. ఇక సబ్సిడీపై గొర్రెలు, బర్రెలు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూతనిచ్చేందుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తారు. ప్రగతిపద్దులో 15 శాతం తగ్గకుండా ఎస్సీ అభివృద్ధి నిధి, 9 శాతం తగ్గకుండా ఎస్టీల అభివృద్ధికి ని«ధులు కేటాయించనున్నట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement