నేటి నుంచి ‘రియల్’ అమలు
ఈ చట్టంతో రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత
► నోటిఫై చేసిన 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
► మిగిలిన రాష్ట్రాలతో కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ చర్చలు
న్యూఢిల్లీ: చాలాకాలంగా ఎదురుచూస్తున్న రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. గతేడాది మార్చిలో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందగా.. ఇందులోని 92 సెక్షన్లు మే 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చట్టం నిబంధనలను 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే నోటిఫై చేశాయి. యూపీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు నోటిఫై చేశాయి.
గతేడాది కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల (అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యూ, లక్షద్వీప్)కు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ ప్రాంతానికి ఈ నిబంధనలను నోటిఫై చేశాయి. మిగిలిన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలతో ముందుకు రావాల్సి ఉంది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈచట్టాన్ని నోటిఫై చేసి పంపేవిధంగా ఆయా రాష్ట్రాలతో గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. కొనుగోలుదారుల ప్రయోజ నాలను కాపాడేందుకే కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారుల ఫెడరేషన్, రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటుగా పలు భాగస్వామ్య పక్షాలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది.
ఈ చట్టంలోని కొన్ని ముఖ్యమైన నిబంధనలు
♦ కనీసం 500 చదరపు మీటర్లు లేదా ఎనిమిది అపార్ట్‌మెంట్లున్న ప్రతి ప్రాజెక్టుకు ఈ చట్టం అమలవుతుంది.
♦ మొదట్లో దీన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులకే పరిమితం చేద్దామనుకున్నా తర్వాత కమర్షియల్ ప్రాజెక్టులకూ అమలు చేయనున్నారు.
♦ ప్రాజెక్టులో ఆలస్యం కారణంగా నిర్ణీత సమయానికి కొనుగోలుదారులకు ఇల్లు/వాణిజ్య సముదాయం ఇవ్వని పక్షంలో డెవలపర్ ఎస్‌బీఐ వడ్డీరేటుపై అదనంగా 2 శాతం పరిహారాన్ని 45 రోజుల్లోగా (నిర్ణీత సమయం నుంచి) చెల్లించాలి. ఇది 11–12 శాతం ఉండొచ్చు.
♦ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి సేకరించిన మొత్తంలో 70 శాతాన్ని వేరే బ్యాంకు అకౌంట్‌లో భద్రపరచాలి. ప్రస్తుత ప్రాజెక్టు నిధులు వేరే ప్రాజెక్టుకు వినియోగించకుండా ఉండేందుకే ఈ నిబంధన.
♦ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ నిధులను ఉల్లంఘించే డెవలపర్లకు కఠినమైన శిక్షతోపాటుగా.. ప్రాజెక్టు వ్యయంలో 10శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుం ది. కొనుగోలుదారులు, ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కొన్న ఆస్తి వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తారు.
♦ కొత్త నిబంధనల ప్రకారం ఆస్తుల అమ్మకాల్లో ఎలాంటి వివక్షా ఉండరాదు. ఇలాంటి ఫిర్యాదులను న్యాయస్థానాలు, రియల్ ఎస్టేట్ అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్స్ 60 రోజుల్లోగా పరిష్కరించాలి.
♦ కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిర్ణీత సమయంలో కంప్లీషన్ సర్టిఫికేట్ రానిపక్షంలో.. డెవలపర్లు ఇందుకు గల కారణాలు, చేసిన మార్పులు, వాటాదారులనుంచి సేకరించిన మొత్తం, ఇందులో వినియోగించిన మొత్తం, ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది తదితర అంశాలతో బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.
♦ అధికారుల వద్ద ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ కోసం.. డెవలపర్లు పాన్ కార్డు, గడిచిన మూడేళ్ల వార్షిక లాభ నష్టాల అకౌంట్, బ్యాలన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్, ఆడిటర్ నివేదిక, ధ్రువీకృత లీగల్ టైటిల్ డీడ్, ప్రమోటర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కాపీని తప్పనిసరిగా పొందుపరచాల్సిందే. దీంతోపాటు ప్రమోటర్లూ ఓపెన్, క్లోజ్డ్ పార్కింగ్‌ల వివరాలను సమర్పించాలి.
♦ ఆదాయ పన్ను రిటర్న్స్ వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలన్న నిబంధనను తొలగించారు.
♦ కొనుగోలుదారుల కోసం.. ప్రమోటర్ల ట్రాక్ రికార్డు, వివాదాల వివరాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలు, ప్రాస్పెక్టస్, అపార్టుమెంట్లు, ప్లాట్‌ల వివరాలు, నమోదు చేసుకున్న ఏజెంట్లు, కన్సల్టెంట్లు, అభివృద్ధి ప్రణాళిక, ప్రమోటర్ ఆర్థిక వివరాలు, ప్రాజెక్టు అనుమతి వివరాలను కచ్చితంగా ప్రమోటింగ్ సంస్థ వెబ్‌సైట్లో ఉంచేలా రియల్ ఎస్టేట్ నియంత్రణ అధికారులు బాధ్యత వహించాలి.