డీఎంకేను చీల్చేందుకు అళగిరి సిద్ధం?
తమిళనాట మరో కొత్త పార్టీ రాబోతోంది. డీఎంకే నుంచి బహిష్కతుడైన కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి.. తన తండ్రి పార్టీని నిలువునా చీల్చి, కొత్త పార్టీ పెట్టేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా తన సొంత నియోజకవర్గం మదురైలో తన మద్దతుదారులతో సమావేశం అవుతున్నారు. క్రమశిక్షణ రాహిత్యం ఆరోపణలతో జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన అళగిరి, పార్టీ పెట్టే విషయాన్ని గతవారమే సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, లోక్సభ ఎన్నికల తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటానంటున్నారు. కానీ ఇప్పటికే కళైంగర్ డీఎంకే అనే పేరును కొత్త పార్టీకి పెడుతూ మదురైలో పోస్టర్లు వెలిశాయి. ఇంతకుముందే ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు, బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసిన అళగిరి, ఆ తర్వాత సూపర్స్టార్ రజనీకాంత్తో కూడా భేటీ అయ్యారు.
ఒకవేళ అళగిరి కొత్త పార్టీ పెడితే మాత్రం తన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడు ప్రాంతంలో డీఎంకే విజయావకాశాలను అళగిరి గట్టిగా దెబ్బతీయగలరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇలాగే రెబల్ అభ్యర్థులను రంగంలో నిలబెట్టి, 30 మంది పార్టీ అభ్యర్థులను ఓడించారు. అయితే డీఎంకే వర్గాలు మాత్రం స్టాలిన్ ఉన్నంతవరకు అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నాయి.