MLA Gudem Mahipal Reddy
-
‘మోసంతోనే పద్దెనిమిదేళ్లు గెలిచావ్’
సాక్షి, సంగారెడ్డి : మెడికల్ కళాశాల మంజూరుకు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజల్ని మోసం చేసి 18 సంవత్సరాలు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాడని జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాలనా కాలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఆయన ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లు ఇలాంటి మోసగాడికి మద్దతు తెలపడం బాధాకరమన్నారు. జగ్గారెడ్డిని ప్రజలు నమ్మరు.. మెడికల్ కళాశాల కోసం బూటకపు దీక్షలు చేస్తున్న జగ్గారెడ్డిని ప్రజలు విశ్వసించరని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. కళాశాల ఏర్పాటును కోరుతూ 2013లో చేసిన దరఖాస్తును.. మంజూరు అయినట్లు మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి కడతారని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
-
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
పటాన్ చెరు: మెదక్ జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఎమ్మెల్యే ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్, సంగారెడ్డి ఆదాయ పన్ను శాఖ అధికారి సాయిప్రతాప్ నేతృత్వంలో 20 మందికి పైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థిరాస్తులను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసంతోపాటు వారి బంధువుల వద్ద తనిఖీలు నిర్వహించారు. అధికారులు సోదాలు ప్రారంభించిన సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ఆయన తన నివాసానికి చేరుకున్నారు. అధికారులు అడిగిన వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే ఆదాయ వ్యవహారాలు చూసే ఆడిటర్లు సైతం అధికారుల ముందు హాజరయ్యారు. వారి నుంచి కూడా వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే నివాసంలో నగదు నిల్వలు ఉండవచ్చన్న అనుమానంతో అధికారులు దాడులు చేశారనే వదంతులు విన్పిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన నివాసంలో రూ.5లక్షల నగదు, 30 తులాల బంగారం ఉన్నట్టు తెలిసింది. ఇదిలావుండగా గతంలో ఓ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించారనే కేసులో ఎమ్మెల్యేకు రెండున్నరేళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసు హైకోర్టులో కొనసాగుతుంది. ఈ కేసు తీర్పు ప్రకారం ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపులో జాప్యం జరిగింది: ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో జాప్యం జరిగినందున అధికారులు సోదాలు చేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తానని చెప్పారు. అధికారులు కోరిన విధంగా అన్ని పత్రాలు చూపించినట్టు తెలిపారు. అనువంశికంగా వచ్చిన ఆస్తులను డెవలప్మెంటుకు ఇచ్చామని, ప్రతి పైసాకు తమ వద్ద లెక్కలు ఉన్నాయని వివరించారు.