నేటి నుంచి రియాల్టీ చట్టం అమల్లోకి..
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: చారిత్రక నియంత్రణ చట్టం (రియల్ ఎస్టేట్ యాక్ట్, 2016) సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీని ద్వారా స్థిరాస్తి రంగానికి కొత్త ఊపు వస్తుందని, కొనుగోలుదారులు, విక్రయదారులు, సంస్థ లకు లాభం, ప్రయోజనం కలుగుతుంద న్నారు. ఈ బిల్లుపై 2008లో తర్జనభర్జనలు ప్రారంభించిన గత యూపీఏ ప్రభుత్వం 2013 లో దీన్ని ప్రవేశపెట్టగా.. మోదీ ప్రభుత్వం అవసరమైన మార్పులు, సవరణలతో సెలక్ట్ కమిటీ ద్వారా ఆమోదం పొందిందన్నారు. ఈ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌తో కలుపుకొని 13 రాష్ట్రాలు నియ మని బంధనలను నోటిఫై చేశాయన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా వెంటనే నోటిఫై చేసి ఈ చట్ట స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర పరిధిలో నియమనిబంధ నలను రూపొందించుకోవాలన్నారు.
ఆదివారం పార్టీ నాయకులు డా.కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నల్లు ఇంద్ర సేనారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం నిరాధారమైం దన్నారు. 2019లో జరిగే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కార్యకర్తలకు పిలుపునిచ్చిన విష యాన్ని గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణలోని మిర్చి రైతుల సమస్యపై తగిన చర్య తీసుకోవా లని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కోరగా కొంత మేర సహాయం అందించేందుకు సుముఖతను వ్యక్తం చేశార న్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, దానిపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయాల్లో తనకు తెలిసిన బాహుబలి మోదీ ఒక్కరేనన్నారు.
తలాక్ మతపరమైన అంశం కాదు
ట్రిపుల్ తలాక్ మతపరమైన అంశం కాదని వెంకయ్య స్పష్టం చేశారు. షరియాత్‌లో కూడా దీనికి మంజూరు లేదన్నారు. ఇది ముస్లిం మహిళలు గౌరవంతో జీవించే హక్కుకు సంబంధించినదని, దీనిని రాజకీయం చేయడం తగదన్నారు. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న గులాంనబీ ఆజాద్ వంటి వారు తాము అధికారంలో ఉండగా దీనిపై మౌనం ఎందుకు వహించారో చెప్పాలన్నారు.
బాహుబలి–2 పై వెంకయ్య ప్రశంసల వర్షం
అత్యద్భుత చిత్రీకరణతో హాలీవుడ్ సినిమాలతో పోటీపడే స్థాయిలో బాహుబలి–2ను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిం చారని వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ సినిమా కీర్తిపతాకాన్ని ప్రపంచం నలుమూలాల చాటిన తెలుగుచిత్రం ఇది కావడం గర్వ కారణమన్నారు. శుక్రవారం ఈ సినిమాను తాను వీక్షించి గొప్ప అనుభూతికి లోనైన ట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా ఈ సినిమా దర్శకుడు, నిర్మాతలు, మొత్తం బాహుబలి టీమ్‌ను అభినందిస్తున్నామన్నారు. దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత కె. విశ్వనాధ్‌ను ఆదివారం కలసి అభినందనలు తెలిపామన్నారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా విశ్వనాథ్‌కు ఈ అవార్డును అందజేస్తామన్నారు.