Ministry of Housing
-
‘హౌస్’ ఫుల్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆయా కాలనీల్లో అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ముందుకు సాగుతోంది. – కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాక్షి, అమరావతి: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర గృహ నిర్మాణ–పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించి.. ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ చేసిందని కొనియాడింది. ఇళ్ల స్థలాల పట్టాలన్నీ మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతోందని మెచ్చుకుంది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న బృహత్తర లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కొత్తగా ఏకంగా 17,005 జగనన్న కాలనీలను నిర్మిస్తోందని వివరించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘సరసమైన గృహాలు–ఉత్తమ పద్ధతులు’ అంశంపై అధ్యయనం చేసిన కేంద్ర గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇటీవల నివేదికను విడుదల చేసింది. దీనిని హౌసింగ్– పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన హౌసింగ్ మిషన్ డైరెక్టరేట్ ఇతర రాష్ట్రాలకు అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అనుసంధానం చేసి, లబ్ధిదారులకు ప్రయోజనాలు అందిస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో గృహాలకు ఎల్పీజీని, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన కింద విద్యుత్, జలజీవన్ మిషన్ కింద తాగునీరు, జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా నిలిచిందని వెల్లడించింది. వీటితో పాటు మహిళా సాధికారతలో భాగంగా అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం చేస్తూ.. పిల్లలను చదివించేందుకు తల్లులకు అధికారం కల్పించే పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ నివేదికలో ఇంకా ఏముందంటే.. భారీ ఉపాధి, ఆర్థిక ప్రగతికి దోహదం ► రెండు దశల్లో 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో 15 లక్షలకు పైగా (ప్రస్తుతం టిడ్కోఇళ్లతో కలిపి 21.25 లక్షలకు పైగా) ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇంత పెద్ద ఎత్తున గృహాల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం ఇస్తోంది. ► తాపీ పని, వడ్రంగి వంటి 30 వృత్తిపరమైన వర్గాలకు చెందిన వ్యక్తులకు భారీగా ఉపాధి కలుగుతుంది. ప్లంబింగ్, ఇతర తక్కువ ఆదాయ వర్గాలు, రోజువారీ వేతనాలు, అనధికారిక రంగ వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఉత్తమ విధానాలతో నిర్మాణంలో వేగం ► ఇళ్ల నిర్మాణం వేగంగా సాగడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తమ విధానాలను అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికీ సబ్సిడీ ధరలపై స్టీలు, సిమెంట్‌ను సరఫరా చేయడంతో పాటు ఇసుకను ఉచితంగా అందజేస్తోంది. ► బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేయడం ద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు ఇచ్చేలా జగనన్న కాలనీల లే–అవుట్లను రూపొందించింది. ► ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన గృహోపకరణాలను తయారీ దారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం ఉండటంతో ఏపీలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ట్రాన్స్జెండర్లకు కూడా ఇళ్లు ► చిత్తూరు నగరంలో వీధి వ్యాపారాలు చేస్తున్న 17 మంది ట్రాన్స్జెండర్లకు గృహాలను మంజూరు చేసింది. తద్వారా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందిని అధిగమించేలా చేసి.. వివక్ష నుంచి విముక్తి కలిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని సౌకర్యాలతో వారు సొంత ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ► సొంత ఇంటి రూపంలో ఆస్తి సమకూరడంతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు మరింత మెరుగైన జీవనోపాధి పొందేందుకు అవకాశం లభించింది. వీరిలో కొందరు ప్రభుత్వ సహాయంతో చిన్న చిన్న దుకాణాలు, టైలరింగ్ నిర్వహిస్తున్నారు. తాటి ఆకుల గుడిసెల్లో ఉండే వారికి పక్కా ఇళ్లు ► గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు పంచాయతీ ఎస్సీ, ఎస్టీ కాలనీలో 111 మందికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. వీరందరూ మట్టి, వెదురు కర్రలు, తాటి ఆకులతో రూపొందించిన గుడిసె తరహా ఇళ్లలో నివసించే వారు. వారికి ఇళ్లు మంజూరు చేయడంతో కొత్త ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ► ఇళ్ల నిర్మాణ పనుల కోసం స్థానిక పంచాయతీ 15 నీటి కనెక్షన్లు ఇచ్చింది. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక శాశ్వత విద్యుత్ కనెక్షన్లతో పాటు వీధి లైట్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. ► నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొలి దశలో 27,888 నివాస యూనిట్లు చేపట్టారు. ఇందులో వెంకటేశ్వరపురంలో 4,800 యూనిట్లు పూర్తయ్యాయి. 3,000 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. రెండవ దశ కింద 18,864 యూనిట్లతో 70 శాతం పూర్తయ్యాయి. కనీస మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించారు. మూడవ దశ కింద 5,464 యూనిట్లు నిర్మిస్తున్నారు. -
