MLA office buildings
-
Siddipet: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం సిద్దిపేటలో చేరుకున్నారు. అనంతరం సిద్దిపేటలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. చదవండి: లాక్‌డౌన్‌తోనే కేసులు తగ్గాయ్: సీఎం కేసీఆర్ -
సాగుకు పూర్వ వైభవం తేవాలి
* బడ్జెట్లో ఈ రంగానికి సరిపోయేలా నిధులు: సీఎం కేసీఆర్ * డిమాండ్‌కు తగ్గ పంటలు వేసేలా చూడండి * 46 వేల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలి * సాగుపై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి సూచన సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది రైతులు ఆధారపడి బతికే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. రైతులకు మేలు చేసే విధానాలు అనుసరించాలన్నారు. వ్యవసాయ శాఖకు చాలినన్ని నిధులివ్వాలని స్పష్టంచేశారు. బడ్జెట్‌పై చేస్తున్న శాఖల వారీ సమీక్షలో భాగంగా గురువారం సీఎం వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శాస్త్రీయ పద్ధతిలో రైతులకు మేలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అధిక వర్షాలున్నప్పుడు ఒక రకంగా వర్షాలు లేనప్పుడు మరో రకంగా వ్యూహం ఉండాలని వివరించారు. పత్తి వద్దు.. మక్క, సోయాబీన్ మేలు డిమాండ్‌కు తగినట్లు పంటలను సాగు చేసేలా రైతులను సన్నద్ధపరచాలని అధికారులకు సీఎం సూచించారు. ‘‘పత్తి ఎగుమతులపై విధించే సుంకం కారణంగా భవిష్యత్‌లో ఆ పంటకు మంచి ధర రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించాలి. తక్కువ పెట్టుబడి, గ్యారంటీ మార్కెట్ ఉన్న మొక్కజొన్నను ప్రోత్సహించాలి. డిమాండ్ ఉన్న సోయాబీన్ పంట సాగు దిశగా చైతన్యపరచాలి. సోయాబీన్ రైతులకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో ఉంచాలి’’ అని చెప్పారు. మిర్చి, పసుపు, అల్లం వంటివి పండించడానికి అనువైన భూములను గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు. యార్డుల్లో సరుకు తడవకుండా మార్కెటింగ్ శాఖతో కలసి పనిచేయాలన్నారు. కేంద్ర నిధులు వచ్చేలా ప్రణాళికలు కేంద్ర నిధులు అధిక మొత్తంలో పొందేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రానికి అవసరమయ్యే కూరగాయలన్నీ ఇక్కడే పండించాలని, ఎన్ని విత్తనాలు కావాలో అన్నీ ఇక్కడే ఉత్పత్తి చేయాలన్నారు. ఇందుకు తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో సమన్వయం కుదుర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటికీ పాలు ఇక్కడే ఉత్పత్తి కావాలని చెప్పారు. మాంసం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా గొర్రెలు, మేకల పెంపకం పెరగాలన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించే 46 వేల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలని అన్నారు. యూనివర్సిటీతో అనుసంధానం వ్యవసాయ వర్సిటీని బలోపేతం చేయాలని, విత్తనాలు ఉత్పత్తి చేయాలని, కొత్త వంగడాలు సృష్టించాలని, పరిశోధనలు విసృ్తతంగా జరగాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఐప్యాడ్లు కొనివ్వాలని ఆదేశించారు. పంటలకు వచ్చే చీడ పీడలను గుర్తించి, ఫొటోలు తీసి ఫోన్లు, ఐప్యాడ్ల ద్వారా పంపాలని, ఆగ్రానమిస్ట్లు విరుగుడు చర్యలు సూచించాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి దిక్సూచిలా ఉండాలి
♦ బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం ♦ అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు జరగాలి ♦ నిధుల విడుదలలో అడ్డంకులు, జాప్యం వద్దు సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, రాష్ట్ర వనరులకు అనుగుణంగా బడ్జెట్లో శాఖలకు నిధుల కేటాయింపు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. బడ్జెట్ అంటే కేవలం జమా పద్దులా కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే దిక్సూచిగా ఉండాలని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి బుధవారం శాఖల వారీగా సమీక్షలను ప్రారంభించారు. న్యాక్‌లో జరిగిన మొదటి రోజు సమీక్షలో ఆర్అండ్బీ, రవాణా, ఆర్టీసీ, పోలీస్, జైళ్ల శాఖలపై సమీక్ష జరిపారు. అధికార ప్రక్రియలో, నిధుల విడుదలలో అడ్డంకులు, జాప్యం తొలగిపోవాలని, సరళీకృత పద్ధతులు కావాలని, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కూడా మారాలని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ తనకున్న ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మంచి విధానం ఉన్నా స్వీకరించాలన్నారు. ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కేటాయించిన నిధులెన్ని.. ఖర్చయినవి ఎన్ని? గత బడ్జెట్లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులెన్ని..? అందులో ఖర్చయినవి ఎన్ని..? నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో ఖర్చు కాకపోవడానికి కారణాలేంటీ..? ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి? తదితర అంశాలపై సీఎం ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. రాష్ట్రం యూనిట్‌గా కాకుండా జిల్లా యూనిట్‌గా అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా ప్రజల అవసరాలేంటీ? శాఖలవారీగా ఎన్ని నిధులు అవసరం? గత బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారు? తదితర అంశాలతో జిల్లా అభివృద్ధి కార్డులు తయారు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీస్ శాఖలకు అవసరమైన మేర నిధులు కేటాయించేందుకు, భవనాలు కట్టేందుకు, వాహనాలు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయ భవనాలు నిర్మించాలని, అందుకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. కొత్త రహదారులు ఎక్కడ కావాలి.. వంతెనలు ఎన్ని కావాలి.. మరమ్మతులు చేయాలంటే ఎంత కావాలో అంచనా వేసి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలను తయారు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అవసరమైన వ్యూహం అనుసరించాలని కేసీఆర్ రవాణా, ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా రూట్లను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీస్ శాఖ సమన్వయంతో రద్దీ తగ్గించడానికి, ప్రమాదాలు నివారించడానికి, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. అదనపు పోలీస్ స్టేషన్ల ఏర్పాటు పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారు. పోలీస్ శాఖలోని వివిధ అధికారుల సర్వీసు అంశాల్లో వివాదాలున్నాయని, వాటిని తొలగించాలని సూచించారు. అదనపు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.