కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా
ఖమ్మం వైరారోడ్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని రోడ్లు భవనాలు, స్త్రీ,శిశుసంక్షేమ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం హెలీకాప్టర్ ద్వారా నగరంలోని సర్దార్ పటేల్‌స్టేడియానికి చేరుకున్న ఆయనకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ అభిమానులనుద్దేశించి మాట్లాడారు.
తనను ఇంత అపూర్వంగా స్వాగతించిన ప్రజలకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు మారినప్పుడల్లా మొట్టమొదటిసారిగా తనకు జిల్లానుంచి మంత్రిగా అవకాశం వస్తోందన్నారు. 1984-85 కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడితే అందులో తనకు తొలిసారిగా అవకాశం దక్కిందన్నారు. కేసీఆర్ మూలాన తెలంగాణ రాష్ట్రం సాధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగా, జిల్లానుంచి తనకు మొదటిసారిగా అవకాశం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ఏ ఉద్దేశంతో అయితే తనకు మంత్రి పదవి ఇచ్చారో.. ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు.
జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తొలిస్థానంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి కేసీఆర్ నరసింహ అవతారం ఎత్తారని, తాను కూడా అదే చేస్తానన్నారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, రహదారులు, సంక్షేమం తదితర రంగాల్లో రాష్ట్రాన్ని ముందుంచే బాధ్యత తనపై ఉందన్నారు. తెలంగాణబిడ్డ దేశంలో ఎక్కడికెళ్లినా తలెత్తుకుని నిలబడేలా చేస్తానన్నారు. మంత్రిగా జిల్లాకు రాగానే రాముల వారి, ఇక్కడి ప్రజల ఆశీస్సులు తీసుకున్నానని, ముఖ్యమంత్రి ఆశీస్సులు తనకు ఎలాగూ ఉన్నాయని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించడం ఎంతో దూరంలో లేదన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడం తుమ్మల వల్లే సాధ్యమన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ జిల్లాకు సంక్రాంతి నెలరోజుల ముందుగానే వచ్చిందన్నారు. జిల్లాకు తొలి ప్రాధాన్యం ఇచ్చి నాలుగు పదవులు కట్టబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాలను గెలుచుకోవడం తుమ్మల నాయకత్వంలో సాధ్యమవుతుందని పేర్కొన్నారు.