కొల్లేరుపై ఏకగ్రీవ తీర్మానం
కాంటూర్ స్థాయిని 3కు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ
ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
వైఎస్ హయాంలో 2008లోనూ ఇలాంటి తీర్మానమే చేసిన సభ
మళ్లీ కొత్తగా చేసినట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించిన జగన్
హైదరాబాద్: కొల్లేరు కాంటూర్ స్థాయిని +5 మీటర్ల నుంచి +3 మీట ర్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తిచే స్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీ వంగా తీర్మానం చేసింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించినట్లు స్పీకర్ కె. శివప్రసాదరావు ప్రకటిస్తున్న తరుణం లో వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొల్లేరు కాంటూరు స్థాయి తగ్గించాలనే తీర్మానానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, అయితే ఏకగీవ్ర తీర్మానం చేసే ముందు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం సంప్రదాయన్నారు. దానికి స్పీకర్ అంగీకరించారు. ‘2008లోనే కాంటూ రుస్థాయి తగ్గించాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిం దని, ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం ఏముంది. గతంలో చేసిన తీర్మానంపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కాంటూరుస్థాయి తగ్గించే ప్రయత్నాలు చేస్తే సమయం కలిసొస్తుంది’ అని సూచించారు. కొల్లేరు రైతులకు వైఎస్ అన్యాయం చేశారన్న అధికార పక్ష సభ్యుల విమర్శలకు ప్రతిపక్ష నేత జగన్ సమాధానమిచ్చారు.
కొల్లేరు ప్రజల ఇబ్బంది చూసే నాడు వైఎస్ తీర్మానం చేశారు
‘‘చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో చక్కగా కట్టుకథలు చెప్పిస్తున్నారు. తొమ్మి దేళ్లు సీఎంగా ఉన్న బాబు.. తన హయాంలో కాంటూరు స్థాయిని తగ్గించే తీర్మానం ఎందుకు చేయలేదు? వైఎస్ సీఎం అయిన తర్వాతే తీర్మానం ఎందుకు చేశారు? వైఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా, కొత్తగా తానే చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. బాంబులతో చేపల చెరువులను పేల్చారని చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, స్పందించాలి కాబట్టి అప్పటి ప్రభుత్వం స్పందించింది. తీర్పును అమలు చేసిన తర్వాత.. కొల్లేరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన వైఎస్ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాం టూరు స్థాయిని 3కు తగ్గించడానికి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. తీర్మానం చేసిన ఆరు నెలల్లో దురదృష్టవశాత్తూ మహానేత వైఎస్ చనిపోయారు. కేంద్రంపై ఒత్తిడితెచ్చి కాంటూరు స్థాయిని తగ్గించేలా పనిచేయించుకుందాం. కలిసిరావడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత పేర్కొన్నారు.
ఇప్పటికే పడిన అడుగుల్లో ముందుకు సాగుదాం..
విపక్ష నేత వివరణ ఇచ్చిన తర్వాతా అధికార పక్ష సభ్యుల విమర్శలు ఆగలేదు. మళ్లీ జగన్ జోక్యం చేసుకొని ‘కొల్లేరు కాంటూరు స్థాయిని తగ్గించాలనే ప్రతిపాదనపై అధ్యయనం చేసిన సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నితాలజీ అండ్ నేచురల్ హిస్టరీ డెరైక్టర్ పి.ఎ.అజీజ్ నేతృత్వంలో అధ్యయన కమిటీ నివేదిక కూడా సమర్పించింది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడిన నేపథ్యంలో.. అక్కడ నుంచి మొదలుపెడితే కేంద్రం త్వరగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. లేదంటే.. శాసనసభలో తీర్మానం చేశామని, కేంద్రం చేయలేదని అంటూ నెపాన్ని నరేంద్ర మోదీ మీదకు నెట్టేసి ఐదేళ్లూ కాలం గడిపేసే ప్రమాదం ఉంది’’ అని అన్నారు. అనంతరం తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.