జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
ప్రెస్‌అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అన్నారు. నవ్యాంధ్రలో తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. బుధవారం డ్వామా హాలులో మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు ఉన్నత విలువలు అలవర్చుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్రిడిటేషన్ జర్నలిస్టులకు రూ. 2.50 లక్షల వరకూ ఉచిత వైద్యం సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పింఛన్ అందించేందుకు కమిటీ వేస్తున్నామని తెలిపారు. చంద్రన్న బీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తామన్నారు.