నేటి నుంచి ‘రియల్’ అమలు
-
నేటి నుంచి ‘రియల్’ అమలు
ఈ చట్టంతో రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత ► నోటిఫై చేసిన 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ► మిగిలిన రాష్ట్రాలతో కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ చర్చలు న్యూఢిల్లీ: చాలాకాలంగా ఎదురుచూస్తున్న రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. గతేడాది మార్చిలో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందగా.. ఇందులోని 92 సెక్షన్లు మే 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చట్టం నిబంధనలను 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే నోటిఫై చేశాయి. యూపీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు నోటిఫై చేశాయి. గతేడాది కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల (అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యూ, లక్షద్వీప్)కు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ ప్రాంతానికి ఈ నిబంధనలను నోటిఫై చేశాయి. మిగిలిన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలతో ముందుకు రావాల్సి ఉంది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈచట్టాన్ని నోటిఫై చేసి పంపేవిధంగా ఆయా రాష్ట్రాలతో గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. కొనుగోలుదారుల ప్రయోజ నాలను కాపాడేందుకే కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారుల ఫెడరేషన్, రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటుగా పలు భాగస్వామ్య పక్షాలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఈ చట్టంలోని కొన్ని ముఖ్యమైన నిబంధనలు ♦ కనీసం 500 చదరపు మీటర్లు లేదా ఎనిమిది అపార్ట్మెంట్లున్న ప్రతి ప్రాజెక్టుకు ఈ చట్టం అమలవుతుంది. ♦ మొదట్లో దీన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులకే పరిమితం చేద్దామనుకున్నా తర్వాత కమర్షియల్ ప్రాజెక్టులకూ అమలు చేయనున్నారు. ♦ ప్రాజెక్టులో ఆలస్యం కారణంగా నిర్ణీత సమయానికి కొనుగోలుదారులకు ఇల్లు/వాణిజ్య సముదాయం ఇవ్వని పక్షంలో డెవలపర్ ఎస్బీఐ వడ్డీరేటుపై అదనంగా 2 శాతం పరిహారాన్ని 45 రోజుల్లోగా (నిర్ణీత సమయం నుంచి) చెల్లించాలి. ఇది 11–12 శాతం ఉండొచ్చు. ♦ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి సేకరించిన మొత్తంలో 70 శాతాన్ని వేరే బ్యాంకు అకౌంట్లో భద్రపరచాలి. ప్రస్తుత ప్రాజెక్టు నిధులు వేరే ప్రాజెక్టుకు వినియోగించకుండా ఉండేందుకే ఈ నిబంధన. ♦ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ నిధులను ఉల్లంఘించే డెవలపర్లకు కఠినమైన శిక్షతోపాటుగా.. ప్రాజెక్టు వ్యయంలో 10శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుం ది. కొనుగోలుదారులు, ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కొన్న ఆస్తి వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తారు. ♦ కొత్త నిబంధనల ప్రకారం ఆస్తుల అమ్మకాల్లో ఎలాంటి వివక్షా ఉండరాదు. ఇలాంటి ఫిర్యాదులను న్యాయస్థానాలు, రియల్ ఎస్టేట్ అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్స్ 60 రోజుల్లోగా పరిష్కరించాలి. ♦ కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిర్ణీత సమయంలో కంప్లీషన్ సర్టిఫికేట్ రానిపక్షంలో.. డెవలపర్లు ఇందుకు గల కారణాలు, చేసిన మార్పులు, వాటాదారులనుంచి సేకరించిన మొత్తం, ఇందులో వినియోగించిన మొత్తం, ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది తదితర అంశాలతో బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ♦ అధికారుల వద్ద ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ కోసం.. డెవలపర్లు పాన్ కార్డు, గడిచిన మూడేళ్ల వార్షిక లాభ నష్టాల అకౌంట్, బ్యాలన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఆడిటర్ నివేదిక, ధ్రువీకృత లీగల్ టైటిల్ డీడ్, ప్రమోటర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కాపీని తప్పనిసరిగా పొందుపరచాల్సిందే. దీంతోపాటు ప్రమోటర్లూ ఓపెన్, క్లోజ్డ్ పార్కింగ్‌ల వివరాలను సమర్పించాలి. ♦ ఆదాయ పన్ను రిటర్న్స్ వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలన్న నిబంధనను తొలగించారు. ♦ కొనుగోలుదారుల కోసం.. ప్రమోటర్ల ట్రాక్ రికార్డు, వివాదాల వివరాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలు, ప్రాస్పెక్టస్, అపార్టుమెంట్లు, ప్లాట్ల వివరాలు, నమోదు చేసుకున్న ఏజెంట్లు, కన్సల్టెంట్లు, అభివృద్ధి ప్రణాళిక, ప్రమోటర్ ఆర్థిక వివరాలు, ప్రాజెక్టు అనుమతి వివరాలను కచ్చితంగా ప్రమోటింగ్ సంస్థ వెబ్సైట్లో ఉంచేలా రియల్ ఎస్టేట్ నియంత్రణ అధికారులు బాధ్యత వహించాలి. -
కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా
ఖమ్మం వైరారోడ్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని రోడ్లు భవనాలు, స్త్రీ,శిశుసంక్షేమ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం హెలీకాప్టర్ ద్వారా నగరంలోని సర్దార్ పటేల్స్టేడియానికి చేరుకున్న ఆయనకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ అభిమానులనుద్దేశించి మాట్లాడారు. తనను ఇంత అపూర్వంగా స్వాగతించిన ప్రజలకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు మారినప్పుడల్లా మొట్టమొదటిసారిగా తనకు జిల్లానుంచి మంత్రిగా అవకాశం వస్తోందన్నారు. 1984-85 కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడితే అందులో తనకు తొలిసారిగా అవకాశం దక్కిందన్నారు. కేసీఆర్ మూలాన తెలంగాణ రాష్ట్రం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగా, జిల్లానుంచి తనకు మొదటిసారిగా అవకాశం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ఏ ఉద్దేశంతో అయితే తనకు మంత్రి పదవి ఇచ్చారో.. ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తొలిస్థానంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి కేసీఆర్ నరసింహ అవతారం ఎత్తారని, తాను కూడా అదే చేస్తానన్నారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, రహదారులు, సంక్షేమం తదితర రంగాల్లో రాష్ట్రాన్ని ముందుంచే బాధ్యత తనపై ఉందన్నారు. తెలంగాణబిడ్డ దేశంలో ఎక్కడికెళ్లినా తలెత్తుకుని నిలబడేలా చేస్తానన్నారు. మంత్రిగా జిల్లాకు రాగానే రాముల వారి, ఇక్కడి ప్రజల ఆశీస్సులు తీసుకున్నానని, ముఖ్యమంత్రి ఆశీస్సులు తనకు ఎలాగూ ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించడం ఎంతో దూరంలో లేదన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడం తుమ్మల వల్లే సాధ్యమన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ జిల్లాకు సంక్రాంతి నెలరోజుల ముందుగానే వచ్చిందన్నారు. జిల్లాకు తొలి ప్రాధాన్యం ఇచ్చి నాలుగు పదవులు కట్టబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాలను గెలుచుకోవడం తుమ్మల నాయకత్వంలో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
అభివృద్ధే ధ్యేయం
భద్రాచలం : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం భద్రాచలం పర్యటనకు వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాప్టర్ ద్వారా వచ్చిన ఆయన తొలుత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం భద్రాచలం వద్ద గోదావరి నదిపై చేపట్టిన రెండో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2003లో గోదావరి పుష్కరాల సమయంలో తాను మంత్రిగా ఉన్నానని, మళ్లీ 2015లో జరిగే పుష్కరాలు కూడా రాష్ట్ర మంత్రి గా తన హయాంలోనే జరిపే అవకాశం రావటం సం తోషంగా ఉందని చెప్పారు. కొత్త రాష్ట్రంలో అంద రూ మెచ్చే రీతిలో పుష్కరాలు నిర్వహించాలని, ఇం దుకోసం ఎన్ని నిధులైనా ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని తెలిపారు. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసే రీతిలో గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లకు రూ.200 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించినట్లుగా కలెక్టర్ ద్వారా తెలుసుకున్న ఆయన.. మరిన్ని నిధులను తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. భద్రాచలానికి సీఎంను తీసుకొస్తా... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలోనే భద్రాచలం తీసుకొస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. భద్రాచలం, వాజేడు మండలం పూసూరు వద్ద గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జి పనులకు సీఎంతోనే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అందరినీ కలుపుకొని జిల్లా అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కలసిరావాలని కోరారు. భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు... పుణ్య క్షేత్రమైన భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక నిధు లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తుమ్మల చెప్పా రు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే కరకట్టల