mla meda mallikarjunareddy
-
ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ నేత దాడి
వైస్సార్ కడప, రాజంపేట : రాజంపేట పట్టణంలోని పాతబస్టాండులో తాడిపత్రి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వర్గీయుడు దాడి చేశారు. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం తిరుపతి నుంచి తాడిపత్రికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం రాజంపేట పాతబస్టాండుకు చేరుకుంది. ఆ సమయంలో బస్సులోని ప్రయాణికులను దింపేందుకు డ్రైవరు ఎం.మల్లికార్జున బస్సు నిలిపాడు. అయితే అదే సమయంలో ముందున్న టాటా సఫారీ వాహనాన్ని(ఏపీ04బీకె 3333) పక్కకు తీయమని పలుమార్లు హారన్ కొట్టాడు. దీంతో అందులో ఉన్న మనోహర్‌రెడ్డి దిగి బస్సువద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఎందుకు హారన్ కొట్టావంటూ డ్రైవర్‌ను దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పటికీ పోలీసులు ఫిర్యాదును తీసుకోవడంలో జాప్యం చేశారు. ఎట్టకేలకు దాడికి పాల్పడిన టీడీపీ నేత మనోహర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సాయంత్రం వరకు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేయలేదు. -
‘దేశం’ నాయకుల వాగ్వాదం
సుండుపల్లి: రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాగ్వాదం చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సుండుపల్లికి చెందిన ఓ నాయకుడు స్థానిక బహుదా నది నుంచి కొందరు ఇసుకను తరలిస్తున్నారనే కారణంగా వాహనాలు రాకుండా చేసేందుకు రోడ్డుకు మధ్యలో గుంతలు తీశారు. అయితే ఇదే ప్రాంతంలో కాంట్రాక్టు పనులు చేస్తున్న మరో టీడీపీ నాయకుడు తన పనులకు ఇసుక తీసుకెళ్లకూడదే ఉద్దేశంతోనే రోడ్డుకు అడ్డంగా గుంతలు తీశారంటూ విషయాన్ని ఎమ్మెల్యే మేడా దృష్టికి తీసుకెళ్లారు. శనివారం బూడిదగుంటరాచపల్లి సమీపంలో పంటలు పరిశీలించేందుకు వచ్చిన మేడా ఈ విషయమై ఇద్దరు నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే తన వాహనం ఎక్కి తిరుపతికి వెళ్లిపోయారు. నాయకులు కూడా ఎవరిదారిన వారు వెళ్లారు. టీడీపీ నాయకుల వాగ్వాదం విషయం సుండుపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.