miseva
-
Asara Pension: 57 ఏళ్లు నిండిన వారికి.. ఈనెల 31 వరకు గడువు
సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్): ఆసరా పింఛన్ కోసం 57 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు మీసేవ, ఈసేవ కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నూతనంగా పింఛన్ పొందేందుకు అర్హతలు కలిగి ఉన్న దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. మూడేళ్ల క్రితమే సర్వే.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు మూ డేళ్ల క్రితమే జిల్లాలో సర్వే నిర్వహించా రు. ఓటరు జాబితా ఆధారంగా కొత్తగా జిల్లాల్లో 32 వేల మంది వృద్ధాప్య పింఛన్‌కు అర్హత కలిగి ఉన్నారని గుర్తించారు. సర్వే తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించలేదు. ప్రస్తుతం 57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్లు ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేయడంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీసేవ.. ఈసేవ కేంద్రాల్లో.. నూతనంగా పింఛన్ పొందేందుకు అర్హులు దరఖాస్తులను మీసేవ, ఈసేవ కేంద్రాల్లో అందజేయాలి. వయస్సు నిర్ధారణ కోసం పాఠశాలలో జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డులో నమోదైన తేదీని పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి సేవా రుసుం తీసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. అందరికీ తామే చెల్లిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. -
గొల్లపూడి రేవు నుంచి ఇసుక అక్రమ తరలింపు
గొల్లపూడి (విజయవాడ రూరల్) : సూరాయిపాలెం రేవు నుంచి టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గొల్లపూడి(సూరాయిపాలెం) ఇసుకరేవు నిర్వహణను డ్వాక్రా గ్రూపుకు కేటాయించింది. అయితే అక్కడ స్థానిక టీడీపీనాయకులు డ్వాక్రాగ్రూపు మహిళలను, డీఆర్డీఏ అధికారులను కూడా లెక్కచేయకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వేబిల్లులు లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇసుక రవాణా ఆగిపోయిందని డ్వాక్రా మహిళలు చెబుతుండగా ఉదయం నుంచి ఇసుక రవాణా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. నదినుంచి బోట్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చే విషయంలో టీడీపీలోని రెండు వర్గాలకు చెందిన వారు గొడవ పడగా, గ్రామపంచాయతీ పాలకవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి కలగ జేసుకొని ఒక్కొక్కరూ పదేసి రోజులపాటు నదినుంచి ఇసుకను తెచ్చేవిధంగా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది. వేబిల్లు లేకుండా తీసుకెళుతున్న ఇసుకను లారీ 15వేల రూపాయలకు బహిరంగంగా విక్రయిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రజలు మీసేవా కేంద్రంలో ఇసుక కొనుగోలు కోసం క్యూబిక్ మీటర్‌కు రూ.526, ట్రాన్స్‌పోర్టు చార్జీలకుగాను లారీకి రూ.800 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు లారి కిరాయి డబ్బు తిరిగి ఇసుక కొనుగోలుదార్లకు చెల్లించాల్సివుండగా అలా జరగడం లేదు. శనివారం మధ్యాహ్నానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 28లారీలకు, రెండుట్రాక్టర్లకు ఇసుకను విక్రయించినట్టు డీఆర్డీఏ ఏపీఎం శ్రీరామ్ తెలిపారు. లారి కిరాయిలు కొనుగోలుదారులే చెల్లిస్తున్నారని, తిరిగి వారికి చెల్లించాల్సి ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదులు ఇసుక అక్రమరవాణాపై డీఆర్డీఏ కార్యాలయానికి ఫోన్ల ద్వారా ఫిర్యాదులు రావడంతో ఏపీడీ కాళికాదేవి శనివారం సూరాయిపాలెం ఇసుకరేవును పరిశీలించారు. తాను వెళ్లిన సమయంలో బయటవ్యక్తులు ఎవరూ లేరని ఆమె తెలిపారు. ఇసుకరేవు వద్ద వెబ్ కెమేరాలు ఏర్పాటు చేయకపోవడం, డ్వాక్రా మహిళలకు ఐప్యాడ్లను అందించకపోవడంపై ఏపీడీ ని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. ఇసుకరేవు వద్ద ఇసుకను నిల్వచేయడానికి ఐదెకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉందని తెలిపారు. -
ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
నెలాఖరు వరకు గడువు కలెక్టర్ రఘునందన్‌రావు తిరువూరు : సామాజిక పెన్షనుదారులు, ఉపాధిహామీపథకం జాబ్‌కార్డుదారులు నెలాఖరులోగా ఆధార్ వివరాలు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. శుక్రవారం తిరువూరు వచ్చిన ఆయన తహ సీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పలు పథకాల్లో ఆధార్‌నంబరును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో ఆధార్‌కార్డుల జారీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మీసేవా కేంద్రాల్లో కూడా శాశ్వత ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నందున పెన్షన్లు, ఎన్ఆర్ఈజీఎస్, పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డుదారులు విధిగా తమ డేటా ఎంట్రీ చేయించుకుని కార్డులు పొందాలని కోరారు. ఈ నెలాఖరులోపు వివరాలు నమోదు చేయని పెన్షనర్లు, ఉపాధిహామీపథకం కూలీలకు చెల్లింపులు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు 36శాతం, రేషన్‌కార్డులు 56శాతం, ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డులు 76శాతం, పెన్షన్లు 50శాతం మాత్రమే ఆధార్‌కు అనుసంధానం చేశారని, మిగిలినవి త్వరలో అనుసంధానిస్తామని తెలిపారు. ఇసుక తవ్వకాల నిరోధానికి టాస్క్‌ఫోర్స్... జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇసుక తవ్వకాలపై తమకు సమాచారం ఇస్తే టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరపడం నేరమని తెలిపారు. అధికారులతో సమావేశం... పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్స్ ఆన్లైన్ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ని పట్టాదారు పాసుపుస్తకాలను ఆన్లైన్ చేశారు, ఆధార్ నంబర్ల నమోదు తదితర వివరాలను వీఆర్వోలనడిగి తెలుసుకున్నారు. మల్లేల, రామన్నపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన అసైన్డ్భూములు, అటవీ, రెవెన్యూ భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రథర్‌బాబు, ఎంపీడీవో సుమమాలిని, సీడీపీవో అంకమాంబ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షకీల్‌అహ్మద్ పాల్గొన్నారు. కౌలు రైతుల గుర్తింపునకు గ్రామసభలు విస్సన్నపేట : కౌలురైతులను గురిచేందుకు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. తహసీత్దారు కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరైన వారి దరఖాస్తులను పరిశీలించి మరళా రెన్యూవల్ చేయ్యాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు.డీఎస్సీ ద్వారా త్వరలోనే అవసరమైన చోట ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు. తహసీల్దార్ సాయిగోపాల్,ఎంపీడీవో జాన్సీరాణి,ఎంఈవో రేణుకానందరావు పాల్గొన్నారు.