ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లకు ఊరట | Excluded Minister Harish on bank guarantees | Sakshi
Sakshi News home page

ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లకు ఊరట

Published Fri, Mar 16 2018 12:55 AM | Last Updated on Fri, Mar 16 2018 12:55 AM

Excluded Minister Harish on bank guarantees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో బ్యాంకు గ్యారంటీలను మంత్రి హరీశ్‌రావు సడలించారు. టర్నోవర్‌ను బట్టి బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలన్న నిబంధనలపై ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్ల అభ్యంతరాలకు మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో జిన్నింగ్‌ మిల్లులు, రైస్‌ మిల్లుల యజమానుల సంఘాల ప్రతినిధులతో ఆయన చర్చించారు. రూ.కోటి టర్నోవర్‌ మేరకు లావాదేవీలు జరిపే ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లు రూ.50 వేల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, రూ. కోటికి పైగా టర్నోవర్‌ ఉంటే రూ.లక్ష, రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉంటే రూ.2 లక్షలు బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని మంత్రి మినహాయింపులు ఇచ్చారు. అయితే బ్యాంకు గ్యారంటీ జీవోకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని కోరగా.. అందుకు ట్రేడర్లు, ఏజెంట్లు అంగీకరించారు. 

అధిక కమీషన్లు వసూలు చేస్తే చర్యలు 
నిబంధనలకు విరుద్ధంగా కొన్ని వ్యవసాయ మార్కెట్లలో ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లు రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నిర్ధారించిన కమీషన్‌ కన్నా ఎక్కువ వసూలు చేస్తూ పీడిస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని చోట్ల గుమస్తా మామూలు పేరిట కూడా వసూళ్లు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ ధోరణికి స్వస్తి చెప్పాలని మంత్రి కోరారు. మంత్రి ఈటల రాజేందర్‌పై కొందరు కాంగ్రెస్‌ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలు తనకు బాధ కలిగించాయని అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టలేకపోయారని రైస్‌ మిల్లర్లను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తమకు మంచి రోజులు వచ్చాయని రైస్‌ మిల్లర్ల సంఘం నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే త్వరలోనే దాదాపు లక్ష మందితో ఒక భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై తాను సీఎంతో మాట్లాడతానని, హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని హరీశ్‌రావు కోరారు. 

రూ.వెయ్యి కోట్లతో కందుల కొనుగోలు... 
కంది రైతుల బకాయిల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్‌ సంస్థలను హరీశ్‌రావు ఆదేశించారు. కందులు, మినుములు, శనగలు, ఎర్రజొన్నల కొనుగోళ్లు, చెల్లింపులపై మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు సమీక్షించారు. రాష్ట్రంలో 2.58 లక్షల మెట్రిక్‌ టన్నుల కందులను ప్రభుత్వం సేకరించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో కేంద్రం ఇచ్చిన పరిమితి 75,300 టన్నులన్నారు. 1.83 లక్షల టన్నుల కందులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.600 కోట్లు చెల్లించామని, మరో రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్, హాకా తదితర ఏజెన్సీల పనితీరుపై హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement