Minister for Transport
-
సబ్ స్టేషన్లకు రూ.110 కోట్లు
♦ ఇకపై లో ఓల్టేజీ సమస్య పూర్తిగా తీరుతుంది ♦ ఇప్పటికే రైతులకు 9గంటలు విద్యుత్ ఇస్తున్నాం ♦ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల రూరల్: జిల్లాలో 50 విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.110 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల మండలం ముడిమ్యాలలో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, రేగడిఘనాపూర్‌లో కొత్తగా నిర్మించే 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నిరంతర కరెంట్, రైతులకు 9 గంటల సరఫరాను అందిస్తున్నామని చెప్పారు. దీని వల్ల జిల్లాలోని లక్షా 10వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడిన ఎస్సీ, ఎస్టీలకు చార్జీల మాఫీ చేశామని మంత్రి చెప్పారు. జిల్లాలోని తూర్పు డివిజన్లో 9 సబ్స్టేషన్లకు రూ.22కోట్లు, ఉత్తర డివిజన్లో 14 సబ్స్టేషన్లకు రూ.53కోట్లు, పశ్చిమ డివిజన్లో రూ.17 సబ్‌స్టేషన్‌లో రూ.34 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా 37 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 8 సబ్స్టేషన్లకు గాను రూ.17 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుతో వినియోగదారులకు లో ఓల్టేజీ సమస్య ఉండదన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రజలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేస్తేనే ఆ కల నేరవేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, విద్యుత్ ఎస్ఈ శ్రీరామలు, డీఈ దుర్గారావు, ఏఈ అశోక్‌రావు, సర్పంచులు కోరే సువర్ణ, తిప్పని రాంరెడ్డి, ఎంపీసీటీ సభ్యులు బుర్ల సుమలత, శ్రీలత, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
'రూ.50 కోట్లతో వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి'
-తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి మార్కెట్లకు జాతీయస్థాయి గుర్తింపు -ధారూరు మార్కెట్ అభివృద్ధికి రూ. 2 కోట్లు -రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి ధారూరు : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు కేటాయించామని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని స్టార్ పంక్షన్‌హాలులో జరిగిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో కొత్తగా కోట్‌పల్లి, బషిరాబాద్, కులకచర్ల, మహేశ్వరం వ్యవసాయ మార్కెట్లను మంజూరు చేసినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. కొత్త మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 2 కోట్ల చొప్పున కేటాయించామని, ధారూరు మార్కెట్‌కు కూడ రూ. 2 కోట్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలోని తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 44 వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలోని 1146 చెరువులకు రూ. 385 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అలాగే బీజాపూర్-హైదరాబాద్ రహదారి విస్తరణ పనులకు రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మంజూరు అవుతేన్నాయని అన్నారు. అలాగే తాండూర్-వికారాబాద్ వయా ధారూరు మీదుగా ఉన్న డబుల్ లైన్ రోడ్డును ఫ ఓర్‌లైన్స్ రోడ్డుగా మార్చడానికి రూ. 40 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుగా చేసి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ధారూరు మండలానికి ఎస్సీ, ఎస్టీలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేయిస్తామని మంత్రి హామి ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అంశం తన పరిధిలో లేదని డిప్యూటి సీఎంను కలసి కళాశాల మంజూరు కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
♦ కొత్వాల్‌గూడలో ‘మన తెలంగాణ మన వ్యవసాయం’ ♦ ప్రారంభంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శంషాబాద్ : రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అ న్నారు. కొత్వాల్‌గూడ గ్రామంలో ‘మన తెలంగాణ మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు విడతలుగా రైతుల రుణమాఫీని అమలుపర్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ‘మన తెలంగాన మన వ్యవసాయం’ ద్వారా రైతులకు అందించే సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకుని, అధిక పంట దిగుబడులను సాధించాలని ఆయన సూచిం చారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న పం డ్లు, పూలు మన దగ్గరే పండించుకుని, రైతులు మరింత అభివృద్ధి సాధించాలని ఆయన అభిలషించారు. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులతో రైతుల జీవితాలు మెరుగుపడే రోజులు రానున్నాయన్నారు. వ్యవసాయశాఖ అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ సూచిం చారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లకు సంబంధించిన వారు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సతీష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సురేష్‌గౌడ్, కొత్వాల్‌గూడ సర్పంచ్ గుర్రంపల్లి ప్రసన్న, ఉప సర్పంచ్ పత్తి నర్సింగ్‌రావు, శంషాబాద్ పీఏసీఎస్ చైర్మన్ కొలను మహేందర్‌రెడ్డి వ్యవసాయ అధికారులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
‘చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు’
తెలంగాణ సర్కారు చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో మిషన్ కాకతీయ కింద రూ.66 లక్షలతో మంజురైన ఊర చెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం సాగునీటి రంగఅభివృద్ధికి ఊతమిస్తోందని అన్నారు. పూడిక తీతతో చెరువులు పుష్కలంగా నిండి ఏడాదికి రెండు పంటలు పండే అవకాశం ఉందని తెలిపారు. మండలంలోని 39 చెరువులకు రూ.17కోట్లు, తాండూరు- తోర్మామిడి రోడ్డు పనులకు రూ.27 కోట్ల నిధులు, తాండూరు రింగ్ రోడ్డు సర్వేకు రూ.80 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. -
