వచ్చే ఏడాదిలోనే 'మలేషియా విమానం' ఆచూకీ
అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ తెలుసుకోవాలంటే మరింత సమయం పట్టనుందా అంటే అవుననే అంటున్నారు ఆ దేశ ఉన్నతాధికారులు. గల్లంతైన విమాన కోసం కనిష్టంగా 8 నుంచి గరిష్టంగా12 నెలలు సమయం పడుతుందని సదరు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన బృందానికి నాయకత్వం వహించిన రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్ఘుస్ హ్యూస్టన్ వెల్లడించారు.
శుక్రవారం కౌలాలంపూర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానం కోసం గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే విమాన జాడ కనుక్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఇప్పటికే విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో హ్యుస్టన్ ప్రకటనతో ప్రయాణికుల బంధువుల ఆగ్రహనికి అగ్నికి అజ్యం పోసినట్లు అయింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే.