అభివృద్ధే ధ్యేయం | The goal is to Development the bhadrachalam | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ధ్యేయం

Published Fri, Dec 19 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

అభివృద్ధే ధ్యేయం

అభివృద్ధే ధ్యేయం

భద్రాచలం : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం భద్రాచలం పర్యటనకు వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాప్టర్ ద్వారా వచ్చిన ఆయన తొలుత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం భద్రాచలం వద్ద గోదావరి నదిపై చేపట్టిన రెండో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2003లో గోదావరి పుష్కరాల సమయంలో తాను మంత్రిగా ఉన్నానని, మళ్లీ 2015లో జరిగే పుష్కరాలు కూడా రాష్ట్ర మంత్రి గా తన హయాంలోనే జరిపే అవకాశం రావటం సం తోషంగా ఉందని చెప్పారు. కొత్త రాష్ట్రంలో అంద రూ మెచ్చే రీతిలో పుష్కరాలు నిర్వహించాలని, ఇం దుకోసం ఎన్ని నిధులైనా ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని తెలిపారు. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసే రీతిలో గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లకు రూ.200 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించినట్లుగా కలెక్టర్ ద్వారా తెలుసుకున్న ఆయన.. మరిన్ని నిధులను తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

భద్రాచలానికి సీఎంను తీసుకొస్తా...
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలోనే భద్రాచలం తీసుకొస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. భద్రాచలం, వాజేడు మండలం పూసూరు వద్ద గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జి పనులకు సీఎంతోనే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. బంగారు తెలంగాణ  సాధనలో భాగంగా అందరినీ కలుపుకొని జిల్లా అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కలసిరావాలని కోరారు.

భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు...
పుణ్య క్షేత్రమైన భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక నిధు లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తుమ్మల చెప్పా రు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే కరకట్టల నిర్మాణం, మిథిలాస్టేడియం పునరుద్ధరణ వంటి పనులు చేశామని గుర్తు చేశారు. భద్రాచలం పట్టణానికి ఓ ప్రత్యేకత ఉందని, దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులై నా మంజూరు చేయించేందుకు వెనుకాడేది లేదని భరోసా ఇచ్చారు.
 
ఐటీడీఏ పీవో దివ్యపై ప్రశంసల జల్లు...
‘ఏజెన్సీ ప్రాంతానికి కలెక్టర్ మీరేనని, గిరిజనులకు మీరందిస్తున్న సేవలు అమోఘమని’ ఐటీడీఏ పీవో దివ్యపై మంత్రి తుమ్మల ప్రశంసల జల్లు కురిపించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ ఇలంబరితి, ఐటీడీఏ పీవో దివ్య వంటి అధికారుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప జేయాలని కోరారు.
 
రామయ్యను దర్శించుకున్న తుమ్మల
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గురువారం దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన తొలి పర్యటన భద్రాచలం నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి తుమ్మలకు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు మంత్రి తుమ్మలకు పరివట్టం కట్టారు.

గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో జ్యోతి మంత్రికి స్వామి వారి మెమెంటో ను అందజేశారు.  ఆయన వెంట కలెక్టర్ ఇలంబరితి, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ గడి పల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఐటీడీఏ పీవో దివ్య, ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసిం, టీఆర్‌ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి మానె రామకృష్ణ, ప్రముఖ న్యాయవాది, టీఆర్‌ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పిట్టా శ్రీనివాసరెడ్డి, భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, మస్తాన్‌బాబు, రత్నం రమాకాంత్ ఉన్నారు.
 
రూ.539 కోట్లతో రహదారుల అభివృద్ధి
జిల్లాలో రూ.539.77 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తన పర్యటనలో భాగంగా భద్రాచలం బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లాలోని ముత్తగూడెం నుంచి సారపాక వరకూ ఉన్న 221 రహదారిని ఆధునీకరించనున్నట్లు చెప్పా రు. రూ. 98.45 కోట్లతో భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పటిష్టంగా చేపట్టాలన్నారు.

వచ్చే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సారపాక వైపు గల అప్రోచ్‌ను మే నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. భద్రాచలం బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొస్తానని చెప్పారు. జిల్లాకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలను కలుపుతూ రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాన రహదారులన్నీ నాలుగు లైన్లుగా విస్తరించి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.  అనంతరం ఖమ్మంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement