కడియం, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలి : ఏబీవీపీ
హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యతగా మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. శనివారం సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేసి ఎంసెట్-3ని నిర్వహిస్తామనడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. దోషులను వదిలేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యులను చేస్తూ.. విద్యా మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, కమిషనర్ రమణారావులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ వెనుక మంత్రులు, వారి బంధువుల పాత్రపై కూపీ లాగి వారికి శిక్షపడే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మట్ట రాఘవేంద్ర, దిలీప్ నాయకులు జగన్, నర్సింహ, వేణు, ఎల్లస్వామి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.