ఎమ్మెల్యే కల్పనతో వర్ల వాదన
పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ఘటన
ప్రభుత్వ కార్యక్రమంలో మీకేం పని అని ప్రశ్నించిన ఎమ్మెల్యే
మొవ్వ,(కూచిపూడి) : ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ నేతల హల్చల్ కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొవ్వ జేజేనగర్లో రూ.16.70లక్షల ఎస్ఎఫ్ఏ నిధులతో నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ సాక్షిగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కల్పనతో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వర్ల రామయ్య వాగ్వాదానికి దిగారు. ఉదయం 9గంటలకు భవనాన్ని ప్రారంభించాల్సిన జెడ్పీ చైర్పర్సన్ అనూరాధ మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. కాలాతీతంకావడంతో ముందుగా భవనాన్ని ప్రారంభించాలని అనురాధను రామయ్య కోరారు. సభా సంప్రదాయం ప్రకారం ముందుగా అతిథులను ఆహ్వానించిన అనంతరమే భవనాన్ని ప్రారంభించాలని ఎంఈవో బి. కోటేశ్వరరావుకు ఎమ్మెల్యే సూచించారు.
రామయ్య కల్పించుకుని ముందుగా భవన ప్రారంభానికి ఏర్పాటు చేయాలని ఎంఈవోకు చెప్పారు. ఎమ్మెల్యే ఆగ్రహించి ప్రభుత్వ కార్యక్రమంలో ‘మీకేం సంబంధం’ అంటూ ఆయనను ప్రశ్నించారు. అతిథులు కల్పించుకుని సర్ధిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అతిథులను ఆహ్వానించిన తర్వాతనే పాఠశాల భవనం ప్రారంభించారు. తొలుత పాఠశాల విద్యా కమిటీ అతిథులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన బ్యానరులో వర్ల రామయ్య పేరు చేర్చటంపై ఎస్ఎంసీ చైర్మన్ పసుమర్తి కృష్ణమూర్తిపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించటంతో వాటి ఏర్పాటులో తమ ప్రమేయం ఏమీ లేదని ఎంపీడీవో, ఎంఈవో వివరించారు.