నిర్మాణం, మిథిలాస్టేడియం పునరుద్ధరణ వంటి పనులు చేశామని గుర్తు చేశారు. భద్రాచలం పట్టణానికి ఓ ప్రత్యేకత ఉందని, దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులై నా మంజూరు చేయించేందుకు వెనుకాడేది లేదని భరోసా ఇచ్చారు. ఐటీడీఏ పీవో దివ్యపై ప్రశంసల జల్లు... ‘ఏజెన్సీ ప్రాంతానికి కలెక్టర్ మీరేనని, గిరిజనులకు మీరందిస్తున్న సేవలు అమోఘమని’ ఐటీడీఏ పీవో దివ్యపై మంత్రి తుమ్మల ప్రశంసల జల్లు కురిపించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ ఇలంబరితి, ఐటీడీఏ పీవో దివ్య వంటి అధికారుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప జేయాలని కోరారు. రామయ్యను దర్శించుకున్న తుమ్మల భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని రాష్ట్ర ఆర్అండ్బీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గురువారం దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన తొలి పర్యటన భద్రాచలం నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి తుమ్మలకు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు మంత్రి తుమ్మలకు పరివట్టం కట్టారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో జ్యోతి మంత్రికి స్వామి వారి మెమెంటో ను అందజేశారు. ఆయన వెంట కలెక్టర్ ఇలంబరితి, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడి పల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఐటీడీఏ పీవో దివ్య, ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసిం, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి మానె రామకృష్ణ, ప్రముఖ న్యాయవాది, టీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పిట్టా శ్రీనివాసరెడ్డి, భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, మస్తాన్‌బాబు, రత్నం రమాకాంత్ ఉన్నారు. రూ.539 కోట్లతో రహదారుల అభివృద్ధి జిల్లాలో రూ.539.77 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తన పర్యటనలో భాగంగా భద్రాచలం బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లాలోని ముత్తగూడెం నుంచి సారపాక వరకూ ఉన్న 221 రహదారిని ఆధునీకరించనున్నట్లు చెప్పా రు. రూ. 98.45 కోట్లతో భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పటిష్టంగా చేపట్టాలన్నారు. వచ్చే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సారపాక వైపు గల అప్రోచ్‌ను మే నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. భద్రాచలం బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొస్తానని చెప్పారు. జిల్లాకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలను కలుపుతూ రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాన రహదారులన్నీ నాలుగు లైన్లుగా విస్తరించి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. అనంతరం ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. -
బాబొచ్చాడు.. జాబు పోయింది
గృహ నిర్మాణ శాఖలో 3 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం సాక్షి విజయవాడ బ్యూరో : బాబొస్తే జాబొస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. సీఎం పీఠం అధిష్టించిన రెండు నెలల్లోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నారు. ఇప్పటికే డ్వామాలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సర్కారు ఇంటికి పంపింది. తాజాగా గృహ నిర్మాణ శాఖలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు 2006 నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీరు పనిచేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన లక్షలాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించేందుకు వీరిని నియమించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, వర్క్ ఇన్స్పెక్టర్లకు నెలకు రూ. 7,500 నుంచి రూ. 8,500 వరకు, అసిస్టెంట్ ఇంజనీర్లకు రూ. 12 వేల చొప్పున జీతం ఇచ్చేవారు. ఏడాదికోసారి వీరి ఉద్యోగాలను పొడిగిస్తూ వచ్చారు. వాస్తవానికి వీరందరికీ జూన్ 30వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగిసింది. జూలై 31వ తేదీ వరకు వీరిని కొనసాగించింది. కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు తమను కూడా క్రమబద్ధీకరిస్తారని వీరంతా ఆశపడ్డారు. అయితే చంద్రబాబు వీరిని ఇంటిబాట పట్టించే పని మొదలు పెట్టారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయించడంపై టీడీపీ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. ఈ ఏడాది మార్చి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతోపాటు ఇప్పుడు గృహ నిర్మాణ శాఖలో సుమారు 3 వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.