‘ఏపీ సాఫ్ట్వేర్ కంపెనీలకు సత్తా లేదు’
► అందుకే రాష్ట్రేతర కంపెనీలకు ప్రోత్సాహం
►రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి
విశాఖపట్నం: రాష్ట్రంలోని సాప్ట్వేర్ కంపెనీలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేకపోవడంతోనే సాప్ట్వేర్ సర్వీసులన్నీ రాష్ట్రేతర కంపెనీలకే ఇవ్వాల్సి వస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి అన్నారు. పెద్ద ప్రాజెక్టులు ఏది ఇచ్చినా చేయగలమని నిరూపించుకోవాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాప్ట్వేర్ సర్వీసులు ఇక్కడివారికి ఇస్తామని చెప్పారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పారిశ్రామిక వేత్తలతో స్థానిక నోవొటెల్ హోటల్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు.
సదస్సులో సీఐఐ విశాఖ చాప్టర్ చైర్మన్ తిరుపతిరాజు మాట్లాడుతూ.. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను రాష్ట్రంలో పెట్టడంతో రైతులతో పాటు గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించినట్లవుతుందని సూచించారు. ఎస్ఎంఎస్ఈలకు 20 శాతం సబ్సిడీ అందజేయాలని మాజీ చైర్మన్ శివకుమార్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శ్రీ సిటీ విషయంలో మరిన్ని రాయితీలు ఇవ్వాలని కోరారు.
స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఖాయిలా పడ్డ పరిశ్రమలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. లాజస్టిక్ పార్కుకు అనుమతులు ఇవ్వాలని, రోడ్డు కనెక్టవిటీ, టోల్ గేట్ల సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం నక్కపల్లి, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లలోని పరిశ్రమలను మంత్రి పరిశీలించారు. సుగర్ఫ్యాక్టరీల భవితవ్యంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రతిపక్షాలు కోరితే సమావేశాలకు అనుమతులిస్తాం....
ఏయూ మైదానంలో సమావేశాలు నిర్వహించేందుకు ప్రతిపక్షాలు కోరితే అప్పటి వర్సిటీ అకాడమిక్ పరిస్థితులు, నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అమర్నాథ్రెడ్డి చెప్పారు. విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడు పనుల్ని ఆయన గురువారం పరిశీలించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా నగరానికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణతో పాటు పార్టీ నేతలు గద్దె బాబురావు, రెహ్మాన్‌లు ఆయనను సత్కరించారు.