అభివృద్ధికి దిక్సూచిలా ఉండాలి
♦ బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం
♦ అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు జరగాలి
♦ నిధుల విడుదలలో అడ్డంకులు, జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, రాష్ట్ర వనరులకు అనుగుణంగా బడ్జెట్‌లో శాఖలకు నిధుల కేటాయింపు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. బడ్జెట్ అంటే కేవలం జమా పద్దులా కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే దిక్సూచిగా ఉండాలని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి బుధవారం శాఖల వారీగా సమీక్షలను ప్రారంభించారు. న్యాక్‌లో జరిగిన మొదటి రోజు సమీక్షలో ఆర్‌అండ్‌బీ, రవాణా, ఆర్టీసీ, పోలీస్, జైళ్ల శాఖలపై సమీక్ష జరిపారు. అధికార ప్రక్రియలో, నిధుల విడుదలలో అడ్డంకులు, జాప్యం తొలగిపోవాలని, సరళీకృత పద్ధతులు కావాలని, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కూడా మారాలని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ తనకున్న ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మంచి విధానం ఉన్నా స్వీకరించాలన్నారు. ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
కేటాయించిన నిధులెన్ని.. ఖర్చయినవి ఎన్ని?
గత బడ్జెట్‌లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులెన్ని..? అందులో ఖర్చయినవి ఎన్ని..? నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో ఖర్చు కాకపోవడానికి కారణాలేంటీ..? ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి? తదితర అంశాలపై సీఎం ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. రాష్ట్రం యూనిట్‌గా కాకుండా జిల్లా యూనిట్‌గా అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా ప్రజల అవసరాలేంటీ? శాఖలవారీగా ఎన్ని నిధులు అవసరం? గత బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయించారు? తదితర అంశాలతో జిల్లా అభివృద్ధి కార్డులు తయారు చేయాలని ఆదేశించారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీస్
శాఖలకు అవసరమైన మేర నిధులు కేటాయించేందుకు, భవనాలు కట్టేందుకు, వాహనాలు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయ భవనాలు నిర్మించాలని, అందుకు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. కొత్త రహదారులు ఎక్కడ కావాలి.. వంతెనలు ఎన్ని కావాలి.. మరమ్మతులు చేయాలంటే ఎంత కావాలో అంచనా వేసి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలను తయారు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి
తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అవసరమైన వ్యూహం అనుసరించాలని కేసీఆర్ రవాణా, ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా రూట్లను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీస్ శాఖ సమన్వయంతో రద్దీ తగ్గించడానికి, ప్రమాదాలు నివారించడానికి, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు.
అదనపు పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారు. పోలీస్ శాఖలోని వివిధ అధికారుల సర్వీసు అంశాల్లో వివాదాలున్నాయని, వాటిని తొలగించాలని సూచించారు. అదనపు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.