
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రైతుబంధు’తరహాలో ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసిందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రెండ్రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అన్ని నగరాలు, పట్టణాల్లో బ్యాంకర్లతో సంబంధం లేకుండా పేదలకు నేరుగా చెక్కుల రూపేణా రుణాలు అందిస్తామన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలో లబ్ధిచేకూరేలా ఈ పథకానికి రూపకల్పన చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఒకసారి లబ్ధిపొందిన వారు ఐదేళ్ల వరకు అనర్హులని, ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం ఉందని తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జేసీ, డీఆర్‌డీఏ, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఉండే కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేస్తారన్నారు.లబ్ధిదారుల వాటా ఉండే రుణం మంజూరు కూడా ఉందన్నారు. రూ.లక్ష రుణం మంజూరుకు రూ.25 వేలు లబ్ధిదారుల వాటా అయితే, 75 వేలు సబ్సిడీతో లక్ష రుణం మంజూరు చేస్తామన్నారు.
ఈ పథకం కింద లక్ష మందికి రుణాలు అందజేస్తామన్నారు. మరో పథకం కింద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని, ఈ పథకంలో 50 శాతం, 60 శాతం సబ్సిడీ ఉంటుందని ఈటల వివరించారు. జూలై నుంచి డిసెంబర్ వరకు అర్హులను గుర్తించి రుణాలు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment