Minority Hostel
-
హాస్టల్లో ఉండటం ఇష్టంలేక..
♦ ఉరి వేసుకుని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య ♦ మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్న బంధువులు ♦ సూరారం డివిజన్ మైనారిటీ హాస్టల్లో ఘటన హైదరాబాద్: హాస్టల్లో ఉండటం ఇష్టంలేక ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. కుత్బుల్లా పూర్లోని వెంకటరాంరెడ్డి నగర్‌కు చెందిన అత్తరున్నీసా బేగం భర్త నజీముద్దీన్ తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. వీరి కుమారుడు ఫరీదుద్దీన్(13) గాజుల రామారంలోని రోడా మేస్త్రీనగర్‌లోని ఓ ఉర్దూ పాఠశాల మదర్సాలో ఏడో తరగతి చదివాడు. 8వ తరగతిని మద ర్సాలో చదవనని ఫరీద్ మారాం చేయడంతో సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ నెల 7న చేర్చారు. ఆ రోజు స్కూల్లో ఉండనని ఫరీద్ మారాం చేయడంతో తల్లి ఇంటికి తీసుకెళ్లింది. శనివారం పాఠశాలకు వచ్చిన అతను.. మరుసటి రోజు ఆదివారం కావడంతో ఇంటికి వెళ్లిపోయాడు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఫరీద్ హాస్టల్లోనే ఉన్నాడు. మంగళవారం హాస్టల్లో ఉండనని అతను మారాం చేయడంతో సాయంత్రం తల్లితో ఫోన్లో మాట్లాడించారు. రాత్రి భోజనం చేసి విద్యార్థులంతా నిద్ర పోయారు. అర్ధరాత్రి 12 గంటలకు ఫరీద్ గదిలో ఉన్న మరో బాలుడు టాయిలెట్ కోసం లేవగా ఫరీద్ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలికి వచ్చేసరికి బాలుడు మృతిచెంది ఉన్నాడు. మైనార్టీ పాఠశాలల రాష్ట్ర చీఫ్ రెసిడెన్సీ ఆఫీసర్ ఎజాజ్ అహ్మద్ బాలుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఫరీద్ తల్లి, బంధువులు అక్కడకు చేరుకుని అంబు లెన్స్‌ను అడ్డుకున్నారు. రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యు కేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్ ఏకే ఖాన్, స్థానిక ఎమ్మేల్యే వివేకానంద్ వారికి నచ్చ జెప్పి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫరీధ్ మృతిపై అనుమానా లున్నాయని, మెడ, ఒంటిపై కమిలిన గాయాలు న్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తల్లి, బంధువులు డిమాండ్ చేశారు. -
ధోబీఘాట్ స్థలాన్ని ఆక్రమిస్తే ఉతికేస్తాం
రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాంబాబు కర్నూలు(అర్బన్)/న్యూసిటీ: జిల్లాలోని ఆదోని పట్టణంలో ధోబీఘాట్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వమే ఇతర అవసరాల పేరిట ఆక్రమించాలని చూస్తే ఉతికి ఆరేస్తామని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాంబాబు హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక బీసీ భవన్లో ఆదోని నుంచి తరలి వచ్చిన వందలాది మంది రజకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆదోని పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పి.ఉసేని అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కె.రామక్రిష్ణ, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, వీఆర్పీఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మహేంద్రనాయుడు, రజక సంఘం రాయలసీమ కన్వీనర్ వాడాల నాగరాజు, నాయకులు కేతూరి మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతు ఆదోనిలో దాదాపు 700 పైగా రజక కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. వీరి జీవనోపాధికై 1914లో సర్వే నెంబర్లు 239, 240, 241, 242లో 15.18 ఎకరాల భూమిని ధోబీఘాట్ల నిర్మాణానికి కేటాయించారన్నారు. అప్పటి నుంచి రజకులు అక్కడే తమ కుల వృత్తి సాగిస్తున్నట్లు చెప్పారు. సహాయ నిరాకరణ చేస్తున్నా.. ధోబీఘాట్‌కు కేటాయించిన స్థలంలో దాదాపు 70 శాతం భూమి వివిధ అవసరాలకు ఉపయోగించుకోగా, ప్రస్తుతం 30 శాతం భూమి మాత్రమే మిగిలిందని రాంబాబు తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిని కూడా మైనారిటీ హాస్టల్ నిర్మాణానికి లాక్కునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ విషయంలో వారం రోజులుగా ఆదోని రజకులు సహాయ నిరాకరణ చేపడుతున్నా, రాజకీయ నాయకులు కానీ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ధోబీఘాట్ స్థలాన్ని కాపాడేందుకు వెంటనే ప్రహరీ నిర్మించి, రజకులకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. అంతకు ముందు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో రజక మహిళా సంఘం నాయకురాలు మంగమ్మ, నాయకులు ముక్కన్న, పి.వెంకటేష్, రజక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగరాజు, గురుశేఖర్, గౌరవాధ్యక్షుడు సి.గోవిందు తదితరులు పాల్గొన్నారు.