హామీలు నెరవేర్చితీరుతాం
ఇబ్రహీంపట్నం: పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని..ఇందులో రాజీపడే ప్రసక్తి లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మండల పరిధిలోని శేరిగూడలో రూ.70లక్షల వ్యయంతో నిర్మిం చిన ఉప్పరిగూడ పీఏసీఎస్ భవనాన్ని గురువారం ఆయన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలకు నెరవేర్చి తీరుతామని అన్నారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్ల రుణమాఫీని ప్రకటించిందని, లక్ష పైచి లుకు రైతులకు రుణమాఫీ పథకం వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడత రుణమాఫీ కింద రూ.253 కోట్లమేర అందజేసినట్లు చెప్పారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసేదిశగా గ్రామానికో చెరువును వినియోగంలోకి తెస్తామన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ పరపతి సంఘాలు వాణిజ్య బ్యాంక్‌లకు దీటుగా ఎదగాలని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పండ్ల తోటలు, పూల తోటల పెంపకంపై ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీఓ రాందాస్, ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ కంబాలపల్లి భరత్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పొట్టి ఐలయ్య, కర్నాటి రమేష్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ ఈర్ల వెంకట్‌రెడ్డి, ఉప్పరిగూడ సర్పంచ్ పోరెడ్డి సుమతి అర్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఫొటో లేదని రగడ... అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఫొటోను ఫ్లెక్సీలో ఎందుకు ముద్రించలేదంటూ సీఈఓ గణేశ్‌ను నిలదీశారు. అంతటితో ఆగకుండా సీఎం ఫొటో లేని ఫ్లెక్సీని తొల గించాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. తోబుట్టువు మరణించినా విధుల్లోకి.. ఉప్పరిగూడ పీఏసీఎస్ నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పీఏసీఎస్ సీఈఓ గణేశ్ తోబుట్టువు మైసమ్మ గురువారం ఉదయం మరణించింది. అంత్యక్రియలు కూడా కాలేదు. ఇదే రోజు సహకార సంఘం భవనం ప్రారంభం ఉండడంతో బాధను దిగమింగుకుని ఆయన విధులకు హాజరయ్యారు. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. -
రహదారుల అభివృద్ధికి పెద్దపీట
రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణాశాఖా మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా రహదారుల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు విడుదల చేసిందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాలో ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.802.10 కోట్లను కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, నియోజకవర్గ కేంద్రం నుంచి మండలాలను కలుపుతూ రహదారులను నిర్మించేందుకు ఈ నిధులను వ్యయం చేయనున్నట్లు చెప్పారు. ఇక నుంచి గ్రామీణ, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధితో వాహనదారులు ఇక్కట్లు తప్పనున్నాయన్నారు. దీర్ఘకాలికంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కలిపే మార్గాలకు రూ.147 కోట్లు, సింగిల్ లేన్ రోడ్లను డబుల్‌లేన్‌గా మార్చేందుకు రూ.435 కోట్లు, 13 వంతెనల నిర్మాణానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ రోడ్ల విస్తరణతో సురక్షిత ప్రయాణానికి వీలు కలుగుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ ఉషారాణి పాల్గొన్నారు. -
ముందు అద్దం లేకుండా మున్ముందుకు...!
రవాణా శాఖా మంత్రి గారూ... ఆర్టీసీకి వంద రోజుల లక్ష్యం పెట్టారు ... సమస్యలేమైనా ఉంటే సరిచేయాలని సూచించారు ... డిపో ఆవరణల్లో ఆహ్లాదం .. బస్సుల్లోనేకాదు బస్టాండుల్లో పరిశుభ్రత ... బస్సు కండిషన్ బ్రహ్మాండంగా ఉండాలని ఒకటేమిటి ఎన్నో సూక్తులు చెప్పి ఊరించారు .. ప్రయాణికులే మన దేవుళ్లంటూ హారతి పళ్లెం తిప్పి బస్సు ఛార్జీలు పెంచేసి దక్షిణ లాగేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు ... ఈ జిల్లాలోనే అందులోనూ ఒంగోలులోనే శనివారం వివిధ సమీక్షలతో బిజీబిజీగా ఉన్న మీ పక్క నుంచే చూడండి మీ శాఖను వెక్కిరిస్తూ బస్సు ఎలా దీనంగా వెళ్తుందో. ముందు అద్దం లేకుండానే పరుగులు తీస్తోంది. ఇదేదో పల్లె వెలుగు బస్సు అనుకుంటే పొరపాటే. కావలి - నెల్లూరు వైపు తిరిగే సూపర్ లగ్జరీ బస్సు. ‘ప్రయివేటీకరణ చేయం’ అంటున్న మీ మాటల్లో అంతరార్థం ఏమిటో లీలగా అర్థమవుతోంది. ఈ తరహా బస్సులు మరిన్ని తిప్పితే ప్రయాణికులే ఆర్టీసీ వద్దు ‘బాబూ’ అంటారనే కదా మీ ఉద్దేశం. ఇటు ఉద్యోగులను, అటు ప్రయాణికులను ఇలా సిద్ధం చేస్తున్నారా శిద్దా గారూ... -
ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రిదే నిర్ణయం
కొత్తగా 30 నుంచి 50 డిపోలు: మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చే అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే అతి పెద్ద రవాణా సంస్థ అయిన ఆర్టీసీ నష్టాల్లో ఉందని, విభజన తర్వాత తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు. సంస్థను పూర్తిస్థాయిలో నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. డిపోల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. చార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. పది జిల్లాల పరిధిలో 30 నుంచి 50 కొత్త డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.