Minister for palle Raghunatha Reddy
-
మంత్రి పల్లె ఓ నియంత : మున్సిపల్ చైర్మన్
► పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గంగన్న ధ్వజం పుట్టపర్తి టౌన్: మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్ పీసీ గంగన్న ధ్వజమెత్తారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మంత్రిపై మండిపడ్డారు. మంత్రి పల్లె ప్రొటోకాల్‌కు ఏ మాత్రం విలువ ఇవ్వడంలేదన్నారు. ఆదివారం పట్టణంలో మున్సిపాలిటీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రహదారుల భూమి పూజకు ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో తాను ఎదగకుండా అడుగడుగునా మంత్రి అడ్డుపడుతున్నారని, ప్రతి వార్డులో రెండు మూడు గ్రూపులుగా విభజించి అనుకూలమైన వారి ద్వారా పనులకు బిల్లులు కాకుండా లోకాయుక్తకు ఫిర్యాదు చేయిస్తున్నారని, బిల్లులు చెల్లించకుండా అధికారులను సస్పెండ్ చేయిస్తానని మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రూ.60 లక్షలు ఖర్చు చేసి మున్సిపాలిటీలో పార్టీని గెలిపించానని మంత్రి ప్రచారం చేస్తున్నారని, నిజంగా ఆయన ఒక్కో కౌన్సిలర్‌కు లక్ష రూపాయల చొప్పున 16 మందికి మాత్రమే ఇచ్చారని, బీసీ సామాజిక వర్గంతోపాటు తన కృషి మూలంగానే టీడీపీ గెలిచిందన్నారు. మంత్రి వ్యవహార శైలిపై త్వరలోనే సీఎం చంద్రబాబును కలసి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీరాంనాయక్, పార్టీ నాయకులు రాజప్ప, గంగాద్రి, పోతన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
ప్రెస్‌అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అనంతపురం సెంట్రల్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అన్నారు. నవ్యాంధ్రలో తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. బుధవారం డ్వామా హాలులో మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు ఉన్నత విలువలు అలవర్చుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్రిడిటేషన్ జర్నలిస్టులకు రూ. 2.50 లక్షల వరకూ ఉచిత వైద్యం సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పింఛన్ అందించేందుకు కమిటీ వేస్తున్నామని తెలిపారు. చంద్రన్న బీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తామన్నారు. -
చిట్టితల్లి లేదిక..
అనంతపురం క్రైం : మొన్నటి వరకు తల్లి ఒడిలో హాయిగా నిద్రించింది.. తండ్రి భుజాలపై కూర్చుని సంతోషంగా గడిపింది. చుట్టుపక్కల చిట్టిపొట్టి చిన్నారులతో కలిసి అల్లరి చేసింది. అలాంటి చైత్ర ఆడుకుంటూ వెళ్లి కన్పించకుండాపోయింది. చిట్టితల్లి కోసం రెండ్రోజుల పాటు ఆ తల్లిదండ్రులు వెతకని ప్రాంతమంటూ లేదు. కన్పించిన వారినంతా ‘మా లవ్లీ కన్పించిందా’ అంటూ అడిగారు. ఎవరూ జాడచెప్పలేకపోయారు. మంగళవారం ఉదయాన్నే గుండెలు పిండేసే విషాదం.. కన్పించకుండా పోయిన చైత్ర మురుగు కాలువలో మృతదేహంగా కన్పించడం చూసి తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ఖాజానగర్‌కు చెందిన సీహెచ్ శ్యాంసుందర్, సరళ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. శ్యాంసుందర్ ‘హీరో’ షోరూంలో పని చేస్తున్నారు. చిన్న కుమార్తె చైత్ర అలియాస్ లవ్ లీ (2) ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ కన్పించకుండాపోయింది. పాప కోసం తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో.. కాలనీలో వెతికినా ఫలితం లేకపోయింది. రెండ్రోజులైనా పాప జాడలేకపోయింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు మంగళవారం ఉదయం ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో వెతికారు. కొద్ది సేపటి తర్వాత చైత్ర వేసుకున్న డ్రస్సు కన్పించడంతో దగ్గరికెళ్లి చూశారు. చిన్నారి వృతదేహం కన్పించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్నటి వరకు వచ్చీరాని మాటలతో ఇంటిల్లిపాదినీ అలరించిన చిట్టితల్లి కానరాని లోకాలకు వెళ్లిందని తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపించారు. వృతి చెంది రెండ్రోజులు కావస్తుండడంతో పాప శరీరమంతా ఉబ్బిపోయింది. సమాచారం అందుకున్న మేయర్ మదమంచి స్వరూప, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, టీడీపీ నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డి, గోవిందరెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి తల్లిని ఓదార్చారు. వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలువను శుభ్రం చేసే నాథులే లేరు.. నగరమంతా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రజాప్రతినిధులు అవకాశం వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చైత్రను మింగేసిన మురుగు కాలువను చూస్తే ఏ మేరకు నగర అభివృద్ధి జరుగుతోందో అర్థమవుతుంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాసం, విద్యా సంస్థల మధ్యనే ఈ కాలువ ఉంది. అయినా దీన్ని శుభ్రం చేయించే నాథుడే కరువయ్యారు. ఇదే విషయంపై మేయర్, కమిషనరును మంగళవారం స్థానికులు నిలదీశారు. ‘మీఇళ్ల వద్ద ఇలాగే ఉంటే భరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. అరగంట పాటు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది పడతారని, అలాంటిది తాము 24 గంటలూ ఎలా కాపురం చేస్తున్నామో ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మురుగు కాలువను శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు.