కొన్ని చప్పుళ్లు వింటే కొందరు పళ్లు నూరుతారు!
మెడిక్షనరీ
చప్పరించే శబ్దం వింటే చాలు కొందరికి ఒళ్లు మండిపోతుంది. వారు పళ్లు పరపరా నూరుతుంటారు. కేవలం చప్పరింపులే కాకుండా పెదవులు నాక్కోవడం, గొంతు సవరించుకోవడం, టూత్‌బ్రష్ చప్పుడు చేస్తూ ఉపయోగించడం, విజిల్ వేయడం వంటి కాసేపు పదేపదే కొనసాగే ఈ శబ్దాలు వచ్చినప్పుడల్లా వారిలో కోపం నషాళానికి అంటుతుంటుంది. కొందరికి టైపింగ్ శబ్దాలతోనూ, హమ్ చేస్తున్న చప్పుళ్లతోనూ ఈ కోపం తారస్థాయికి చేరుతుంటుంది. ఇక చెప్పులతో చప్పుడు చేస్తున్నట్లు నడిస్తే... ఆ శబ్దం విన్న కొందరికి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంటుంది. దీన్నే సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అని వ్యవహరిస్తుంటారు.
వైద్యపరిభాషలో ‘మిసోఫోనియా’ అంటారు. ఇలాంటి ఫీలింగ్ కలగడం దాదాపు సహజమే అయినా శబ్దాల పట్ల తీవ్రమైన కోపానికి గురయ్యేవారిలో కొందరికి చెమటలు పట్టడం, కండరాలు టెన్షన్‌కు గురికావడం, గుండెదడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కొద్దిపాటి శబ్దం వచ్చే ఫ్యాన్ సౌండ్‌ను అలవాటు చేయడం దగ్గర్నుంచి క్రమంగా శబ్దాలను అలవరుస్తారు. ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’కు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.