గొల్లపూడి (విజయవాడ రూరల్) : సూరాయిపాలెం రేవు నుంచి టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గొల్లపూడి(సూరాయిపాలెం) ఇసుకరేవు నిర్వహణను డ్వాక్రా గ్రూపుకు కేటాయించింది. అయితే అక్కడ స్థానిక టీడీపీనాయకులు డ్వాక్రాగ్రూపు మహిళలను, డీఆర్‌డీఏ అధికారులను కూడా లెక్కచేయకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వేబిల్లులు లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇసుక రవాణా ఆగిపోయిందని డ్వాక్రా మహిళలు చెబుతుండగా ఉదయం నుంచి ఇసుక రవాణా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు.
నదినుంచి బోట్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చే విషయంలో టీడీపీలోని రెండు వర్గాలకు చెందిన వారు గొడవ పడగా, గ్రామపంచాయతీ పాలకవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి కలగ జేసుకొని ఒక్కొక్కరూ పదేసి రోజులపాటు నదినుంచి ఇసుకను తెచ్చేవిధంగా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది. వేబిల్లు లేకుండా తీసుకెళుతున్న ఇసుకను లారీ 15వేల రూపాయలకు బహిరంగంగా విక్రయిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ప్రజలు మీసేవా కేంద్రంలో ఇసుక కొనుగోలు కోసం క్యూబిక్ మీటర్‌కు రూ.526, ట్రాన్స్‌పోర్టు చార్జీలకుగాను లారీకి రూ.800 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు లారి కిరాయి డబ్బు తిరిగి ఇసుక కొనుగోలుదార్లకు చెల్లించాల్సివుండగా అలా జరగడం లేదు. శనివారం మధ్యాహ్నానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 28లారీలకు, రెండుట్రాక్టర్లకు ఇసుకను విక్రయించినట్టు డీఆర్‌డీఏ ఏపీఎం శ్రీరామ్ తెలిపారు. లారి కిరాయిలు కొనుగోలుదారులే చెల్లిస్తున్నారని, తిరిగి వారికి చెల్లించాల్సి ఉందన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదులు
ఇసుక అక్రమరవాణాపై డీఆర్‌డీఏ కార్యాలయానికి ఫోన్ల ద్వారా ఫిర్యాదులు రావడంతో ఏపీడీ కాళికాదేవి శనివారం సూరాయిపాలెం ఇసుకరేవును పరిశీలించారు. తాను వెళ్లిన సమయంలో బయటవ్యక్తులు ఎవరూ లేరని ఆమె తెలిపారు. ఇసుకరేవు వద్ద వెబ్ కెమేరాలు ఏర్పాటు చేయకపోవడం, డ్వాక్రా మహిళలకు ఐప్యాడ్‌లను అందించకపోవడంపై ఏపీడీ ని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. ఇసుకరేవు వద్ద ఇసుకను నిల్వచేయడానికి ఐదెకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉందని తెలిపారు.
గొల్లపూడి రేవు నుంచి ఇసుక అక్రమ తరలింపు
Published Sun, Oct 19 2014 2:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement