ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రిదే నిర్ణయం
కొత్తగా 30 నుంచి 50 డిపోలు: మంత్రి మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చే అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే అతి పెద్ద రవాణా సంస్థ అయిన ఆర్టీసీ నష్టాల్లో ఉందని, విభజన తర్వాత తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు.
సంస్థను పూర్తిస్థాయిలో నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. డిపోల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. చార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. పది జిల్లాల పరిధిలో 30 నుంచి 50 కొత్త డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.