ఎమ్మెల్యే నరేంద్రను అడ్డుకున్న అంబేడ్కర్ యూత్
పొన్నూరు : అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తమను టీడీపీ కార్యకర్తలు, పోలీసులు దౌర్జన్యంగా పక్కకు తొలగించినందుకు నిరనగా గురువారం అంబేడ్కర్ యూత్ సభ్యులు ఎమ్మెల్యే థూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ను అడ్డుకుని నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక క్రీస్తు శతవార్షిక లూథరన్ దేవాలయం సమీపం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో మరో ర్యాలీ కూడా అదే సమయంలో అక్కడికి చేరుకుంది. పోలీసులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న అంబేడ్కర్ యూత్ సభ్యులను కిందికి దించేసే క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పలువురు అంబేడ్కర్ యూత్ సభ్యులకు గాయాలయ్యాయి.
ఇదంతా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ సమక్షంలోనే జరగడం, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిలువరించకపోవడం గమనార్హం. దీంతోఅంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న తమను తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అన్యాయంగా అడ్డుకోవడంపై సమాధానం చెప్పాలని అంబేడ్కర్ యూత్ సభ్యులు ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ను అడ్డుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా నిరోధించారు. పోలీసులు అంబేడ్కర్ యూత్ సభ్యులను పక్కకు తొలగించి ఎమ్మెల్యేకు మార్గం సుగమం చేశారు.