mk alagari
-
సోదరుడికి చెక్.. బీజేపీతో పొత్తుకు సై!
సాక్షి, చెన్నై : వరుస విజయాలతో ఉత్తరాన మంచి ఊపుమీద ఉన్న బీజేపీ.. దక్షిణాదిపై కన్నేసింది. ఇప్పటికే కర్ణాటకలో కాషాయ జెండా ఎగరేసి.. మరింత విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఇలాంటి వ్యూహన్నే అమలు చేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి సీనియర్ నేతలను కాషాయ గూటికి చేర్చుకుంటోంది. ఇక తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడుపై బీజేపీ నాయకత్వం మరింత దృష్టి సారించింది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న మోదీ-షా ద్వయం అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. 2021 ప్రతమార్థంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా మిత్రలను దగ్గరకు చేర్చుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్, డీఎంకేల నుంచి నాయకులకు గాలం వేస్తోంది. దీనిలో భాగంగానే హస్తం పార్టీ సీనియర్ నేత ఖుష్బూను ఇటీవల బీజేపీలో చేర్చుకుంది. (అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే) ముఖ్యంగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌కు చెక్ పెట్టాలను బీజేపీ నాయకత్వంలో తెరవెనుక వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే బహిష్కృత నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఎంకే అళగిరికి గాలం వేస్తోంది. తమిళనాడు రాజకీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న సమాచారం మేరకు.. ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు అళగిరితో భేటీ అయ్యారని, పార్టీ పెద్దల్ని కలిసేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈనెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు కూడా తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. రానున్న ఎన్నికల్లో డీఎంకేకు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఓ పార్టీని సైతం నెలకొల్పుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు అళగిరి మద్దతుదారులు సైతం బీజేపీతో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరుణానిధి మరణం అనంతరం డీఎంకే పగ్గాలు చేపట్టాలనుకున్న అళగిరికి స్టాలిన్ చెక్ పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే అన్నపై వేటు వేశారు. డీఎంకేను పూర్తిగా తన కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి డీఎంకేకు అళగిరి దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో.. మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన మద్దతు దారులు డిమాండ్ చేస్తున్నారు. డీఎంకే నుంచి బహిష్కరించి అవమాన పరిచిన స్టాలిన్‌ను దెబ్బకొట్టాలని ఆయన వర్గం కసితో ఉంది. ఈ క్రమంలోనే బీజేపీకి దగ్గరయ్యేందుకు దారులు వెతుకుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అసెంబ్లీ ఎన్నికల నాటికి అళగిరి ఓ కొత్త పార్టీని స్థాపించి.. ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. లేకపోతే అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీలో చేరనున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు సోదరుడి అడుగులను నిషితంగా పరిశీలిస్తున్న స్టాలిన్.. సీనియర్ నేతలతో మంతనాలు సైతం ప్రారంభించారు. అళగిరి వెంట ఉన్న డీఎంకే మద్దతుదారులను తనవైపుకు తిప్పుకునేందుకు దూతను పంపుతున్నారు. -
అళగిరి ర్యాలీ అట్టర్ ప్లాప్
సాక్షి, చెన్నై : డీఎంకే బహిష్కృత నేత అళగిరి తలపెట్టిన శాంతి ర్యాలీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ర్యాలీకి ఎవరు హాజరుకావద్దంటూ డీఎంకే హెచ్చరించడంతో కార్యకర్తలు దూరంగా ఉన్నారు. దీంతో అళగిరి కేవలం తన సానుభూతిపరులతో మాత్రమే ర్యాలీని నిర్వహించారు. కాగా అళగిరి ర్యాలీకి కరుణానిధి అభిమానులు, డీఎంకే నేతలు భారీగా హాజరవుతారంటూ మొదట ప్రచారం జరిగినా.. పార్టీ అదేశాల మేరకు ఎవరు కూడా ర్యాలీలో పాల్గొనలేదు. దీంతో అన్నదమ్ముల అధిపత్య పోరులో అళగిరి చతికలపడ్డారు. డీఎంకే కార్యకర్తలను అదుపులో పెట్టడంలో స్టాలిన్ విజయం సాధించారు. ర్యాలీకి భారీగా తన అనుచరులు వస్తారని ఆశపడ్డ అళగిరి తీవ్రంగా నిరశపడ్డారు. -
చెన్నైలో అళగిరి శాంతి ర్యాలీ
-
డీఎంకేకు అళగిరి అల్టిమేటం
సాక్షి, చెన్నై : డీఎంకే మాజీ అధినేత కరుణానిధి మరణంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీపై పట్టుకు ఒక్కరికొకరు పోటీ పొడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణానిధి మరో కుమారుడు అళగిరి పార్టీపై తిరుగబాటు జెండా ఎగరవేశారు. స్టాలిన్ తమ నాయకుడు కాదని.. అసలైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. దీంతో స్టాలిన్ వర్గానికి హెచ్చరికగా నేడు చెన్నైలో అళగిరి తన మద్దతు దారులతో శాంతి ర్యాలీని నిర్వహించనున్నారు. అళగిరి తలపెట్టిన ర్యాలీకి పార్టీ కార్యకర్తలెవరు హాజరుకావద్దని డీఎంకే ఆదేశాలు జారీ చేసింది. కాగా అళగిరి 2014 లోకసభ ఎన్నికల సమయంలో కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎంకేలో ఉన్న కొందరు కీలక నేతలు అళగిరికి మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అళగిరి తలపెట్టిన ర్యాలీతో డీఎంకేలో అందోళన మొదలైంది. మరోవైపు అళగిరి కదలికలను బీజేపీ ఆసక్తిగా గమనిస్తోంది. పార్టీపై తిరుగుబాటు చేసిన అళగిరిని తమవైపుకు తిప్పుకుంటే తమిళనాటలో కొంత బలపడొచ్చని కమళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీపై పట్టుకోసం స్టాలిన్ ఏలాంటి వ్యూహాలు అమలుచేస్తారో వేచి చూడాలి. -
డీఎంకేను చీల్చేందుకు అళగిరి సిద్ధం?
తమిళనాట మరో కొత్త పార్టీ రాబోతోంది. డీఎంకే నుంచి బహిష్కతుడైన కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి.. తన తండ్రి పార్టీని నిలువునా చీల్చి, కొత్త పార్టీ పెట్టేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా తన సొంత నియోజకవర్గం మదురైలో తన మద్దతుదారులతో సమావేశం అవుతున్నారు. క్రమశిక్షణ రాహిత్యం ఆరోపణలతో జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అళగిరి, పార్టీ పెట్టే విషయాన్ని గతవారమే సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటానంటున్నారు. కానీ ఇప్పటికే కళైంగర్ డీఎంకే అనే పేరును కొత్త పార్టీకి పెడుతూ మదురైలో పోస్టర్లు వెలిశాయి. ఇంతకుముందే ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిసిన అళగిరి, ఆ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కూడా భేటీ అయ్యారు. ఒకవేళ అళగిరి కొత్త పార్టీ పెడితే మాత్రం తన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడు ప్రాంతంలో డీఎంకే విజయావకాశాలను అళగిరి గట్టిగా దెబ్బతీయగలరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇలాగే రెబల్ అభ్యర్థులను రంగంలో నిలబెట్టి, 30 మంది పార్టీ అభ్యర్థులను ఓడించారు. అయితే డీఎంకే వర్గాలు మాత్రం స్టాలిన్ ఉన్నంతవరకు అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నాయి.