మదర్సాల ఎత్తివేతకు ప్రభుత్వ కుట్ర
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
భివండీ: మదర్సాలను ఎత్తివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దాన్ని అమలుచేయకుండా అడ్డుకుంటామని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. భివండీలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యంగంలో ప్రతి పౌరుడికి తమ ధర్మాన్ని అనుసరించి పాఠశాలలు స్థాపించుకునే అధికారం ఉందని పేర్కొన్నారు. బీజేపీ వైఖరిని ఎంఐఎం ఖండిస్తుందని, మదర్సాల ఎత్తివేత అమలుచేయకుండా అడ్డుకుంటామని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం తన ఏడాది పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. భివండీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఒవైసీ చెప్పారు. అంతకు ముందు గాయత్రీనగర్‌లో ఎంఐఎం భివండీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న పాఠశాల స్థలాన్ని ఒవైసీ పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వారిస్ పఠాన్, భివండీ శాఖ పార్టీ పర్యవేక్షకుడు అతహర్ ఫారుఖీ, థానే జిల్లా అధ్యక్షుడు జుబేర్ షేక్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.